ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

కాజీపేట, వెలుగు: సాధారణ తనిఖీలలో భాగంగా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పర్యటించారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీపేటకు వచ్చిన జీఎంకి స్థానిక అధికారులు స్వాగతం పలకగా, రైల్వే పోలీసులు మార్చ్ ఫాస్ట్ తో గౌరవ వందనం చేశారు. స్టేషన్​ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రైల్వే ప్లాట్ ఫాం, టికెట్ బుకింగ్ కౌంటర్​తో పాటుగా స్టేషన్ పరిసరాలను జీఎం తనిఖీ చేశారు.  అనంతరం రైల్వే ఆధ్వర్యంలో రూ. 6  కోట్లతో రైల్వే స్టేషన్​లో ఆధునీకరించిన రీఫ్రెష్​మెంట్ రూమ్, రిజర్డ్వ్ లాంజ్,  రైల్వే హెల్త్ యూనిట్​లో నూతన డిజిటల్ ఎక్స్ రే, క్రూ లాబీ, 50 కేవీ సోలార్ ప్లాంట్, డీజిల్ కాలనీలోని చిల్ర్డన్స్ పార్క్, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, ఓపెన్ జిమ్ తదితరాలను ప్రారంభించారు. పలువురు యూనియన్ నాయకులు జీఎంను కలిసి పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై వినతిపత్రం అందించారు.

అరుణ్ కుమార్ జైన్ ను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జంక్షన్ కు సంబంధించిన ప్లాట్ ఫాంల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు పిరియాడికల్ ఓవర్​హాలింగ్ సెంటర్ పనులు ప్రారంభించడం, సబ్ డివిజనల్ ఆసుపత్రి ఏర్పాటు, రైల్వే స్టేడియంలో క్రీడాకారులను అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని, స్టేషన్ బయట గల రైల్వే స్థలంలో ఆటో  స్టాండ్ నిర్వహించుకుంటున్న  డ్రైవర్లకు ట్యాక్స్ రద్దు చేయడం వంటి విషయాలపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రాన్ని అందజేశారు.

పీవోహెచ్ నిర్మాణానికి చొరవ చూపండి

హనుమకొండ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు మంజూరు చేసిన పిరియాడికల్​ఓవర్​హాలింగ్​(పీవోహెచ్​) షెడ్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని సౌత్​ సెంట్రల్​ రైల్వే జీఎం ఏకే జైన్​ కు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విజ్ఞప్తి చేశారు. కాజీపేట జంక్షన్​లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి  వచ్చిన ఏకే జైన్ ను శుక్రవారం ఉదయం రావు పద్మ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2017లో మోడీ ప్రభుత్వం పీవోహెచ్​ ఏర్పాటుకు నిధులు కేటాయించిందన్నారు. కానీ సరిపడా భూమి ఇవ్వకపోవడంతో పనులు స్టార్ట్​ కావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పీవోహెచ్​ షెడ్​ కు ​భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైల్వే స్టేషన్​ పరిధిలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆటోలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా స్థలం కేటాయించాలని కోరారు. రావు పద్మ వెంట బీజేపీ నాయకులు చాంద్ పాషా, నిర్మల, గుంటి కుమారస్వామి, భగవాన్ ఉపాధ్యాయ, ఆకుల శ్రీకాంత్, గందేసిరి శ్రీకాంత్, నర్సింగ్ గౌడ్, కరుణాకర్, జాఫర్, రమేష్, తదితరులు ఉన్నారు.

మహబూబాబాద్ లో సైన్స్ ఫెయిర్

  ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్​లో శుక్రవారం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. చీఫ్ గెస్టులుగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరై ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. స్టూడెంట్లలోని క్రియేటివి టీని చాటిచెప్పడానికి సైన్స్ ఫెయిర్ చక్కటి వేదిక న్నారు. విద్యారంగంలో జిల్లాను అగ్రభాగాన నిలి పేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ స్కూల్ డెవ లప్ మెంట్ కోసం రూ.కోటి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైతే సొంత డబ్బును కూడా ఖర్చు చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, డీఈవో అబ్దుల్ హై, తదితరులున్నారు.

