ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హసన్ పర్తి, వెలుగు: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం నాయకుడు బైరి నరేశ్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తూ అయ్యప్పస్వాములు శుక్రవారం హసన్‌పర్తిలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వాములు మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని కించపరుస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన బైరి నరేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

కమలాపూర్‌‌లో.. 

కమలాపూర్, జనగామ అర్బన్, వెలుగు: హేతువాది భైరి నరేశ్​అయ్యప్పస్వామిపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, దీక్షాపరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని గురుస్వామి ఇందుర్తి జానకి రామారావు అన్నారు.  శుక్రవారం శ్రీ ధర్మశాస్త్ర సేవాసమితి ఆధ్వర్యంలో కమలాపూర్‌‌లో ఆందోళన చేశారు. అనంతరం భైరి నరేశ్​పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  జనగామలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీహెచ్‌పీ నాయకులు గునిగంటి రామకృష్ణ, బచ్చు బాలనారాయణ, నర్సింహారావు, భజరంగదళ్​ నాయకులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ స్కూళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

  ఈడబ్ల్యూఐడీసీ  రాష్ట్ర  చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి 

మహబూబాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్​రెడ్డి సూచించారు.  శుక్రవారం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో పర్యటించి స్కూళ్లలో చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మారుమూల ప్రాంతాల్లోని స్కూల్స్ ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. స్కూళ్లలో పనులను ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా నిర్ణీత వ్యవధిలోగా స్కూళ్లలో అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రూ.10లక్షలలోపు పనులు నెలాఖరులోగాపూర్తి చేయాలన్నారు.  

కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 316 స్కూల్స్ ను ఎంపిక చేయగా 198 ప్రైమరీ, 76 హైస్కూల్స్, 42 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని, ఆయా స్కూళ్లలో రూ.45 కోట్లతో పనులు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీడీఏ ఏపీడీ సన్యాసయ్య, డీఈవో అబ్దుల్ హై, ఆర్అండ్‌బీ ఈఈ తానేశ్వర్, పీఆర్ ఈఈ సురేశ్ పాల్గొన్నారు.

మహిళలు, పిల్లలపై దాడులు పెరిగినయ్​

  నిరుటితో పోలిస్తే దాదాపు 15 % పెరిగిన కేసులు  2022 క్రైమ్​ రివ్యూ రిలీజ్​ చేసిన సీపీ ఏవీ రంగనాథ్​

హనుమకొండ, వెలుగు: వరంగల్ పోలీస్​ కమిషనరేట్‌లో ఈ ఏడు క్రైం రేటు పెరిగింది. 2022 క్రైమ్​ రౌండప్​ ను వరంగల్​ సీపీ ఏవీ.రంగనాథ్​ శుక్రవారం రిలీజ్​ చేశారు.  వివిధ నేరాలకు సంబంధించి గతేడాది 11,047 కేసులు ఫైల్​ కాగా.. ఈసారి 12,966 నమోదయ్యాయి. నిరుటితో పోలిస్తే దాదాపు 15 శాతం పెరిగాయి. వివిధ నేరాల్లో ప్రాపర్టీ అఫెన్సెస్​ ఎక్కువగా ఉండగా.. డిటెక్షన్స్​తోపాటు రికవరీ  చాలా తక్కువగా నమోదైంది. ఇక  మహిళలు, చిన్నారులపై దాడులు, కిడ్నాపింగ్, రేప్​ కేసులు పెరగగా.. చీటింగ్ కేసులు డబుల్​ అయ్యాయి.  మర్డర్లు, యాక్సిడెంట్లు, మరణాలు స్వల్పంగా తగ్గినప్పటికీ.. సైబర్​ నేరాల్లో బాధితులు రూ.కోట్లు పోగొట్టుకున్నారు. 2022లో మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగాయి. 2021లో చిన్నారుల కిడ్నాప్​, రేప్​ కేసులు, చైల్డ్ మ్యారేజ్​.. కేసులన్నీ కలిపి 380 నమోదు కాగా.. ఈసారి 450కి చేరాయి. ఇందులో పోక్సో కేసులే ఎక్కువగా ఉన్నాయి.

