కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) వర్ధంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాకా చివరి శ్వాస వరకు పేదల కోసమే పనిచేశారని కొనియాడారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి సైతం పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
ఆయా కార్యక్రమాల్లో స్తంభంపల్లి(పీపీ) సర్పంచ్ జాడి రాజయ్య, మాలమహానాడు స్టేట్ లీడర్ మెరుగు పాపారావు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పసుల శివ, బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పసుల లక్ష్మణ్, జంగిడి రాజేందర్, బొబ్బిలి శ్రీకాంత్, కాటారం బీజేపీ మండలాధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ దుర్గం తిరుపతి, కొండ రాజమల్లు,జాడి లక్ష్మణ్,మల్లారెడ్డి, శ్రీశైలం, రవీందర్, దోమల సమ్మయ్య పాల్గొన్నారు. - వెలుగు నెట్ వర్క్
ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర
రేపు జిల్లా కేంద్రాల్లో బీఆర్‍ఎస్ ధర్నాలు
వరంగల్, జనగామ, రాయపర్తి, పాలకుర్తి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఆపాలని కుట్ర చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ఆరోపించారు. గురువారం హనుమకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్లో చీఫ్ విప్ వినయ్‍భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‍రెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీనివాస్‍రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతు కల్లాల నిర్మాణాన్ని కేంద్రం అడ్డుకుంటోందన్నారు.
ఇప్పటికే బిల్లుల రూపంలో రైతులకు రూ.151 కోట్లు చెల్లించామని.. వాటిని తిరిగి వసూలు చేస్తేనే పెండింగ్‍లో ఉన్న రూ.1100 కోట్లు రిలీజ్ చేస్తామని కేంద్రం మెలికపెట్టిందని ఆరోపించారు. ఉపాధి హామీలో తెలంగాణ బెస్ట్ అంటూ అవార్డులు ఇచ్చిన కేంద్రం.. నిధుల విషయంలో మాత్రం వివక్ష చూపుతోందన్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి బీఆర్‍ఎస్ పార్టీ ధర్నాలు చేయనున్నట్లు వెల్లడించారు. జనగామ జిల్లా కేంద్రంలోనూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి కేంద్రం తీరును ఖండించారు. బీఆర్ఎస్ ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మత పిచ్చోళ్లను ఊర్లోకి రానీయొద్దు
వరంగల్ జిల్లా రాయపర్తి, జనగామ జిల్లా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్రిస్మన్ కానుకలను పంపిణీ చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేసే వారు మూర్ఖులని, మత పిచ్చి ఉన్నవాళ్లను ఊర్లోకి రానీయొద్దన్నారు. గత ఎనిమిదేండ్లలో ఒక్క చోట కూడా మత ఘర్షణలు జరగలేదని స్పష్టం చేశారు. వరంగల్కలెక్టర్ గోపి తదితరులున్నారు.
పీవీ టూరిజంపై సర్కారు నిర్లక్ష్యం
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పుట్టి పెరిగిన హనుమకొండ జిల్లా లక్నేపల్లి, వంగర గ్రామాలను టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తామని రెండేండ్ల కింద సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్, ఢిల్లీలో పీవీ విగ్రహాలతో పాటు అసెంబ్లీలో పోట్రెయిట్ పెడతామన్నారు. విగ్రహాల సంగతి దేవుడెరుగు కానీ కనీసం టూరిజం పనులను కూడా పూర్తి చేయలేదు. గ్రామంలో ప్రారంభించిన పీవీ స్మృతివనం, ధ్యానమందిరం, మ్యూజియం, లైబ్రరీ, థియేటర్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. అంతేకాక ఆయా గ్రామాల చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే సతీశ్ కుమార్ గతంలో శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. కాకతీయ యూనివర్సిటీలో పీవీ విజ్ఞాన పీఠం పనులు కూడా మొదలుపెట్టలేదు. - హనుమకొండ, భీమదేవరపల్లి, వెలుగు
పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ
30 కేసుల్లో జైలుకు అయినా మారని తీరు
నర్సంపేట, వెలుగు: ఓ వ్యక్తి జల్సాల కోసం చోరీలు చేయడమే వృత్తిగా మలుచుకున్నాడు. 30 కేసుల్లో జైలుకు పోయి వచ్చినా బుద్ధి మార్చుకోలేదు. దొంగతనం చేస్తూ మళ్లీ పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన జింక నాగరాజు(32).. చిన్నప్పటి నుంచే జల్సాలకు అలావాటు పడ్డాడు.
ఈజీగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశంతో 2010 నుంచి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఉమ్మడి కరీంనగర్ లో అనేక చోరీలు చేశాడు. అక్కడ చోరీలు చేస్తే పోలీసులు గుర్తుపడతారని వరంగల్ కు మకాం మార్చాడు. నర్సంపేట, గీసుగొండ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ గా చోరీలు చేశాడు. నర్సంపేటలో ఏడు, గీసుగొండలో ఒక దొంగతనానికి పాల్పడ్డాడు. బంగారు, వెండి అభరణాలు, క్యాష్ ఎత్తుకెళ్లాడు.
ఫ్రెండ్స్ ద్వారా అమ్మకాలు..