ఐదుగురు స్టూడెంట్ల సస్పెన్షన్

పేరెంట్స్ లేకుండానే ఆర్సీవో విచారణ

మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్​లో టెన్త్ క్లాస్ స్టూడెంట్లపై, ఇంటర్ స్టూడెంట్ల దాడిపై ఆర్సీవో ప్రత్యూష ఎంక్వైరీ చేశారు. ఐదుగురు స్టూడెంట్లను పర్మనెంట్ గా సస్పెండ్ చేయగా.. మిగిలిన స్టూడెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సస్పెండ్ అయిన వారిలో ఒకరు టెన్త్, నలుగురు ఇంటర్ స్టూడెంట్లు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యూష మాట్లాడుతూ.. స్కూల్ లో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు ఆధారాలు లభించలేదని, స్కూల్ సిబ్బంది తప్పేమీ లేదన్నారు. స్టూడెంట్లను కంట్రోల్ లో పెట్టే పీడీ, పీఈటీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే డిప్యూటేషన్ పై పంపినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. పేరెంట్స్ లేకుండా ఆర్సీవో ఎంక్వైరీ చేయడం పట్ల పేరెంట్స్ మండిపడుతున్నారు. 650మంది ఉన్న స్కూల్​లో పీడీ, పీఈటీని నియమించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

స్వామీజీ రూం సీజ్ పై ఎంక్వైరీ

కాజీపేట, వెలుగు: మడికొండ మెట్టుగుట్ట రామలింగేశ్వర ఆలయ ఆవరణలోని అన్నదాన సత్రంలో స్వామీజీకి కేటాయించిన గదిని ఆఫీసర్లు సీజ్ చేయడంపై ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు శుక్రవారం ఎంక్వైరీ చేపట్టారు. రెండు నెలల కింద మెట్టుగుట్టపై ధ్యానం చేసుకునేందుకు స్వామి చైతన్యానంద భారతి రాగా.. తొలుత ఆలయాధికారులు ఆయనకు గది కేటాయించారు. రెండు నెలలైనా ఖాళీ చేయకపోవడంతో ఆ రూంను సీజ్ చేశారు. దీనిపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్​ దళ్ ప్రతినిధులు మండిపడ్డారు.  స్వామీజీని తిట్టడమే కాకుండా, గదిని సీజ్ చేసి, ఆయన వస్తువులను ఇష్టానుసారంగా పారేశారని ఎండోమెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీసీ శ్రీకాంత్ రావు ఈ ఘటనపై వివరాలు సేకరించారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. స్వామిజీ ఇక్కడే ఉండదల్చుకుంటే గదిని కేటాయించాలని ఈవోను ఆదేశించారు. అనంతరం మడికొండ సేవా భారతి ఆధ్వర్యంలోని కౌశాలయంలో విడిది చేస్తున్న స్వామిజీని ఈవోతో కలిసి మాట్లాడారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మహానగర కార్యదర్శి శ్రీరామ్ ఉదయ్ కుమార్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు దువ్వ నవీన్, ఈవో శేషు భారతి, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు.

తహసీల్దార్ ఆఫీసు ముందు రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామ సర్పంచ్.. తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తూ ఎల్కతుర్తిలోని తహసీల్దార్ ఆఫీసు ఎదుట అదే గ్రామానికి చెందిన ఓ రైతు తన కుటుంబసభ్యులతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గ్రామానికి చెందిన బండి ఐలయ్యకు రెండెకరాల 22 గుంటల భూమి ఉంది. ఐలయ్య తన అవసరాల కోసం తాండూర్ కు చెందిన నారా రవికుమార్ శ్రావణి వద్ద రూ.23 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి ఒప్పందం కుదుర్చుకొని, ఐలయ్య తన భూమిని నారా శ్రావణి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపాడు. ఈ క్రమంలో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ అయ్యిందని, తాను తీసుకున్న డబ్బులు మిత్తీతో కలిపి ఇస్తానని ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు. కానీ, తన భూమిని శ్రావణి.. జీల్గుల సర్పంచ్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్ బుక్ చేసినట్లు తెలుసుకొని భార్యా పిల్లలతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను మీద చల్లుకొని, భార్యాపిల్లలపై చల్లుతుండగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులకు, 108 సిబ్బంది కి సమాచారం ఇచ్చారు. విషమై ఎస్సై పరమేశ్​ను సంప్రదించగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నాయబ్ తహసీల్దార్ సునీతను వివరణ కోరగా చల్లా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి పేరిట స్లాట్ బుక్ చేసుకున్నారని, ప్రస్తుతం పట్టా కాలేదని అన్నారు.

