ఉమ్మడి జిల్లాలో ఘనంగా ముక్కోటి ఏకాదశి
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, నారసింహుడి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం 4గంటల నుంచే పూజలు మొదలయ్యాయి. భక్తులు వైకుంఠ(ఉత్తర) ద్వారం నుంచి దర్శించుకున్నారు. జనగామ జిల్లా చిల్పూరుగుట్టపై వెలసిన వెంకన్నకు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. – వెలుగు నెట్ వర్క్
లారీలు ఢీకొని ఇద్దరు మృతి
ఉప్పల్, తొర్రూరులో వాహనాల బీభత్సం
కమలాపూర్, మొగుళ్లపల్లి, తొర్రూరు, వెలుగు: లారీలు ఢీకొని వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం భూక్యాల గ్రామానికి చెందిన బిక్కినేని సంపత్‌రావు(58) సోమవారం బైక్ పై సమీప బంధువు దశదిన కర్మ కోసం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఉప్పల్ క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా.. హుజురాబాద్ వైపు వెళ్తున్న గ్యాస్ లారీ వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. దీంతో సంపత్ రావు స్పాట్ లో మృతి చెందాడు. అతని భార్య విజయకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే బస్సు కోసం వెయిట్ చేస్తున్న మాట్ల విమల అనే మహిళలను కూడా లారీ ఢీకొంది. దీంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. పండ్ల వ్యాపారి అంజలి తృటిలో తప్పించుకుంది. కాగా, తమకు న్యాయం చేయాలంటూ సంపత్ రావు బంధువులు రోడ్డుపై ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పారు.
తొర్రూరులో...
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామారం గ్రామానికి చెందిన మార్త సోమయ్య(45) సోమవారం పని నిమిత్తం బైక్ పై తొర్రూరుకు వెళ్లాడు. పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా.. వెనుకాల నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో సోమయ్య స్పాట్లో చనిపోయాడు. రైతు సోమయ్య మృతితో.. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
కారు, బైక్ ఢీ... నలుగురికి గాయాలు
ఐనవోలు: వరంగల్– ఖమ్మం హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ గా వెళ్తూ బైక్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరకు చెందిన జాటోతు సురేశ్తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి గద్వాలకు వెళ్తున్నారు. వరంగల్–ఖమ్మం హైవేపై ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్ల పంతిని గ్రామం వద్ద కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న బైకును ఢీకొని బోల్తా కొట్టింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అక్కడున్నోళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.
బొలేరో, కారు ఢీ.. ఒకరికి గాయాలు
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో కారు, బొలేరో ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి హనుమకొండకు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బొలేరో ట్రక్కును ఢీకొట్టింది. బొలేరోలో ప్రయాణిస్తున్న వరంగల్‌కు చెందిన ధనరాజుల చేరాలుకు గాయాలు కాగా, చింతగట్టుకు చెందిన దూలపల్లి సంజీవ్‌కుమార్, కారులో ప్రయాణిస్తున్న హనుమకొండకు చెందిన ఎడిదొడ్ల రాజసురేందర్రెడ్డి స్వల్ప గాయాలు అయ్యాయి.
నిధులు కేంద్రానివి.. పొగడ్తలు కేసీఆర్ కా?
పరకాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ పంచాయతీలకు కొత్త బిల్డింగులు నిర్మిస్తే.. పరకాల ఎమ్మెల్యే మాత్రం కేసీఆర్ నిధులంటూ పొగడ్తలతో ముంచెత్తడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి విమర్శించారు. సోమవారం పరకాలలో మీడియాతో మాట్లాడుతూ.. జీపీ బిల్డింగులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చల్లా ధర్మారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధిని వదిలి, కేసీఆర్ భజన చేయడం చల్లాకు అలవాటుగా మారిందన్నారు.
గ్రామాలాభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే.. గంటలోనే వాటిని కాజేసి, పక్కదారి పట్టించిన ఘనత కేసీఆర్ కే చెల్లిందన్నారు. చల్లా ఎనిమిదేండ్లలో పరకాలకు ఒక్క ఇల్లు గాని, రేషన్ కార్డు గాని ఇవ్వలేదన్నారు. సొంత క్రషర్ కు ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయించుకుని, గ్రామాలకు ఒక్క బీటీ రోడ్డు కూడా వేయలేదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురుప్రసాద్, జిల్లా కార్యదర్శి ఆర్పీ జయంతిలాల్, కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి, ఎర్రం రామన్న, దేవునూరి మేఘనాథ్ తదితరులున్నారు.
బీజేపీలో చేరినందుకు చేన్లు ధ్వంసం
నెక్కొండ, వెలుగు: బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారనే అక్కసుతో కొంతమంది బీఆర్ఎస్ నాయ కులు పంట చేన్లు ధ్వంసం చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామంలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. ఇటీవల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నాయి. దీంతో స్థానికంగా ఉండే బీఆర్ఎస్ లీడర్లు కోపం పెంచుకున్నారు. సీతారాంపురం నుంచి ముదిగొండ వరకు బీటీ రోడ్డు సాంక్షన్ అయిందంటూ.. బీజేపీకి చెందిన రైతుల మొక్కజొన్న, పత్తిని రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తీవ్ర వాగ్వాదం..
