ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిటీ ప్రజల జీవన సరళి, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ఆధారంగా ఆయా నగరాలకు ర్యాంకులు, నిధులు కేటాయిస్తోంది. అయితే వరంగల్ నగరంలో నిర్వహించే సర్వేపై ప్రజలను అవగాహన కల్పించేందుకు ట్రాన్స్ జెండర్లు ముందుకొచ్చారు. బుధవారం మెప్మా ఆధ్వర్యంలో బట్టల బజార్ ప్రాంతంలో ప్రచారం చేశారు. ప్రజలు https://eol2022.org/ లింక్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్​ జెండర్ స్టేట్ ప్రెసిడెంట్ లైలా, బల్దియా ఆఫీసర్లు ఉన్నారు.  - కాశిబుగ్గ, వెలుగు

ఐలోని జాతరకు తరలివెళ్దాం

ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే ఐనవోలు మల్లన్న జాతరకు భక్తులు తరలిరావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. ఈమేరకు బుధవారం జాతర పోస్టర్ ను రిలీజ్ చేశారు. మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలంతా జాతరను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు. వివిధ శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  - కాశిబుగ్గ, వెలుగు


శాయంపేట పీఏసీఎస్ చైర్మన్ అరెస్ట్

డబ్బు వసూలులో మాజీ సర్పంచ్ కి వేధింపులు

శాయంపేట, వెలుగు: ఇచ్చిన అప్పు వసూలు చేసేందుకు మాజీ సర్పంచ్ ను వేధించి, ఆత్మహత్యకు కారణమైన వరంగల్ జిల్లా శాయంపేట పీఏసీఎస్ చైర్మన్, బీఆర్ఎస్ లీడర్ కుసుమ శరత్​ను, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వీరభద్రరావు వివరాల ప్రకారం.. శాయంపేట మండలంలోని హుస్సేన్‌‌‌‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్‌‌ భూతాల సురేశ్(38).. తన వ్యాపారం కోసం శరత్ వద్ద రూ.20లక్షల అప్పు తీసుకున్నాడు. నెలకు రూ.2 వడ్డీ చొప్పున ఏడాది తర్వాత అసలు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐదు నెలలు దాటాక శరత్ అప్పు తీర్చేందుకు సురేశ్ తన భార్య రాణికి చెందిన రెండు అంతస్తుల బిల్డింగ్ పై లోన్ కోసం ప్రయత్నించాడు. దీంతో ఆ బిల్డింగ్ పై కన్నేసిన శరత్, అతని భార్య రమాదేవి బ్యాంక్ లోన్ రాకుండా అడ్డుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఆ బిల్డింగ్ కు చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లు బలవంతంగా తీసుకుని వేధించ సాగారు. దీంతో సురేశ్ ఆ ఇల్లు ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నించగా దానిని కూడా ఇరువురు కలిసి అడ్డుకున్నారు. ఈక్రమంలో సురేశ్ తీవ్ర మనస్తాపానికి గురై గత నెల 22న ఆత్మహత్య చేసుకున్నాడు.

10రోజులుగా తప్పించుకుని..

సురేశ్ మృతి చెందడంతో పీఏసీఎస్ చైర్మన్ శరత్, అతని భార్య రమాదేవి పరారయ్యారు. ఇంటికి తాళం వేసి పది రోజులుగా తప్పించుకుని తిరిగారు. శాయంపేట పోలీసులు వారిపై కన్నేసి, పట్టుకున్నారు. బుధవారం పరకాల కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 


ములుగు కలెక్టర్ తీరుపై విమర్శలు

 బర్లు అడ్డువచ్చాయని కాపరికి రూ.7500 ఫైన్

 ఇంటి నల్లా కనెక్షన్ కు సీల్

మంగపేట, వెలుగు: ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన కారుకు బర్లు అడ్డువచ్చాయని, కాపరికి రూ.7500 ఫైన్ వేయడమే కాకుండా ఇంటి నల్లా కనెక్షన్ కు సీల్ వేయించారు. సోమవారం జిల్లాలోని మంగపేట మండలకేంద్రంలో ఈ సంఘటన జరగగా.. ఏజెన్సీ ఏరియాలో ఇది తీవ్ర దుమారం రేపుతోంది. మంగపేట మండలం గంపోనిగూడెంకు చెందిన పశువుల కాపరి  బోయిని యాకయ్య తన బర్లను అడవికి తీసుకెళ్తున్నాడు. 