మాజీ వీఆర్వో ఇంటిపై దాడులు

భూపత్రాలు, స్టాంపులు స్వాధీనం

నెక్కొండ, వెలుగు: భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, లిటిగేషన్ ల్యాండ్లను సెటిల్ మెంట్ చేస్తున్న ఓ మాజీ వీఆర్వో ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని సాయిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్ది వెంకట్ రెడ్డి పదేండ్ల కింద రిటైర్డ్ అయ్యాడు. అదే గ్రామానికి చెందిన లింగాల వెంకన్నతో కలిసి భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపాడు. ఎలాంటి సమస్య ఉన్నా.. తన పలుకుబడితో డాక్యుమెంట్లను 
సరి చేసి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవాడు. తహసీల్దార్లకు చెందిన స్టాంపులను సైతం వాడేవాడు. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన భూపత్రాల జిరాక్సులు, కొన్ని ఒరిజినల్స్ ఇతని ఇంటి వద్దే ఉండేవి. పదేండ్లుగా ఈ దందా సాగుతుండగా.. టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో శుక్రవారం దాడులు నిర్వహించారు. భూరికార్డులు, స్టాంపులు, పాత పాస్​బుక్​లు, ఆర్వోఆర్, పర్వతగిరి మండల తహశీల్దార్ స్టాంపుతో పాటు, చింతనెక్కొండ, దౌలత్​నగర్, నెక్కొండ మండల చంద్రుగొండ, రెడ్లవాడ, పత్తిపాక, సనికర గ్రామాలకు సంబంధించిన రెవిన్యూ రికార్డులు, పహాణీలు, పాత స్టాంపుపేపర్లు, వీఆర్వోల స్టాంపులు నాలా, మ్యూటేషన్​ఫైలు, సర్వే గొలుసు స్వాధీనం చేసుకున్నారు.

అసైన్డ్ ల్యాండులకూ రిజిస్ట్రేషన్లు..

లిటిగేషన్ ల్యాండ్ల రిజిస్ట్రేషన్లకు వెంకట్ రెడ్డి కేరాఫ్ గా మారాడు. ఎలాంటి భూమినైనా సరే.. తన పలుకుబడి, అనుభవంతో అక్రమంగా పట్టా చేసేవాడు. అసైన్డ్ భూములు, శిఖం భూములను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవాడు. ఇలా ఏ ఊరికి వెళ్లినా అక్రమ రిజిస్ట్రేషన్ అంటేనే వెంకట్ రెడ్డి పేరు వినిపించేది. ఆఫీసర్లను మేనేజ్ చేయడంలో ఇతడు సిద్ధహస్తుడు. ఈ దాడుల్లో ఎస్సై లవన్ కుమార్, ఆర్ఐ నరేందర్ తదితరులున్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

మహబూబాబాద్, తొర్రూరు, పర్వతగిరి, వెలుగు: తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి మంచి వ్యక్తిని చూడలేదని, పేదలకు కట్టిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఒక్కటి రూ.25లక్షలు పలుకుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామంలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి బాగా ఖర్చు అవుతోందని, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. అనంతరం ఇదే మండలంలోని గోపాలగిరిలో మంత్రి పర్యటించారు.  స్థానిక స్కూల్​లో 100 స్మైల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాసును మంత్రి ప్రారంభించారు.

పర్వతాల శివాలయం పనుల పరిశీలన

వరంగల్​ జిల్లా పర్వతగిరిలోని పర్వతాల శివాలయం ఓపెనింగ్​కు గ్రాండ్​గా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం శివాలయం పనులను ఆర్డీఎఫ్​ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రాంమ్మోహన్​రావు తో కలిసి పరిశీలించారు. వచ్చే నెల 19న ఈ ఆలయం పున: ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అనంతరం చేయాల్సిన ఏర్పాట్లపై సిబ్బందితో మాట్లాడారు.

