ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శనివారం రాత్రి డ్యాన్సులు, పాటలతో హోరెత్తించారు. డీజే సప్పుళ్లకు చిందులేశారు. కేకులు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఒకరినొకరు న్యూఇయర్ విషెస్ చెప్పుకున్నారు. దోస్తులంతా కలిసి దావత్ లు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైన్స్ లు, బార్లు కిటకిటలాడాయి. కాగా, అర్ధరాత్రి దాటాక పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఇయ్యాల రంగురంగుల ముగ్గులు వేసేందుకు మహిళలు రెడీ అయ్యారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకు చర్చిలు, ఆలయాలు ముస్తాబయ్యాయి. - వరంగల్, భూపాలపల్లి ఫొటోగ్రాఫర్స్, వెలుగు
ధర్నాలు చేస్తే కేసులు పెడ్తం
అనుమతి తప్పనిసరి: ఏసీపీ
బచ్చన్నపేట, వెలుగు: అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కేసులు పెడతామని జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లాలోని బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు, విధుల నిర్వహణపై ఆరా తీశారు. స్టేషన్ ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు. మెరుగైన ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లు రాజు, విద్యాలత, జమాలోద్దీన్, భానుచందర్ కు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు ఫైల్ చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఆందోళనలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నర్మెట సీఐ నాగబాబు, ఎస్సైలు నవీన్, సృజన్ తదితరులున్నారు.
జనం ముంగిట్లోకి న్యాయ సేవలు
జనగామ, వెలుగు: జనం ముంగిట్లోకి న్యాయ సేవలను తెచ్చేందుకు రేపు జనగామ కోర్టు ఆవరణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రారంభిం చనున్నట్లు జిల్లా జడ్జి కె.శైలజ వెల్లడించారు. శనివారం ఆమె కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గతంలో మండల న్యాయ సేవాధి కార సంస్థ ఉండేదని ఇప్పుడు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 2న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ దీనిని వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇకనుంచి రోజూ లోక్ అదాలత్ ఉంటుందని, ఇరువర్గాల సమ్మతితో వెంటనే తీర్పులు ఇస్తామన్నారు. తద్వారా సత్వర న్యాయంతో పాటు సమన్యాయం లభిస్తుందన్నారు. ఉచిత న్యాయ సేవలు కావాలనుకుంటే కోర్టు ఆవరణలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్అథారిటీని నేరుగా కలిసి విన్నవించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పి.ఆంజనేయులు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.టి. పృథ్విరాజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ నర్మద ఉన్నారు.
చల్లా అవినీతిని బయటపెడతాం
ఆత్మకూరు(దామెర), వెలుగు: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవినీతిని బయటపెట్టి, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టుల పేరుతో చల్లా చేసే అవినీతి అక్రమాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామన్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాలు గాలిలో కలిసిపోయాయన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జి పెసరు విజయ చందర్ రెడ్డి, రాజయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్, గురజాల శ్రీరామ్ రెడ్డి, నాగరాజు, సదానందం ఉన్నారు.
అటెండెన్స్ పెంచడంలో నిర్లక్ష్యమా?
ఆఫీసర్లపై కలెక్టర్ ఆగ్రహం
భూపాలపల్లి రూరల్ వెలుగు: ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్ల అటెండెన్స్ ను పెంచకపోవడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా విద్యాశాఖ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శని వారం కలెక్టరేట్ లో ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. స్టూడెంట్ల హాజరు, విద్యాప్రమాణాల పెంపుపై ఆరా తీశారు. అటెండెన్స్ పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి పిల్లల హాజరుశాతాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలన్నారు. బడికి రాని స్టూడెంట్లను గుర్తించి పేరెంట్స్, గ్రామ ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని, పిల్లలకు కొత్త పద్ధతుల్లో పాఠాలు చెప్పాలన్నారు. డిజిటల్ క్లాస్ రూంలను ఉపయోగించుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని కోరారు. జిల్లాలోని 28 స్కూళ్లకు ఈ నెల 26 నాటికి ల్యాప్ టాప్‌లు పంపిణీ చేస్తామన్నారు.
అనాథ పిల్లలతో న్యూ ఇయర్ వేడుకలు
హనుమకొండ ఏకశిలా హైస్కూల్ స్టూడెంట్లు న్యూఇయర్ వేడుకల్ని ‘అతిథి’ దివ్యాంగుల ఆశ్రమంలో జరుపుకున్నారు. పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి, డైరెక్టర్ బేతి కొండల్ రెడ్డి, ప్రిన్సిపల్ శైలజారెడ్డి ఉన్నారు. - హనుమకొండ, వెలుగు
స్టూడెంట్లను గెంటేసిన బిల్డింగ్ ఓనర్
పరిశుభ్రత సాకు చెప్పి సామాన్లు బయటపడేసిండు
రోడ్డునపడ్డ 50మంది స్టూడెంట్లు
హసన్ పర్తి, వెలుగు: హాస్టల్లో పరిశుభ్రత పాటించడం లేదనే సాకుతో ఆ బిల్డింగ్ యజమాని ఉన్నట్టుండి స్టూడెంట్లను బలవంతంగా ఖాళీ చేయించాడు. సామాన్లు, బ్యాగులను రోడ్డుపై విసిరేసి గేటు వేసుకున్నాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామారంలో జరిగింది. స్టూడెంట్ల వివరాల ప్రకారం.. రామారంలో నాగపురి ప్రేమ్ అనే వ్యక్తి ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్నాడు. ఈ హాస్టల్ బిల్డింగ్‌ను కానిస్టేబుల్ రాజయ్య నుంచి ప్రేమ్ అద్దెకు తీసుకున్నాడు. గత కొద్దిరోజులుగా హాస్టల్ నిర్వాహకుడు ప్రేమ్, బిల్డింగ్ ఓనర్ రాజయ్య మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో రాజయ్య హాస్టల్ ఖాళీ చేయించాలని ప్రేమ్ ను కోరాడు. దీంతో ఆయన కొంత టైం అడిగాడు. అయినా వినకుండా రాజయ్య తన కుటుంబసభ్యులతో శనివారం ఉదయం హాస్టల్లో ఉన్న స్టూడెంట్లను బలవంతంగా ఖాళీ చేయించాడు. సామాన్లు, బ్యాగులను బయట విసిరేశారు. విషయం తెలుసుకున్న ప్రేమ్ అక్కడికి చేరుకుని స్టూడెంట్లతో నిరసన తెలిపాడు. అనంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న సీఐ దయాకర్, ఎస్ఐ సతీశ్‌కుమార్ రాజయ్యతో మాట్లాడారు. స్టూడెంట్లను హాస్టల్ లోనే ఉంచాలని ఆదేశించారు.