ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ, వెలుగు: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇయ్యాల బూత్ స్థాయి నాయకులతో వర్చువల్ గా మాట్లాడుతారని ఆ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వర్చువల్ మీటింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు. జనగామ పట్టణంలో జూబ్లీ ఫంక్షన్ హాల్, పాలకుర్తిలో శివం గార్డెన్స్, స్టేషన్ ఘన్​పూర్ లో సిరిపురం గార్డెన్స్ లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశామని.. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు.

మీటింగ్​ను సక్సెస్ చేయాలి..

మరిపెడ: నేడు జరిగే జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని సక్సెస్ చేయాలని మాజీ ఎంపీ, డోర్నకల్ నియోజకవర్గ పాలక్ రాథోడ్ రమేశ్ సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఆయన బూత్ స్థాయి కమిటీలతో మీటింగ్ నిర్వహించారు. నర్సింహులపేటలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో వర్చువల్ మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రబారి ఈవీ రమేశ్​తదితరులున్నారు.

కడియం టోర్నీ విన్నర్ ‘కంచనపల్లి’

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండలో గత 22 రోజులుగా సాగుతున్న కడియం ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్స్ లో ధర్మసాగర్, కంచనపల్లి జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. కంచనపల్లి జట్టు 15 రన్స్ తో విజయం సాధించింది. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరై మ్యాచ్ ను తిలకించారు. గెలుపొందిన జట్టుకు ట్రీఫీ అందజేశారు. విన్నర్ గా నిలిచిన కంచనపల్లి టీంకు రూ.50వేలు, రన్నర్ గా నిలిచిన ధర్మసాగర్ టీంకు రూ.30వేల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాలుగా పనిచేస్తున్నారని తెలిపారు.  కడియం ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది గిట్టని వారు అవాకులుచెవాకులు పేల్చుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ ఎడవెల్లి క్రిష్ణారెడ్డి, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెలిదె వెంకన్న తదితరులున్నారు.

సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం

హనుమకొండ సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర సర్కారు విఫలం అయిందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. ‘ఇంటింటికీ బీజేపీ’లో భాగంగా శుక్రవారం వరంగల్ 4వ డివిజన్ లో పర్యటించారు. కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు.. వివిధ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ చార్జి, పశ్చిమ నియోజకవర్గ ప్రభారీ డా.వి.మురళీధర్ గౌడ్, నియోజకవర్గ పాలక్ గూడూరు నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్ తదితరులున్నారు.

భూసమస్యలు పరిష్కరిస్తాం

భూపాలపల్లి రూరల్, మొగుళ్లపల్లి, వెలుగు: గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న భూసమస్యలను పరిష్కరిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి భూపాలపల్లి మండలంలోని పంబాపూర్, దీక్షకుంట, నందిగామ గ్రామాల్లో పర్యటించారు. పంబాపూర్ లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 400 ఎకరాల భూమి వివాదంలో ఉందన్నారు. రెవెన్యూ ఆఫీసర్లే స్వయంగా వచ్చి పరిష్కరిస్తారని చెప్పారు. అంతకుముందు పంబాపూర్ గ్రామ సమీపంలోని సుద్దవాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. భీంగన్పూర్ చెరువు నుంచి సాగునీటిని విడుదల చేశారు.

అంకుశాపురంలో..

మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అంకుశాపురం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ దివాకర పాల్గొని మాట్లాడారు. గ్రామంలో వివాదంలో ఉన్న పట్టా భూములను పరిష్కరిస్తామన్నారు. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వవద్దన్నారు. ఎంపీపీ సుజాత, సర్పంచ్ చంద్రమౌళి, జడ్పీటీసీ సదయ్య, తహసీల్దార్ సుమన్ తదితరులున్నారు.

పునాది తీస్తుండగా బయటపడ్డ అమ్మవారి విగ్రహం

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ చౌర్ బోళిలో ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం పునాది తీస్తుండగా.. అమ్మవారి విగ్రహం బయటపడింది. చౌర్ బోళిలోని చక్రవర్తి హాస్పిటల్ వద్ద ఓని మణి అనే వ్యక్తికి చెందిన జాగలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి, పూజలు చేశారు.

యువతిపై అత్యాచారం  నిందితుడిపై నిర్భయ కేసు

కాజీపేట, వెలుగు:  యువతిపై అత్యాచారానికి పాల్పడి.. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన యువకుడిపై కాజీపేట పోలీస్ స్టేషన్​లో నిర్భయ కేసు నమోదైంది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. బతుకుదెరువు కోసం కాజీపేటకు వలస వచ్చి జీవనం సాగిస్తోంది. స్థానిక డీజిల్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్​లో తండ్రి వాచ్​మెన్​గా పనిచేస్తుండగా, తల్లి కంకులు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు కూతుర్లు ఉండగా.. చిన్న కూతురిని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన వాంకుడోత్ చంద్ర పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకుని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, పలుమార్లు అత్యాచారం చేశాడు. పెండ్లి చేసుకోకపోవడంతో భయపడిన యువతి.. తన సొంతూరుకు వెళ్లిపోయింది. అక్కడికి కూడా వెళ్లి యువతిని వేధించాడు. తన వద్దకు రాకుంటే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాంకుడోత్ చంద్రపై నిర్భయ కేసు నమోదు చేశారు. 

మైనర్ బాలికపై అత్యాచారయత్నం..

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలో ఓ మైనర్ బాలికపై వరుసకు బంధువైన ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రాఘవేందర్ వివరాల ప్రకారం.. మండలం లోని ఓ గ్రామంలో ఈ నెల 2న ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై వరసకు మామ వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. నిందితుడు సముద్రాల 
గ్రామానికి చెందిన పులి రజనీ కుమార్(33)గా గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు.


కేసీఆర్ ప్రధాని కావడం ఖాయం

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావడం ఖాయమని స్టేషన్​ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. శుక్రవారం తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘కంటి వెలుగు’ ప్రోగ్రాంను సక్సెస్ చేసేందుకు ఆఫీసర్లు, లీడర్లు కృషి చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో ఈ ప్రోగ్రాం ఉంటుందని చెప్పారు. కంటి వెలుగును జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్​చైర్మన్ గుజ్జరి రాజు, జడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య తదితరులున్నారు.

ఎంజీఎంలో రోగుల తిప్పలు

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం లో రోగుల సమస్యలు తీరడం లేదు. సరైన సంఖ్యలో బెడ్లు, సెలైన్ స్టాండ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సెలైన్ స్టాండ్లు లేక పేషెంట్ల బంధువులే చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకుంటున్నారు. మరోవైపు వార్డ్ బాయ్ లు, పేషెంట్ కేర్ లు వంద మంది ఉన్నప్పటికీ... రోగుల బంధువులతోనే పనిచేయిస్తున్నారు. స్ట్రెచర్ ను సైతం వారే మోసుకెళ్తున్నారు.