27,28 తేదీల్లో రామప్ప దర్శనం నిలిపివేత
వెంకటాపూర్(రామప్ప), వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న రామప్పకు రానున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం రామప్పలో హెలిప్యాడ్, ఆలయ సుందరీకరణ పనుల్ని పరిశీలించారు. రోడ్లకు రిపేర్లు చేయాలని, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏఎస్ పీ సుధీర్ రాంనాథ్‌కేకన్ ను ఆదేశించారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 27,28 తేదీల్లో రామప్ప ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ వెల్లడించింది.
కొనుగోలు సెంటర్ తనిఖీ
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలకేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ శశాంక పరిశీలించారు. ప్రతి రోజూ మాయిశ్చర్ శాతాన్ని నమోదు చేయాలని, ఉదయం 11 దాటిన తర్వాతే తేమ శాతం కొలవాలన్నారు. రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దన్నారు. అ నంతరం కొత్తపేటలోని రేషన్ షాప్‌ను తనిఖీ చేశారు.
రెండ్రోజుల్లో పనులు పూర్తి చేయాలి
జనగామ అర్బన్: జనగామ జిల్లాలో ప్లే గ్రౌండ్ల పనులు రెండ్రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ బాగుండాలని, శ్మశాన వాటికలకు రోడ్లు వేయాలన్నారు. ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటించి పనులు పర్యవేక్షించాలన్నారు.
రేషన్ షాప్ తనిఖీ..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలోని రేషన్ షాప్ ను కలెక్టర్ శివలింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్ విధానం, స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణీ చేయాలన్నారు.
లారీ కింద పడి బాలిక మృతి
మేనమామతో వచ్చి తిరిగిరాని లోకానికి
డోర్నకల్ లో విషాదం..
కురవి(డోర్నకల్), వెలుగు: అభంశుభం తెలియని ఎనిమిదేండ్ల చిన్నారి లారీ కింద పడి ప్రాణాలు విడిచింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలకేంద్రానికి చెందిన పాలెం కుర్మయ్య కూతురు అంజలి(8) తన మేనమామ గణేశ్‌తో కలిసి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో ఉంటోంది. గణేశ్, అతని భార్య ఉయ్యాలవాడలోని సీతారామ ప్రాజెక్టు క్యాంప్ లో ఉంటూ ప్రాజెక్టు పనికి వెళ్లేవారు.
అంజలి క్యాంప్ లోనే ఉంటూ గణేశ్బిడ్డలను ఆడించేది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వాటర్ ట్యాంకర్ వెనుకభాగం నుంచి వాహనం ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఇది గమనించని డ్రైవర్ వెహికల్ స్టార్ట్ చేసి రివర్స్ గేర్ వేశాడు. దీంతో ఆ చిన్నారి టైర్ కింద పడి నలిగిపోయింది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అంజలి చనిపోయింది. దీంతో సీతారామ క్యాంప్ లో విషాదం నెలకొంది.
ఆడుకుంటూ.. నీటి సంపులో పడి..
నర్సింహులపేట: ఎంతో సంతోషంగా ఆడుకుంటూ వెళ్లి, నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోప తండా జీపీ పరిధిలోని కొత్త తండాలో జరిగింది. తండాకు చెందిన వీరన్న, సౌందర్య దంపతులకు కొడుకు గణేశ్(2) ఉన్నాడు. శుక్రవారం ఉదయం తల్లి సౌందర్య ఇంట్లో పనిచేస్తుండగా.. గణేశ్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. ఇంటి ఆవరణలో సంపుపై మూత పెట్టకపోవడంతో అందులో పడిపోయాడు. కొద్దిసేపటికి గణేశ్కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. సంపులో చూడడంతో గణేశ్డెడ్ బాడీ కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.
పెట్రోల్ కోసం వెళ్తూ..
యాక్సిడెంట్లో సీపీఎం లీడర్ మృతి
ములుగు (గోవిందరావుపేట): బైక్ పై పెట్రోల్ కోసం వెళ్తున్న సీపీఎం లీడర్ ను కారు ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలై మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన సీపీఎం లీడర్ సామా వెంకట్ రెడ్డి(55) శుక్రవారం నేషనల్ హైవే వెంట ఉన్న మేడారం రూట్లోని పెట్రోల్ బంక్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ములుగు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. వెంకట్ రెడ్డి మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అవినీతి ఎమ్మెల్యే ‘వినయ్ భాస్కర్’
కేయూ ల్యాండ్స్ కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం: నాయిని రాజేందర్‍రెడ్డి
వరంగల్, వెలుగు: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ భూకబ్జాలకు, సెటిల్‍మెంట్లకు చిరునామా అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన జిల్లా పార్టీ ఆఫీస్‍లో ప్రెస్‍మీట్ నిర్వహించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వినయ్‍భాస్కర్ కొందరు పోలీసులు, గుండాలను అడ్డుపెట్టుకుని భూకబ్జాలకు పాల్పడుతున్నాడన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వారిని మందలించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏషియన్ మాల్ వద్ద డబుల్ ఇండ్ల పేరుతో డబ్బులు వసూలు చేశారన్నారు.