చోరీ చేసిన సొత్తున నాగరాజు తన ఫ్రెండ్స్అయిన నాగుల ప్రవీణ్, కట్ట రాజు, ఉల్లందుల ప్రశాంత్, వల్లంపట్ల పరమేశ్ ద్వారా అమ్మేవాడు. గతంలో నర్సంపేటలో యాక్టివా వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. బుధవారం సాయంత్రం అదే వాహనంపై నర్సంపేటకు వస్తుండగా.. అయ్యప్ప టెంపుల్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. వివరాలు ఆరా తీయగా అనుమానాస్పదంగా కనిపించడంతో లోతుగా విచారించారు.
దీంతో ఆయన చేసిన చోరీలు బయటపడ్డాయి. నిందితుడి వద్ద 33.7తులాల బంగారు ఆభరణాలు, 115 తులాల వెండి, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నాగరాజుతో పాటు తన నలుగురి ఫ్రెండ్స్ ను ఈస్ట్ జోన్ డీసీపీ కె.వెంకటలక్ష్మి అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ప్రతిభకనబర్చిన పోలీసులను అభినందించారు.
నిద్రమత్తులో డ్రైవర్.. బోల్తా పడ్డ టాటా ఏస్
- క్యాబిన్ లో చిక్కుకున్న వృద్ధురాలి మృతి
- తొమ్మిది మందికి గాయాలు
భీమదేవరపల్లి, వెలుగు: నిద్రమత్తులో టాటా ఏస్ నడపడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన చల్లా నాగేశ్వరరావు కుటుంబసభ్యులు తెలంగాణలోని పలువురు బిల్డర్ల కింద సెంట్రింగ్ పనులు చేసేవారు. భద్రాచలంలో ఓ బిల్డర్ వద్ద ఇటీవల పనులు చేశారు. సిద్దిపేటలోనూ ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసేందుకు గురువారం తెల్లవారుజామున భద్రాచలం నుంచి సొంత టాటా ఏస్ ట్రాలీలోనే బయలుదేరారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులోకి రాగానే ఆటో అదుపుతప్పి వేగంగా కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఉదయాన్నే నడకకు వెళ్తున్న స్థానికులు వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ములుకనూర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వాహనం ముందు భాగంలో కూర్చున్న వృద్ధురాలు క్యాబిన్ లోనే ఇరుక్కుపోయింది. దీంతో పోలీసులు మూడు గంటల పాటు శ్రమించి కట్టర్ సాయంతో ఆమెను బయటకు తీశారు. సాయంత్రం చికిత్స పొందుతూ వృద్ధురాలు గురువమ్మ(62) మృతి చెందింది.
కారు.. ఆటో ఢీ: నలుగురికి గాయాలు..
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ పట్టణ పరిధిలోని జామండ్లపల్లి వద్ద కారు, ఆటో ఢీకొనడంతో నలుగురి గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని గూడూరు మండలం మట్టెవాడకు చెందిన రహీం కుటుంబం గురువారం ఉదయం ఆటోలో మహబూబాబాద్ నుంచి సొంతూరుకు వస్తున్నారు. ఈక్రమంలో జామండ్లపల్లికి రాగానే నర్సంపేట నుంచి వస్తున్న కారు.. వీరి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రహీం, రిజ్వానా, జావిద్, రజాక్, అయేషాలకు గాయాలు అయ్యాయి. ఇందులో అయేషా పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.
మంథనిలో తండ్రీకొడుకులదే రాజ్యం
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
మహాముత్తారం, వెలుగు: మంథని నియోజకవర్గంలో గత నలభై ఏండ్లుగా తండ్రీకొడుకులే పెత్తనం చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్ చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల్లో చైతన్యం పెరిగితేనే ఆర్థికాభివృద్ధి సాధించి, ఆదర్శంగా నిలబడతారని సూచించారు. మహిళలు సమ్మక్క, సారక్క, సావిత్రిబాయి ఫూలేలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సర్పంచ్ గంట వనజ కొండల్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి, మంథని నియోజకవర్గ అధ్యక్షురాలు గీతాబాయి తదితరులున్నారు.
ఇండ్ల బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హనుమకొండ, వెలుగు: నిరుపేదలు ఇండ్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఇండ్లు కట్టించకుండా, ఇప్పుడు రూ.3లక్షలు ఇస్తామంటోందని విమర్శించారు. బేషరతుగా పేదలకు ఇండ్ల పట్టాలతో పాటు రూ.5లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నాయని మండిపడ్డారు. పేదలకు ఇండ్ల స్థలాల కోసం లక్ష మందితో హైదరాబాద్ ను ముట్టడిస్తామని, ఢిల్లీలో కూడా ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో అభివృద్ధిని మరిచి మతోన్మాదాన్ని పెంచుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మకానికి పెడుతోందని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అక్కడ అభివృద్ధికి కృషి చేయకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆరోపించారు.
ఎంజీఎంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎంలో సీఎం క్యాంప్ ఆఫీసును గురువారం ఓపెనింగ్ చేశారు. చీఫ్ గెస్టుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జీఎం డాక్టర్ దయానంద్ హాజరై మాట్లాడారు. ఎంజీఎంలో అన్ని రకాల సేవలు అందుతున్నాయని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అనంతరం అన్ని డిపార్ట్ మెంట్ల సిబ్బందితో రివ్యూ చేశారు. మెరుగైన సేవలు అందించాలని కోరారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిప్యూటీ సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు కె.మురళి, దినేశ్జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ జి.కమల్ ఉన్నారు.