పోడు పట్టాలు అందరికీ వస్తయ్

అభ్యంతరాలుంటే ఆఫీసర్లకు అర్జీ పెట్టండి

నర్సంపేట, వెలుగు: అర్హులైన పోడు రైతులందరికీ త్వరలోనే హక్కు పత్రాలు ఇవ్వనున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఖానాపురం మండలం బుధరావుపేట, మనుబోతుల గడ్డ గ్రామాల్లో  పోడు భూముల గ్రామ సభలు నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరయ్యారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములను సేద్యం చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆర్డీవో లేదా డిస్ర్టిక్ లెవల్ కమిటీలకు అర్జీ పెట్టుకోవాలని సూచించారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 878 మంది పోడు రైతులు సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోలేదని, వెంటనే పెట్టుకోవాలని కోరారు.

‘ఫాస్ట్ మూవింగ్​సిటీగా జనగామ’ గుర్తింపునిచ్చిన కేంద్రం

జనగామ, వెలుగు: జనగామ జిల్లాకేంద్రం ఏర్పడ్డాక పట్టణ రూపురేఖలే మారిపోయాయి. తాజాగా కేంద్రం నిర్వహించిన సర్వేలో ‘ఫాస్ట్ మూవింగ్ సిటీ’గా ఎంపికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో జనగామ టౌన్​ కు చోటు దక్కింది. తెలంగాణలో 50 వేల నుంచి లక్ష జనాభా గల టౌన్​ ల కేటగిరీలో జనగామ మున్సిపల్ కు మూడో ర్యాంక్ లభించింది. దీంతో మున్సిపల్ చైర్మన్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెనురెడ్డి రాజన్న ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ మున్సిపల్ చైర్ పర్సన్​ పోకల జమున లింగయ్యలను సత్కరించారు. వివిధ రంగాల్లో జనగామ వేగంగా అభివృద్ధి చెందుతుందని మున్ముందు కూడా ఇదే స్పూర్తితో పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు.

వరంగల్ నిట్ లో ప్లేస్ మెంట్ల హవా!

ముగ్గురు స్టూడెంట్లకు రూ.88లక్షల ప్యాకేజీ

కాజీపేట, వెలుగు: వరంగల్ నిట్​లో ప్లేస్ మెంట్ల హవా కొనసాగుతోంది. 2022–23కు సంబంధించిన అకాడమిక్ ఇయర్ లో వెయ్యి మంది ఫైనలియర్ స్టూడెంట్లు వివిధ కంపెనీల్లో కొలువులు సంపాదించుకున్నారు. ఇందులో ముగ్గురు స్టూడెంట్లకు ఏడాదికి రూ.88లక్షల ప్యాకేజీ వరించింది. మిగిలిన స్టూడెంట్లకు సగటున రూ.19లక్షలు అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్లేస్ మెంట్లు మరిన్ని పెరిగాయని నిట్ అధికారులు తెలిపారు. తెలిపాయి. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసులను సైతం సమర్థవంతంగా నిర్వహించామన్నారు. దీనివల్లే వెయ్యి మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగారన్నారు. సెలెక్ట్ అయిన స్టూడెంట్లను నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, డైరెక్టర్, డీన్స్, అడ్వైజర్లు, రిజిస్ట్రార్, ఫ్యాకల్టీ సభ్యులు అభినందించారు.

ఆర్టీఐ ప్రజలకు వజ్రాయుధం

ఏటూరునాగారం, వెలుగు: సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) ప్రజల చేతిలో వజ్రాయుధమని ఆర్టీ ఐ స్టేట్ కమిషనర్‌ డాక్టర్ గుగులోతు​శంకర్‌ నాయక్‌ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ ఆఫీసులో ఆర్టీఐ హియరింగ్‌ కోర్ట్ నిర్వహించారు. ఫిర్యాదుదారులు, ఆఫీ సర్లతో మాట్లాడారు. ఆర్టీఐ అప్లికేషన్లకు ఆఫీ సర్లు వెంటనే స్పందించాలని, అవసరమైన సమా చారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాలని సూచిం చారు. స్వార్థం కోసం ఈ చట్టాన్ని వాడుకోవడం మంచిదికాదన్నారు. ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏవో దామోదర్ స్వామి తదితరులున్నారు.