అదే రూట్ లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య కారులో రాగా.. పశువులు అడ్డువచ్చాయి. కాపరి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండిపోయాడు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ అతనికి రూ.7500 ఫైన్ వేయాలని ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు సదరు బర్లు హరితహారం మొక్కలు తిన్నాయనే కారణంతో ఫైన్ విధించారు. కట్టకపోతే పోలీసు కేసు పెడతామని బెదిరించారు. దీంతో ఆ ఫైన్ కట్టేశాడు. అయితే తన ఇంట్లో ఉన్న నల్లాకు కూడా సీల్ వేశారని బాధితుడు ఆరోపించారు. పశువుల కాపరిపై కలెక్టర్​ కన్నెర్ర చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్​ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

జనగామలో బీజేపీ జెండా ఎగరేస్తాం

జనగామ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్​లో బుధవారం అసెంబ్లీ కన్వీనర్​బల్ల శ్రీనివాస్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది. చీఫ్ గెస్టులుగా అసెంబ్లీ ప్రభారి హరిశంకర్ గౌడ్, పాలక్ గట్టు​ శ్రీకాంత్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశమంత్​ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ సర్కారు సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్​ గాడిపల్లి ప్రేమలతా రెడ్డి, రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేశ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బురుగు సురేశ్, జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప, హరిచంద్రగుప్త, కొంతం శ్రీనివాస్ తదితరులున్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

మరిపెడ(చిన్నగూడూరు), వెలుగు: ఇటీవల గ్రానైట్ యాక్సిడెంట్ లో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి సత్యవతి రాథోడ్  పరామర్శించారు. బుధవారం మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెం తండాలో పర్యటించి, మృతి చెందిన ముగ్గురి కుటుంబాలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.10వేలు, గాయపడ్డ వారికి రూ.5వేల ఆర్థిక సాయం చేశారు. ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. గ్రానైట్ కంపెనీ ఓనర్, లారీ ఓనర్, డ్రైవర్ ను ఇప్పటికే పోలీసులు రిమాండ్ చేశారని, వారి నుంచి బాధితులకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సుమన్ కుటుంబానికి రైతు బీమా, మిగిలిన కుటుంబాలను ఆపద్బంధు పథకం ద్వారా ఆదుకుంటామన్నారు. వారి పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ పద్మ, సర్పంచ్ నరేశ్, కురవి జడ్పీటీసీ వెంకటరెడ్డి తదితరులున్నారు.

పోస్టర్ల పాలిటిక్స్

వరంగల్, వెలుగు: వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పోస్టర్ల పాలిటిక్స్ నడుస్తోంది. తూర్పులో బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‍రావు వాల్ పోస్టర్లు కనిపించకుండా కార్పొరేషన్ సిబ్బంది రంగులు వేశారు. దీంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కార్యకర్తల ఇంటి గోడలపై పోస్టర్లు వేసినా ఎందుకు కలర్ వేశారని ప్రశ్నిస్తే.. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే కార్పొరేషన్ సిబ్బంది కలర్లు వేస్తున్నారని బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇటీవల కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు చేయండి

ఏటూరునాగారం, వెలుగు: వచ్చే నెల 1 నుంచి 4 వరకు జరిగే మేడారం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ మీటింగ్ హాల్ లో ఇంజనీరింగ్, విద్యుత్,  మిషన్ భగీరథ, వైద్యారోగ్య, శానిటేషన్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. జాతరలో చేయాల్సిన పనుల్ని వివరించారు. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. చుట్టుపక్కల ఆలయాలకు పెయింటింగ్ వేయాలన్నారు. భక్తుల కోసం లైటింగ్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ల సౌకర్యం కల్పించాలన్నారు. జాతరలో మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. రివ్యూలో ఏపీవో వసంతరావు, ఏవో దామోదరస్వామి, ఎస్ వో రాజ్‌‌కుమార్, ఈవో రాజేంద్రం, డీపీవో వెంకయ్య, డీఎంహెచ్​వో అప్పయ్య, ఎన్పీడీసీఎల్​డీఈ నాగేశ్వర్ రావు, ఇరిగేషన్ ఈఈ వెంకటకృష్ణ ఉన్నారు.

యాక్సిడెంట్ల నివారణకు యాక్షన్​ ప్లాన్​

 వరంగల్​ సీపీ ఏవీ.రంగనాథ్​

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపెల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆ స్పాట్​ను బుధవారం పరిశీలించారు. పోలీస్ ఆఫీసర్లు, ఆర్​ అండ్​ బీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణకు స్పీడ్​ బ్రేకర్లు, సెంట్రల్​ లైటింగ్​, సైన్​ బోర్డ్స్​, మెయిన్​ రోడ్డును కలిపే సర్వీస్​ రోడ్ల వద్ద డివైడర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 

కమిషనరేట్​పరిధిలో యాక్సిడెంట్ల నివారణకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ వింగ్ అధికారులు పరిశీలిస్తారన్నారు. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను విశ్లేషించి నివేదిక అందజేస్తారని చెప్పారు. ఆయన వెంట  కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఆర్​అండ్​ బీ డీఈఈ  గౌస్, కమాలాపూర్ సీఐ సంజీవ్, ఇంజనీరింగ్ విభాగం సీఐ విజయ్ కుమార్, ఎస్సైలు  సతీష్, చరణ్, స్థానిక సర్పంచ్​ లు  దేవేందర్ రావు, తిరుపతిరెడ్డి, ఉప్పల్ ఎంపీటీసీ సంపత్ రావు, పీఏసీఎస్​ చైర్మన్ సంపత్​ రావు, తదితరులున్నారు.