మహిళలపై గతేడాది వరకట్న వేధింపులు, రేపులు, కిడ్నాపులు, మర్డర్లు అన్నీ కలిపి 1,092 కేసులు నమోదైతే.. ఈసారి 1,226కు చేరాయి.  సైబర్​ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. జాబ్, బిజినెస్, గిఫ్ట్ మనీ​, కేవైసీ అప్​డేట్, డేటింగ్ యాప్​ల పేరుతో జనం మోసపోతున్నారు. నిరుడు మొత్తం 150 కేసులు నమోదు కాగా, ఈసారి 616 ఫైల్​అయ్యాయి. ఆయా కేసుల్లో డిటెక్షన్, అమౌంట్​ రికవరీ చాలా తక్కువగా ఉంది. కమిషనరేట్ లో  ఫేక్​ సర్టిఫికేట్లు, నకిలీ బీమా పత్రాలు, ఫోర్జరీ బెయిల్​ పేపర్స్, ఫేక్​ స్టాంప్స్.. తదితర మోసాలు ఈసారి ఎక్కువగానే నమోదయ్యాయి. 

డ్రంక్​ అండ్​  డ్రైవ్​.. చలాన్లపై ఫోకస్​

ట్రాఫిక్​ రూల్స్​, డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు ఈ ఏడాది పోలీసులు ఎక్కువగా ఫోకస్​ పెట్టారు. ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేశారంటూ నిరుడు స్పాట్ చలాన్లు, ఈచలాన్లు  అన్నీ కలిపి  8.65 లక్షలు వేయగా రూ.31.43 కోట్ల జరిమానా విధించారు. 19 లక్షలకు పైగా చలాన్లు విధించి, రూ.50.82 కోట్లు జరిమానా వేశారు. నిరుడు 11,980 డ్రంక్​డ్రైవ్​కేసులు రిజిస్టర్ చేసి.. 1,365 మందిని జైలుకు పంపారు. రూ.65 లక్షల వరకు ఫైన్లు కూడా వేశారు. ఈసారి 23,669 కేసులు రిజిస్టర్​ చేసి, 1,842 మందిని జైలుకు పంపించారు. రూ.1.76కోట్ల వరకు ఫైన్లు వసూలు చేశారు. గతంతో   పోలిస్తే ఈసారి యాక్సిడెంట్లు స్వల్పంగా  తగ్గాయి.  2021లో 1,160  యాక్సిడెంట్లు జరగగా.. 443 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది 1,125 యాక్సిడెంట్లు కాగా.. 424 మంది చనిపోయారు. 


పీవోహెచ్‌కి స్థలం కేటాయించాలంటూ బీజేపీ నిరసన

కాజీపేట, వెలుగు: కాజీపేటలో రైల్వే పీరియాడికల్ ఓవరాలింగ్​ (పీవో హెచ్) యూనిట్ ఏర్పాటుకు ​అవసరమైన భూ కేటాయింపులో  రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా  నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదంటూ బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. కాజీపేట చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ,  రాష్ట్ర అధికార ప్రతినిధి  ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పాల్గొన్నారు. బీజేపీ నిరసన దీక్షకు రైల్వే జేఏసీ నాయకుడు దేవులపల్లి రాఘవేందర్ తదితరులు హజరై సంఘీభావం తెలిపారు.

రావు పద్మ మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి పాటుపడుతుంటే బీఆర్ఎస్​అబద్ధాలతో కాలం గడుపుతోందని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ కి తరలిస్తే... ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీపై చేతులెత్తేసిందన్నారు. జనవరి 1లోపు పీవోహెచ్ నిర్మాణానికి  స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ కృత్రిమ ధర్నాలు చేసి బీఆర్ఎస్ నాయకులు అబాసుపాలవుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింగ్ గౌడ్,  కార్పొరేటర్ శివకుమార్, రవికుమార్, డా.విజయ్ చందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, కౌన్సిలర్ జయంత్ లాల్ పాల్గొన్నారు.
 

పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదు.

  ఎమ్మెల్యే డా రాజయ్య

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: పార్టీలో ఉండి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదని ఎమ్మెల్యే డా.రాజయ్య అన్నారు. స్టేషన్​ఘన్​పూర్​ మండలం శివునిపల్లిలో ఎమ్మెల్యే శుక్రవారం సీసీ రోడ్లను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా హయాంలోనే పాలిటెక్నిక్​ కాలేజీ, ఫ్లైఓవర్​ బ్రిడ్జి, మోడల్​ స్కూల్​, కేజీబీవీ, రూ.3.కోట్లతో రోడ్లు.. తదితర పనులు జరిగాయన్నారు. ఇవన్నీ ఓ నాయకుడికి కనిపించడం లేదని, 15 ఏండ్ల కింద ఆయన చేసిన పనులే కనిపిస్తున్నాయంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా ఎమ్మెల్సీ శ్రీహరిని ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవి, ఎంపీపీ రేఖ, సురేశ్​కుమార్​ పాల్గొన్నారు.
 

సొంత నిర్ణయంతో కరెంట్ ఎట్లా తీస్తవ్..

  ఏఈ పై ఎమ్మెల్యే ఫైర్

మొగుళ్లపల్లి, వెలుగు: కరెంట్ కోతలతో పంట లు ఎండుతున్నాయని రైతులు చేసిన ధర్నాపై మండల సభలో కరెంట్ ఏఈ పై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యా రు. ‘రైతులు కరెంట్ బిల్లులు కట్టకుంటే వసూలు చేసుకోవాలి అంతేగానీ కరెంట్ ఎందుకు కట్​చేస్తవ్.. మీకేమైనా మీ పైఆఫీసర్ చెప్పిండా లేక జీవో గిట్ల ఉందా..నీ సొంత నిర్ణయంతో కరెంట్ కట్ చేస్తే పంటలు ఎండి రైతులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. దీంతో మాకు చెడ్డపేరు వస్తోంది. ఇంకోసారి యాసంగి నాట్ల ముందు కరెంట్ కట్ చేసినా.. రైతులను ఇబ్బంది పెట్టినా బాగుండదు’ అని కరెంట్ ఏఈ ప్రమోద్ ను ఎమ్మెల్యే హెచ్చరించారు. శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీపీ సుజాత అధ్యక్షతన జరిగిన మండలసభ గరంగరంగా సాగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎండాకాలంలో తాగునీటికి  కొరత రాకుండా అన్ని గ్రామాల్లో చేతి పంపులన్నీ రిపేర్ చేయించి ప్రజలకు నీరందించాలన్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా చివరి ఆయకట్ట పంటలకు సాగునీరు అందేలా చూడాలన్నారు.

ఉద్యమకారులపై కేసులు పెట్టిస్తుండు

  ఎమ్మెల్యే చల్లాపై బీఆర్ఎస్​ నేత కొమురయ్య ఫైర్​

హనుమకొండ, వెలుగు: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విద్యార్థి ఉద్యమకారులు, బీఆర్ఎస్‌వీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బీఆర్ఎస్​ రాష్ట్ర నాయకుడు పాలమాకుల కొమురయ్య మండిపడ్డారు. పరకాల నియోజకవర్గంలో ఇరిగేషన్​, మైనింగ్​ డిపార్ట్‌మెంట్లు పర్మిషన్ ఇచ్చినప్పటికీ  బీఆర్ఎస్‌వీ​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్​ చంద్రపై అక్రమ కేసులు పెట్టించడం సరికాదన్నారు. కేయూ క్యాంపస్​ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కొమురయ్య మాట్లాడారు. కాంట్రాక్ట్​ పనుల కోసం బీఆర్ఎస్​ లోకి వచ్చిన చరిత్ర చల్లా ధర్మారెడ్డిది అన్నారు. బీఆర్ఎస్​వీ నాయకుడు శరత్​చంద్ర, కేయూ జాక్ వ్యవస్థాపక సభ్యుడు వీరస్వామి,  లీడర్లు రాజేందర్, ప్రశాంత్,  రంజిత్, రాకేశ్​యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

