ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పథకాల అమలును స్పీడప్​చేయాలని మహబూబాబాద్​ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ మాలోత్ కవిత ఆదేశించారు. సోమవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో  జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) మీటింగ్​ను కలెక్టర్ శశాంక అధ్యక్షతన నిర్వహించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, నామినేట్ సభ్యులు హాజరు కాగా వైద్య ఆరోగ్యం, రోడ్లు, స్వచ్ఛభారత్ అమలు, ఉపాధి హామీ పథకం, హరితహారం లక్ష్యాల సాధింపు, ఆసరా పెన్షన్ల అమలు, విద్యుత్ ఇతర అభివృద్ధి పనుల ప్రగతిపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. బలపాల, అయోధ్యపురంలో కొత్తగా పీహెచ్​సీలు పెట్టినట్లు చెప్పారు. ఈజీఎస్​ అమలులో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందన్నారు. హరితహారం లక్ష్యాలలో రూ. 43 లక్షలకు 49 లక్షల మొక్కలు నాటి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించామన్నారు. 

పీఆర్​, ఎన్​హెచ్​ ఆఫీసర్ల తీరుపై ఎంపీ ఆగ్రహం

ఎన్​హెచ్​ఆఫీసర్ల పనితీరుపై ఎంపీ మాలోతు కవిత  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో రోడ్లు గుంతలమయంగా మారాయని కనీసం మెయింటెనెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎన్​హెచ్​–930పీ, 163జీ  రోడ్లకు భూసేకరణను స్పీడప్​చేయాలన్నారు. పీఎంజీఎస్ వై పథకం కింద మంజూరైన రోడ్ల శంకుస్థాపనలకు  ఎంపీగా తనకు  సమాచారం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్​శాఖలో సీసీ రోడ్ల బిల్లులు, రైతు వేదికల బిల్లులు సకాలంలో ఎంబీలు చేయడం లేదని, పలువురు సర్పంచ్​లు, ఎంపీపీలు సభ దృష్టికి తీసుకురాగా వారంలో సమస్యను పరిష్కరించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీటింగ్​లో సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ,  అడిషనల్​ కలెక్టర్ అభిలాష అభినవ్, డీఆర్​డీవో సన్యాసయ్య,  వివిధ శాఖల ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గెలిచి నాలుగేండ్లైనా రూపాయి పని చేయలే

కలెక్టర్ కు వివరించిన టీఆర్ఎస్ సర్పంచ్​లు 

మొగులపల్లి,వెలుగు: సర్పంచ్​లుగా గెలిచి నాలుగేండ్లయినా రూపాయి పని కూడా చేయలేదని, ప్రజలు అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదని  మండలంలోని పలు గ్రామాల టీఆర్ఎస్ సర్పంచ్​లు కలెక్టర్ భవేష్ మిశ్రా కు మొరపెట్టుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ను గణేశ్ పల్లి, కాసులపాడు, గుండ్లకర్తి, గుడి పహాడ్, పోతుగల్లు గ్రామాల సర్పంచ్​లు కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న జీపీల్లో నిధులు లేకపోవడంతో ట్రాక్టర్లకు కిస్తీలు కట్టలేకపోతున్నామని, దీంతో కోర్టు ద్వారా నోటీసులొచ్చాయని కలెక్టర్ కు చెప్పారు. కొత్త జీపీలకు పరిపాలన బిల్డింగులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్​సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్​లు తెలిపారు.

సీఎం పర్యటనను సక్సెస్​ చేయాలి

ఏర్పాట్లపై రివ్యూ చేసిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి 

మహబూబాబాద్ ,వెలుగు: మహబూబాబాద్​జిల్లాలో సీఎం కేసీఆర్ త్వరలో చేపట్టబోయే పర్యటనను సక్సెస్ ​చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్ ​పిలుపునిచ్చారు. సోమవారం మహబూబాబాద్ లోని మంత్రి సత్యవతి రాథోడ్ నివాసంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై రివ్యూ చేశారు. జిల్లాలో డెవలప్​మెంట్​ పనుల పురోగతి, ఏర్పాట్లపై చర్చించారు. పర్యటనలో సీఎం సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​ లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో  జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాజయ్య,  కలెక్టర్ శశాంక, అడిషనల్​ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, సీతారాం నాయక్, పాల్గొన్నారు. 