బాధితుల ఫిర్యాదుతో సోమవారం ఎస్సై పర్హీన్ గ్రామంలో విచారణ చేపట్టారు. పార్టీ మారినందుకే తమ పంటలను నాశనం చేశారని బీజేపీకి చెందిన రైతులు చెప్పగా.. అభివృద్ధి కోసమే ధ్వంసం చేశామ ని బీఆర్ఎస్ లీడర్లు చెప్పారు. రాత్రి వేళలో పనులు ఎందుకు చేశారని? ఆఫీసర్లు చేయాల్సిన పని.. బీఆర్ఎస్ లీడర్లు చేయడం ఏంటని బీజేపీ లీడర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎస్సై వారిని సముదాయించారు.
కాంగ్రెస్ పార్టీవి శవ రాజకీయాలు
మహేశ్ కుటుంబానికి న్యాయం చేస్తాం: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
మహాముత్తారం, వెలుగు: మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలకేంద్రానికి చెందిన లింగమల్ల మహేశ్ ఇటీవల పోలీస్ ఈవెంట్స్‌లో మరణించగా.. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మహేశ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. మహేశ్కుటుంబాన్ని ఆదుకునేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బడుగు బలహీన వర్గాలు మృతి చెందితే.. వారి శవాలతో కాంగ్రెస్ చేసే రాజకీయాలను ప్రజలు ఎదురించాలన్నారు.
40 ఏండ్లుగా మట్టి బిడ్డల ఓట్లతో కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యేలుగా, స్పీకర్లుగా, మంత్రులుగా గెలిచినా.. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటీవల మహేశ్ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే.. ఆ కుటుంబానికి ఏం చేశాడని ప్రశ్నించారు. కనీసం ప్రభుత్వం దృష్టికి కూడా తీసు కెళ్లలేదన్నారు. బీఆర్ఎస్ మండల లీడర్లు కల్వచర్ల రాజు, సోమ శాంతకుమార్, మందల రాజిరెడ్డి, శ్రీపతి సురేశ్, మార్క రాముగౌడ్, రాధారపు స్వామి తదితరులు ఉన్నారు.
ఉచితంగా న్యాయ సేవలు పొందాలి
జనగామ, వెలుగు: జనగామ పట్టణంలోని కోర్డు ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయసేవాధికార సంస్థను సోమవారం హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్జి కె.శైలజ పాల్గొని మాట్లాడారు. గతంలో మండల న్యాయసేవాధికార సంస్థ ఉండగా... దీనిని జిల్లా స్థాయికి అప్ గ్రేడ్ చేశామన్నారు. జిల్లా ప్రజలు ఈ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ ప్రతి రోజూ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, సీనియర్ సివిల్ జడ్జి పి.ఆంజనేయులు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డీటీ పృథ్విరాజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ నర్మద, మున్సిపల్ కమిషనర్ రజిత, ఏజీపీ రాంగోపాల్, తహసీల్దార్ రవీందర్ తదితరులున్నారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి
మరిపెడ(చిన్నగూడూరు), వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవిలో గ్రానైట్ రాయి మీద పడి మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.రాజవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గూడూరు మండలం మంగోరుగూడెం తండాలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రూల్స్ కు విరుద్ధంగా రాత్రి వేళ పోస్ట్ మార్టం ఎందుకు చేశారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే పోలీసు బందోబస్తు మధ్య డెడ్ బాడీలను తరలించారని మండిపడ్డారు. పోలీస్, మైనింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున పరిహారం, గాయపడ్డ వారికి రూ.5లక్షలు, మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్ రావు, కురవి మండలాధ్యక్షుడు శ్రీరామోజు నాగరాజు, డోర్నకల్ మండలాధ్యక్షుడు నగేశ్, జిల్లా నాయకులు పైండ్ల శ్రీనివాస్, కొణతం పెంటయ్య తదితరులున్నారు.
బీజేపీ పథకాలకు బీఆర్ఎస్ రంగు: బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
హనుమకొండ, వెలుగు: వరంగల్‌నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు విడుదల చేస్తుంటే.. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ వాటిని దారి మళ్లిస్తోందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఫైర్ అయ్యారు. కేంద్రం ఇస్తున్న పథకాలకు ఇక్కడి లీడర్లు బీఆర్ఎస్ రంగు పూస్తూ జనాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ నగరంలోని సమస్యలు తెలుసుకునేందుకు రావు పద్మ ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హనుమకొండ నాలుగో డివిజన్ పెద్దమ్మగడ్డలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందించారు.
అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రావు పద్మ మాట్లాడుతూ.. చారిత్రక ఓరుగల్లు నగర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కానీ ఇక్కడి ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజలను దోచుకోవడం తప్ప.. అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీపై రోజురోజుకు ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, రానున్న రోజుల్లో కాకతీయుల సామ్రాజ్యంలో కమలం జెండా ఎగురవేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డా.విజయ రామారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, డివిజన్ అధ్యక్షుడు గొర్రె ఓంప్రకాశ్, తీగల భరత్ గౌడ్, పిట్ట భరత్, మధుసూదన్‌రావు, అనిశెట్టి రంజిత్ ఉన్నారు.
కాంగ్రెస్ లీడర్ల ముందస్తు అరెస్ట్
వెలుగు నెట్ వర్క్: సర్పంచులు, గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించాలని టీపీసీసీ స్టేట్ ఛీప్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన ‘ఛలో ఇందిరా పార్క్’ ధర్నాకు వెళ్లకుండా కాంగ్రెస్ లీడర్లను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ఆ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని ఆ పార్టీ లీడర్లు మండిపడ్డారు.