ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

  పురాతన బడిని కూల్చడంలో కాంట్రాక్టర్ అత్యుత్సాహం

వెంకటాపురం, వెలుగు: బ్రిటీష్ కాలం నాటి స్కూల్​కూల్చివేతలో కాంట్రాక్టర్ అత్యుత్సాహం, నిర్లక్ష్యం వల్ల విలువైన టేకు కలపతో పాటు కొత్త బిల్డింగ్ గోడలు కూలిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో బ్రిటీష్ కాలం నాటి ప్రభుత్వ బడి ఉంది. అప్పట్లో దీనిని టేకు కలపతో నిర్మించారు. అయితే కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం సదరు బడిని ఓ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా కూల్చేశాడు. టేకు చెక్కలు విరిగి, గోడల వ్యర్థాల కిందపడిపోయాయి. ఐరన్ పైపులు పనికి రాకుండా పోయాయి. అంతేకాక పక్కనే ఉన్న కొత్త స్కూల్ బిల్డింగ్ గోడలు సైతం కూలిపోయాయి. దీంతో కాంట్రాక్టర్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నారు. ఆఫీసర్ల పర్యవేక్షణ కూడా కరువైంది. దాదాపు రూ.10లక్షల విలువైన టేకు నేలపాలైంది.

బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి

స్టేషన్ ఘన్ పూర్(జఫర్ గఢ్), వెలుగు: మన దేశ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డా. రాజయ్య అన్నారు. ఆదివారం జనగామ జిల్లా జఫర్ గఢ్ మండలంలో ఆయన పర్యటించారు. జఫర్ గఢ్​నుంచి సూరారం వర కు రూ.1.34కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తిమ్మంపేటలో ఎస్సీ, మహిళా కమ్యూనిటీ హాల్, గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు  ప్రవేశ పెట్టి, ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో నిలిచిందన్నారు.  మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీటీసీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లెపాటి జయపాల్ రెడ్డి, మార్కెట్​ డైరెక్టర్లు రాజ్​కుమార్ పాల్గొన్నారు.

ప్లేగ్రౌండ్ లో ప్రైవేట్ స్కూల్ ప్రహరీ

  ఆఫీసర్ల తప్పిదంతో వివాదాస్పదంగా సర్కారు భూమి

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల వివాదాస్పదంగా మారింది. ప్లేగ్రౌండ్ కు కేటాయించిన ప్రభుత్వ భూమిలో.. ఓ ప్రైవేట్ స్కూల్​ యాజమాన్యం ప్రహరీ నిర్మించడం చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ – తొర్రూరు మెయిన్ రూట్​లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సర్వే నెం. 551లో 15 గుంటల సర్కారు స్థలం ఉంది. ఈ భూమిని గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ హద్దులు గుర్తించి., మున్సిపాలిటీకి అప్పగించారు. ఇటీవల రూ.2లక్షలతో ఇందులో ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేశారు. కానీ గత రెండ్రోజులుగా ఆ భూమి తమదంటూ ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్రహరీ నిర్మించడం ప్రారంభించింది. తహసీల్దార్ నాగభవాణి సైతం ఆ జాగ ప్రైవేట్ స్కూల్ కు చెందినదని చెప్పడంతో వివాదం నెలకొంది. మున్సిపల్​ కమిషనర్ ప్రసన్నరాణి.. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను వారం రోజుల్లో అప్పగించాలని, అప్పటివరకు పనులు ఆపాలని ప్రైవేట్ స్కూల్ కు నోటీసులు జారీ చేశారు. అయినా వాటిని బేఖాతర్ చేస్తూ సదరు స్కూల్ ప్రహరీ నిర్మిస్తోంది.

కూటి కోసం కూలి కోసం..

 వలస కూలీల బతుకు చిత్రం

పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉమ్మడి జిల్లాకు వచ్చి కూలి పనులు చేస్తున్నారు. టెంపరరీగా గూడారాలు వేసుకుని, పొలాలు గుత్తకు తీసుకుంటున్నారు. మగవారు మడులు దున్నడానికి, ఒరాలు తీయడానికి పోతున్నారు. మహిళా కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. మరికొందరు కేజీ రూ.10 చొప్పున మిరపకాయలు ఏరుతున్నారు. పనులు పూర్తికాగానే, తట్టాబుట్టా సర్దుకొని వారి రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పశ్చిమ్ బెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వలస వస్తున్నారు. - మహబూబాబాద్, వెలుగు

రిలీఫ్ ఫండ్ తో పేదలకు భరోసా

జనగామ అర్బన్, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసాగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ గౌడ్ అన్నారు. ఆదివారం జనగామ మండలం చీటకోడూరుకు చెందిన సానబోయిన కోటయ్య కుటుంబానికి రూ.60వేల విలువైన రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. కోటయ్య ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. హాస్పిటల్ బిల్లు రూ.లక్షల్లో అయింది. విషయం తెలుసుకున్న కిరణ్ గౌడ్.. సీఎం సహాయ నిధిని సంప్రదించి, ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ లీడర్లు వేముల లక్ష్మణ్, ఆరె సతీశ్, ఉదయ్ కుమార్, రాజు, శ్రీకాంతా చారి, వంగాల సమ్మయ్య తదితరులున్నారు.