పురాతన ఆలయాలను కాపాడుకోవాలి

పర్వతగిరి, వెలుగు:  కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరిలోని పర్వతాల శివాలయంలో సోమవారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎర్రబెల్లి రాంమ్మోహన్​రావు, సర్పంచ్​ మాలతి పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ మహాసభలను విజయవంతం చేయండి

హసన్ పర్తి,వెలుగు:  ఈనెల 13 నుంచి 16 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఎస్ఎఫ్ఐ 17వ మహాసభలను జయప్రదం చేయాలని మాజీ  ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌ కె.నాగేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం   కేయూలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులు సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కుమార్ లోద్, ఎస్ఎఫ్ఐ కేయూ కార్యదర్శి  మూల వేణు, అధ్యక్షుడు హతిరాం, రోహిత్ స్టాలిన్ పాల్గొన్నారు.

టెక్స్​టైల్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ను కలిసిన చేనేతన్నలు 

కాశీబుగ్గ, వెలుగు: స్టేట్​ టెక్స్​టైల్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ గూడూరు ప్రవీణ్​ను సోమవారం హైదరాబాద్​లో వరంగల్​ చేనేత కార్మిక సంఘం నాయకులు మార్యద పూర్వకంగా కలిశారు. చేనేత కార్మిక సమస్యలపై చర్చించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలీ చేనేత నాయకులు వెంకటేశ్వర్లు, సంపత్​ మాట్లాడుతూ నాలుగేండ్లుగా టెస్కో నుంచి వరంగల్​ చేనేత కార్మికులకు కూలీ రేట్లు పెంచడం లేదని చైర్మన్​ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ నరేంద్ర కుమార్, అశోక్​ బాబు, శరత్​, రాజు, రాము, శ్రీనివాసులు, సూర్యనారాయణ, ప్రకాశ్​ ఉన్నారు. 

ధరణితో రైతులు గోస పడుతున్నరు : ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి సురేఖ

ములుగు, వెలుగు: ధరణి పోర్టల్ తో రైతులు అరిగోస పడుతున్నారని, వందల ఎకరాల భూములు మాయమయ్యాయని, ధరణిని వెంటనే రద్దు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ వర్తింపజేయాలన్నారు. సోమవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో ములుగులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వో కు వినతిపత్రం అందజేశారు. ఎడ్లబండిపై వచ్చిన ఎమ్మెల్యే సీతక్క కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ధరణి పోర్టల్ తో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజల ఆస్తుల వివరాలను ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, నారాయణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవిచందర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, రాంరెడ్డి, వెంకన్న పాల్గొన్నారు. 

హనుమకొండ, వెలుగు: ధరణి, రైతు సమస్యల పరిష్కారంలో కేసీఆర్​ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని మాజీ మంత్రి కొండా సురేఖ ఫైర్​ అయ్యారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీసీ ప్రెసిడెంట్​ నాయిని రాజేందర్​ రెడ్డి ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ కేసీఆర్​ ప్రభుత్వం రైతులు, నిరుద్యోగులను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణకు నష్టం జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్​కు ఎన్నికలు వచ్చినప్పుడే దళితులు గుర్తుకొస్తారన్నారు. అనంతరం డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్​ రెడ్డి మాట్లాడుతూ 2018 ఎన్నికల ముందు పంటల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగేండ్లయినా దాని ఊసే ఎత్తలేదని విమర్శించారు. అనంతరం రైతు, ధరణి సమస్యలపై వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా.గోపి, రాజీవ్​ గాంధీ హనుమంతుకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వెంకటేశ్వర్లు, సాంబయ్య పాల్గొన్నారు.