ఇది నిజం కాకుంటే ఐదేండ్లుగా నిర్మాణం పూర్తి చేసుకుని శిథిలావస్థకు వస్తున్న 500 ఇండ్లను ఎందుకు పంపిణీ చేయట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సోదరుడు ప్రణయ్ భాస్కర్ పేరు చెప్పుకుని పదవులు పొందాడని.. ఆయన పోరాటం చేసిన కాజీపేట బస్టాండ్ ఏదని ప్రశ్నించారు. వినయ్ భాస్కర్ తన అనుచరుడైన రెడ్డిపురం భూకబ్జాదారుడు రంజిత్‍రెడ్డి సాయంతో ఇందిరమ్మ ఇండ్లు, కేయూ భూముల్లో తన హస్తం ఉన్నట్లు బురద జల్లేలా తప్పుడు పోస్టర్లు వేయించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కేయూ భూకబ్జాల్లో తాను ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకోనున్నట్లు ప్రకటించారు.
కేయూ సమస్యలు పరిష్కరించండి
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో పాలన గాడితప్పిందని, వర్సిటీ సమస్యలను పట్టించుకోవాలని ఏబీవీపీ లీడర్లు, విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మాచర్ల రాంబాబు మాట్లాడుతూ.. కొత్తగా రెండు హాస్టల్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎస్ఎఫ్సీ కోర్సుల విద్యార్థులకు హాస్టల్ వసతి లేదంటూ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. చదువుకోవడానికి వస్తే నిత్యం ఉద్యమం చేయాల్సి వస్తోందన్నారు. ఇష్టారీతిన ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపారని మండిపడ్డారు.
చాలా డిపార్ట్ మెంట్లలో ప్రొఫెసర్లు లేరని, కనీసం పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీని కూడా నియమించకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. వర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, కేయూలో పని చేసే అధికారులే కబ్జాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ.. వారం రోజుల్లో క్యాంపస్ ను విజిట్ చేస్తానని, వర్సిటీ ఆఫీసర్లతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏబీవీపీ యూనివర్సిటీ ఇన్ చార్జి నిమ్మల రాజేశ్ ఉన్నారు.
కోవర్టులకు గుణపాఠం తప్పదు
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కాంగ్రెస్ లో కోవర్టులకు గుణపాఠం తప్పదని ఆ పార్టీ జిల్లా నాయకులు డా.మురళీ నాయక్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఇక్కడి డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా జరిగిందని, పైరవీలతో కాదన్నారు. మాజీ జడ్పీటీసీ జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, కొందరు నాయకులు గాంధీ భవన్లో తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తున్నామన్నారు. పదవుల కోసం పార్టీలు మారి, గ్రూపు రాజకీయాలు చేసి, బీఆర్ఎస్, బీజేపీ తరిమిగొడితే ఇక్కడికి వచ్చారన్న విషయాన్ని వెంకటేశ్వర్లు మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్ వల్లే ప్రజాప్రతినిధివయ్యావన్నారు. ఉద్యోగాలు ఇస్తామని పైసలు వసూలు చేసి, భూకబ్జాలు, సెటిల్ మెంట్లకు పాల్పడి నీతి వాక్యాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ భరత్ చందర్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడడం మానుకోవాలన్నారు.
కేంద్రంపై భగ్గుమన్న బీఆర్ఎస్
రైతు కల్లాల కోసం వినియోగించిన ఉపాధి హామీ నిధుల్ని తిరిగి చెల్లించాలని కేంద్రం ఆదేశించడంపై బీఆర్ఎస్ లీడర్లు భగ్గుమన్నారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేశారు. కేంద్రం తీరును తప్పుపట్టారు. రైతులకు మంచి చేస్తుంటే కేంద్రం ఓర్వడం లేదని ఆరోపించారు. ఉపాధి నిధులు గల్లంతు కాలేదని, అవసరాల కోసమే వినియోగించామని తెలిపారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. – వెలుగు నెట్ వర్క్
రైతు లేకుంటే మనుగడ లేదు
రైతు లేకుంటే మానవ మనుగడ లేదని ఆఫీసర్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు కొనియాడారు. శుక్రవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల్ని సత్కరించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సేవలు ఎంతో గొప్పవన్నారు. స్టూడెంట్లు సైతం ముందుకొచ్చి రైతులకు పూల దండలు వేసి, శుభాకాంక్షలు తెలిపారు. – వెలుగు నెట్ వర్క్