- పంటల సాగుకు ముందే ప్రకటన చేయాలని కోరుతున్న రైతులు
- గతేడాది ఆలస్యంగా ప్రకటించడంతో భారీగా నష్టపోయిన రైతన్నలు
- ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయని ఆఫీసర్లు
- పంటల సాగుపై ఉమ్మడి జిల్లా రైతుల్లో అయోమయం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈ యాసంగి సీజన్‌లోనైనా ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయా ? లేదా ? అన్న అనుమానం రైతుల్లో నెలకొంది. గత సీజన్‌లో ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. గతంలో ఎస్సారెస్పీ నీటిపై ఆఫీసర్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు నవంబర్‌లోనే మక్కజొన్న వేసుకోవడంతో పాటు వరి నార్లు పోసుకున్నారు.
తీరా పంటలు సాగు చేసిన నెల తర్వాత ఎస్సారెస్పీ నీటిని హుజురాబాద్ వరకే ఇస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఎస్సారెస్పీ నీటి విషయంలో ఈ సీజన్‌లోనైనా ముందస్తు ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి వరంగల్‌కు ఎస్పారెస్పీ నీళ్లే ఆధారం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సారెస్పీ కింద సాగయ్యే ఆయకట్టే ఎక్కువ. జిల్లాలో మొత్తం ఆరు లక్ష ఎకరాలకు పైగా సాగుభూమి ఉంటే ఇందులో ఎస్సారెస్పీ ఫేజ్‒1 కింద 3.57 లక్షలు, సెకండ్ ఫేజ్ కింద 1.13 లక్షల ఆయకట్టు ఉంది. అయితే ఫేజ్‒2 పనులు ఇంకా పూర్తి కాలేదు. చాలా ఏండ్లుగా ఫేజ్‒1 కిందనే పంటలు సాగవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి, వర్దన్నపేట, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టు అధికంగా ఉంది. డీబీఎం 48 కాలువ కింద 1.43 లక్షలు, డీబీఎం 38 కింద 78,614, డీబీఎం 30, 31 కింద 51,118, డీబీఎం 23 నుంచి 27 కాల్వల కింద 20,365 ఎకరాలు సాగవుతున్నాయి.
ప్రతియేటా వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు ఇస్తూ, వేలాది చెరువులను నింపుతున్నారు. ఈ సారి ఎస్సారెస్పీలో నీళ్లు ఫుల్‌గా ఉండడంతో వానాకాలంలో సాగు చేసిన పత్తిని తీసేసి సుమారు లక్ష ఎకరాల్లో మక్కజొన్న వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎస్సారెస్పీ పరిధిలోని చెరువులు, బావుల కింద కూడా సుమారు లక్ష ఎకరాల్లో వరినాట్లు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
గతేడాది ఉమ్మడి జిల్లాకు చేరని ఎస్సారెస్పీ నీళ్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండితే రెండు పంటలకు సరిపడా సాగు నీటికి ఢోకా ఉండదనేది ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల అభిప్రాయం. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 50 ఏండ్లుగా ఉమ్మడి జిల్లాకు నీళ్లు వస్తున్నాయి. వర్షాలు పడి ఈ ప్రాజెక్ట్ నిండితే వానాకాలం పంటకు పూర్తిస్థాయిలో, యాసంగికి వారబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తుంటాయి. కానీ పోయినసారి ఇరిగేషన్ ఇంజినీర్ల అనాలోచిత నిర్ణయాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది.
లోయర్, మిడ్ మానేరులో 27 టీఎంసీలు, ఎస్పారెస్పీలో 76 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ కేవలం హుజురాబాద్ వరకే సాగునీరు ఇస్తామని ఆలస్యంగా ప్రకటించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఆఫీసర్లను అడిగితే తమకు పూర్తి సమాచారం లేదని దాట వేశారు. దీంతో అప్పటికే ఎస్పారెస్పీ కింద సాగు చేసిన ఆరుతడి పంటలు, చెరువుల కింద పోసిన వరినాట్లకు నీళ్లు అందక అవి ఎండిపోయాయి. సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు.
ఈ సారైనా వస్తయా ? రావా ?
యాసంగి సమయానికి ఎస్సారెస్పీలో70 టీఎంసీలకు పైగా నీళ్లు ఉంటే వరంగల్ ఉమ్మడి జిల్లా దాటి సూర్యాపేట వరకు నీళ్లు అందించడం ఆనవాయితీగా వస్తోంది. పోయినేడాది ఒకటి, రెండు సార్లు మాత్రమే నీళ్లు వచ్చి బంద్ అయ్యాయి. దీంతో వేసిన పంటలు ఎండిపోయాయి. ఈ సారి ఎస్సారెస్పీలో 73 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 23 టీఎంసీల నీళ్లున్నాయి. అయినా ఇప్పటివరకు కాకతీయ కెనాల్‌కు వాటర్ రిలీజ్ చేయలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లా రైతులంతా ఎస్సారెస్పీ కాల్వల్లో పారే నీళ్ల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తే చాలని అంటున్నారు. అయితే ఈ యాసంగిలో వరంగల్ వరకు ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తరా ? లేదా ? అన్న విషయాన్ని ఇరిగేషన్ ఇంజినీర్లు స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. ఆఫీసర్ల నుంచి స్పష్టత వస్తేనే మక్కజొన్న వేసుకొని, యాసంగి నార్లు పోసుకుంటామని చెబుతున్నారు.
వాటర్ రిలీజ్‌పై మాకు సమచారం లేదు
వరంగల్ ఉమ్మడి జిల్లాకు యాసంగిలో ఎస్పారెస్పీ నీళ్లిచ్చే విషయం గురించి మాకేమీ సమాచారం లేదు. నీళ్ల గురించి రైతులు అక్కడక్కడా అడుగుతున్నరు. కాకతీయ కెనాల్‌లో ప్రస్తుతానికి అయితే నీళ్లు రావట్లేదు. ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటిదాకా రైతులు వేచిచూడాల్సిందే.
‒ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఈ, హనుమకొండ-
నీళ్లిస్తామంటేనే పంటలు వేసుకుంటం
యాసంగిలో ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయంటే వానాకాలం వేసిన రెండెకరాల పత్తిని తొలగించి మక్కజొన్న వేసుకుంట. బావిలో ఉన్న నీటితో పాటు కాల్వ నీళ్లతో పంట పండుతుంది. ఆరుతడి పంట కావడంతో వారం తప్పించి వారం నీళ్లిస్తే చాలు. మా ఊళ్లో సుమారు 200 ఎకరాల్లో మక్కజొన్న వేశారు. రైతులంతా కూడా ఎస్పారెస్పీ నీళ్ల కోసం ఎదురుచూస్తున్నం.
– దామెరకొండ నర్సయ్య, రైతు, ఆరెపల్లి, హనుమకొండ జిల్లా -