ఉద్యమం చల్లబడ్డప్పుడు.. జర్నలిస్టులే స్ఫూర్తినిచ్చిన్రు

ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ

వరంగల్‍, వెలుగు: తెలంగాణ ఉద్యమం కొంత స్తబ్దుగా ఉన్న సమయంలో ఇక్కడి జర్నలిస్టులు.. మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు డిమాండ్‍ చేస్తూ అందరిలో ఉద్యమ స్ఫూర్తి నింపారని రాష్ట్ర ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍ ఆధ్వర్యంలో దీక్షా దివాస్‍ కార్యక్రమంలో భాగంగా సోమవారం జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్​గెస్ట్​గా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ.. కేసీఆర్‍ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మరో లెవెల్‍కు తీసుకెళితే.. పనిచేసే సంస్థలతో సంబంధం లేకుండా జర్నలిస్టులు క్రియశీలకంగా ఉద్యమంలో పాల్గొన్నట్లు చెప్పారు.  తెలంగాణ నుంచి ఢిల్లీకి 2 వేల మంది జర్నలిస్టులు వెళ్లి ఫైట్‍ చేయడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో నడవాలన్నారు. 

జర్నలిస్టులకు జాగలు, ఇండ్లు ఇయ్యాలే 

రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప్రాంత జర్నలిస్టులకు జాగలు, ఇండ్లు ఇచ్చారని.. వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గంలోనూ ప్రభుత్వ చీఫ్‍విప్‍ వినయ్‍భాస్కర్‍ త్వరలోనే ఇండ్ల స్థలాలిచ్చి నిర్మాణాలు చేపట్టాలని యూనియన్‍ నేతలు మారుతిసాగర్, ఇతర నేతలు కోరారు. వరంగల్‍ జర్నలిస్టులకు మోడల్‍ జర్నలిస్ట్​ కాలనీ నిర్మిస్తామని సీఎం కేసీఆర్‍ ఇచ్చిన హామీని గుర్తు చేశారు.  సమ్మేళనంలో కుడా చైర్మన్‍ సుందర్‍రాజ్‍ యాదవ్‍, యూనియన్‍ నేతలు, సీనియర్‍ జర్నలిస్టులు కొండల్‍రావు, వెంకట్‍, టంకశాల అశోక్‍, రవి, బీఆర్‍ లెనిన్‍, శ్రీధర్‍రెడ్డి, కేశవమూర్తి, రమణ, వెంకన్న పాల్గొన్నారు.

‘గ్రీవెన్స్​’లో ఫిర్యాదుల వెల్లువ

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: హనుమకొండ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా  ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదులను కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు, అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణి స్వీకరించారు. దళితబంధు కోసం 20 మంది అప్లికేషన్​ ఇవ్వగా, రెవెన్యూ సంబంధ సమస్యలతో 21 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. డబుల్​ బెడ్ రూం ఇండ్లు, రేషన్​ కార్డులు, పింఛన్లు ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. మొత్తం 96 దరఖాస్తులు వచ్చాయి. 

ఆలస్యంగా బల్దియా అధికారులు 

వరంగల్​సిటీ, వెలుగు: సోమవారం బల్దియా హెడ్​ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో టౌన్​ప్లానింగ్​పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎక్కువగా కోర్టు పరిధిలో ఉన్న  భూములు, భవనాలకు పర్మిషన్లు ఇస్తున్నారని, ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి.  కమిషనర్ ప్రావీణ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 63 ఫిర్యాదులు రాగా, ఇందులో సగం టౌన్ ప్లానింగ్ విభాగం 32 ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగం 11 మంచినీటి సరఫరా విభాగం 2 , పన్నుల విభాగం 13 , ప్రజారోగ్యం, శానిటేషన్ విభాగం 4  ఉన్నాయి.  ప్రజావాణికి అధికారులు అరగంట వరకు ఆలస్యంగా రావడంతో ఫిర్యాదుదారులు ఎదురుచూశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్లు  అనిసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ డా.జ్ఞానేశ్వర్, పాల్గొన్నారు. 

ములుగు, వెలుగు : గ్రీవెన్స్ లో వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ వై.వి.గణేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి భూ సంబంధిత, పింఛన్, ఉపాధి కోసం 44 దరఖాస్తులు వచ్చాయి.