గిన్నిస్ బుక్  రికార్డ్ సాధించిన మానుకోట వాసి 

మహబూబాబాద్​ అర్బన్​,వెలుగు: మానుకోట వాసి లక్ష్మణ్​పామర్​అనే లెక్చరర్​ మ్యాథ్స్​లో 77గంటలపాటు ఉపన్యసించి గిన్నిస్​ బుక్​ రికార్డ్​ సాధించారని వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్​వెంకటేశ్వర్లు తెలిపారు.  ఆత్మవిశ్వాసంతో లక్ష్మణ్​పామర్​ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. శుక్రవారం గిన్నిస్ బుక్ టార్గెట్ పూర్తయ్యాక బొకే శాలువాతో పామర్ ను సన్మానించారు. 

బీసీ, ఓసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

నక్కలగుట్ట, వెలుగు: విద్యుత్​సంస్థల్లో పనిచేస్తున్న బీసీ, ఓసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ, ఓసీ ఎంప్లాయిస్​ జాయింట్ యాక్షన్​ కమిటీ నాయకులు డిమాండ్​ చేశారు. డిమాండ్ల సాధనకు శుక్రవారం నక్కలగుట్టలోని విద్యుత్తు భవన్​ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా  జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులను ఉద్యోగుల ప్రమోషన్లలో అమలు చేయడం లేదన్నారు. దీంతో వందలాది బీసీ, ఓసీ ఉద్యోగులకు నష్టం జరుగుతోందన్నారు. అనంతరం ఎన్పీడీసీఎల్​సీఎండీ గోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. 

బాధితులపైనే కేసు నమోదు

 తమను బెదిరించారంటూ ఫారెస్ట్​ ఆఫీసర్ల ఫిర్యాదు 

హనుమకొండ, వెలుగు: ఫారెస్ట్ ఆఫీసర్​వాహనం ఢీకొని ఓ యువకుడు చనిపోగా.. డెడ్​ బాడీతో ఆందోళనకు దిగిన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్​ మండలం అశోక్​నగర్​కు చెందిన పోగుల కోటి(23)ను ఈ నెల 25న ఉదయం రోడ్డుపై వెళుతుండగా కొత్తగూడ వైపు నుంచి నర్సంపేట వెళుతున్న మహబూబాబాద్​ డీఎఫ్‌ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటి చికిత్స పొందుతూ 27న చనిపోయాడు. కుటుంబసభ్యులు కోటి డెడ్​బాడీతో హనుమకొండలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు.

కాగా ఫారెస్ట్ ఆఫీస్​ కాంప్లెక్స్​కు డెడ్​బాడీని అడ్డుగా పెట్టి 'పరిహారం ఇవ్వకుంటే చంపుతాం' అని తమను బెదిరించారంటూ ఫారెస్ట్​ ఆఫీసర్లు అదే రోజు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటి అన్న, తల్లి సహా మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. పోలీసులు శుక్రవారం వారిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు.. న్యాయం కోసం ఆందో ళన చేసినందుకు కేసు లు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

విద్యార్థులకు డిజిటల్ విద్య అవసరం

ములుగు, వెలుగు : 21వ శతాబ్ధంలో విద్యార్థులకు డిజిటల్ విద్య అవసరమని, ఆదిశగా అడుగులు పడాలని ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ అనూష అన్నారు. శుక్రవారం ములుగు మండలం అబ్బాపూర్ జడ్పీ హైస్కూల్‌ను అనూష, కార్తీక బృంద సభ్యులు సందర్శించారు. స్కూల్‌లో టాటా ట్రస్ట్ ద్వారా నడుస్తున్న కంప్యూటర్ విద్యను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కందాల రామయ్య సారథ్యంలో విద్యార్థులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు.