బ్రో(Bro) సినిమాలో శ్యామ్ బాబు పాత్రపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఆ పాత్ర ఓ ఏపీ మంత్రిని ఉదేశించి కావాలనే చేశారనే కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సదరు మంత్రి కూడా స్పందించారు. అయితే తాజాగా జరిగిన బ్రో చిత్ర విజయోత్సవంలో ఆ పాత్ర పోషించిన నటుడు థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్(Prudhviraj) స్పందించారు.
బ్రో సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సినిమాలో నేను చేసిన పాత్రపై బయట చాలా ట్రోలింగ్ జరుగుతోంది కానీ.. జరుగుతున్న ట్రోలింగ్ కు సినిమాలో పాత్రకు ఎలాంటి సంబంధంలేదు. నాకు దర్శకుడు ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు.. ఒక పనికి మాలిన వెదవ పాత్రలా ఉండాలి అని చెప్పారు. నేను కూడా అలాగే చేశాను. అయినా ఈ సినిమా కోసం ఎవరినో కావాలని ఇమిటేట్ చేయాల్సిన అవసరంలేదు. అయినా ఆయనేమన్నా ఆస్కార్ లెవల్ ఆరిస్టా ఇమిటేట్ చేయడానికి అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక బ్రో సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) మరో కీ రోల్ లో కనిపించారు. తమిళ దర్శకుడు సముద్రఖని(Samutirakani) తెరకెక్కించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటిరోజు నుండే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి ఈ సినిమాకు.