పర్వతగిరి(సంగెం), వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలను కోరారు. మంగళవారం వరంగల్ జిల్లాలోని సంగెం, గీసుగొండ మండలాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పర్యటించారు. బిక్కోజీ నాయక్ తండా నుంచి బాలు నాయక్ తండా వరకు రూ.2.68కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గీసుగొండ మండల కోనాయిమాకులలో రూ.87.45లక్షలతో కట్టే బాల సదన్ బిల్డింగ్ కు కొబ్బరికాయ కొట్టారు.
మహిళా సంఘాలకు రూ.5కోట్ల లోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని చూసి, ఓర్వలేని ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తండాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, స్వరాష్ట్రంలో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. బీజేపీ నాయకులు మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వకాడే, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ పద్మ తదితరులున్నారు.
జీపీ బిల్డింగ్‌ల ఘనత ఎమ్మెల్యేలదే!
కొందరు తమవల్లేనని గొప్పులు చెప్తున్నరు: రెడ్యా నాయక్
మరిపెడ(చిన్నగూడూరు), వెలుగు: ఎమ్మెల్యేల వల్లే గ్రామ పంచాయతీ బిల్డింగుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. కొందరు తమవల్లే ఫండ్స్ రిలీజ్ అయ్యాయని గొప్పులు చెప్తున్నారని పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూరు మండలంలోని తన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడారు. డోర్నకల్ కు సర్కారు 68 జీపీ భవనాల నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసిందన్నారు.
ఎమ్మెల్యేల ప్రపోజల్స్ వల్లే ఇది సాధ్యమైందని, ఇందులో మరెవరి కృషి లేదని స్పష్టం చేశారు. మోకాలుకు శస్త్ర చికిత్స కోసం రెండు నెలల పాటు హైదరాబాద్ వెళ్లానని, ఆసుపత్రిలో ఉండి కూడా నియోజకవర్గంలో రోడ్ల రిపేర్లకు రూ.41.9కోట్లు మంజూరు చేయించానన్నారు. గత 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రజలను విడిచి ఉండలేదని భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ కోఆప్షన్ మెంబర్ఆయుబ్ పాషా ఉన్నారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు
హసన్ పర్తి, వెలుగు: రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. మంగళవారం అడిషనల్కలెక్టర్ సంధ్యారాణితో కలిసి బీమారం, హసన్ పర్తి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. హసన్ పర్తి రేషన్ షాపును తనిఖీ చేసి బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను పరిశీలించారు. నాగారం, సుదనపల్లి గ్రామాల్లోని నర్సరీలను చెక్ చేశారు. మొక్కలు బయట కొనకుండా పూర్తిగా నర్సరీల్లోనే పెంచాలన్నారు. పండ్ల మొక్కలు పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు.
పనుల్లో వేగం పెంచాలి..
జనగామ అర్బన్: జనగామ శివారు చంపక్ హిల్స్వద్ద ఐదెకరాల్లో నిర్మిస్తున్న టౌన్ పార్క్ పనుల్ని మంగళవారం అడిషనల్కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. డంపింగ్‌యార్డ్, ఎఫ్ ఎస్ టీ పీని పరిశీలించి సూచనలు చేశారు.
బీఆర్ఎస్ కు తిరుగులేదు
ములుగు, వెలుగు: దేశంలో బీఆర్ఎస్ కు తిరుగులేదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం ఆయన ములుగు గట్టమ్మతల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం జడ్పీ ఆఫీసులో చైర్మన్ జగదీశ్వర్ ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ... ములుగు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు వివరిస్తూ.. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్పోరిక గోవింద్ నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాదం ప్రవీణ్, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య తదితరులున్నారు.
పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోండి
ములుగు, వెలుగు: ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క ఆఫీసర్లను కోరారు. మంగళవారం ములుగులోని తన క్యాంప్ ఆఫీసులో ఆఫీసర్లతో రివ్యూ చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. సమష్టిగా పనిచేసి వెనుకబడిన ములుగు ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేక బస్సు రావడం లేదన్నారు. కాలువలు, వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని, వీటిని సకాలంలో పూర్తి చేయాలన్నారు.