Chaari 111 Review: వెన్నెల కిషోర్ చారీ 111 ఎలా ఉంది? హిట్ కొట్టాడా? లేదా?

Chaari 111 Review: వెన్నెల కిషోర్ చారీ 111 ఎలా ఉంది? హిట్ కొట్టాడా? లేదా?

టాలీవుడ్లో ఈ తరం కమెడియన్స్లో టక్కున గుర్తొచ్చే వారిలో వెన్నెల కిషోర్ (Vennela Kishore) ఒకరు. వెన్నెల కిషోర్ కమెడియన్గా, డైరెక్టర్గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు. ఇపుడు హీరోగా రాణించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫన్, స్పై, యాక్షన్ ఫిల్మ్గా చారీ 111 ఇవాళ (మార్చి 1న) థియేటర్లోకి వచ్చింది. టిజీ కీర్తికుమార్ డైరెక్ట్ చేసిన చారీ 111 మూవీ ఎలా ఉంది? కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా ఎలా నటించాడు? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:

రా,ఎన్ఐఏ దేశభద్రతకు సంబంధించిన ఏజెన్సీల‌కు ధీటుగా చ‌ట్టాల‌కు లోబ‌డ‌కుండా..స్వ‌తంత్రంగా రుద్ర‌నేత్ర అనే ఏజెన్సీని ముఖ్య‌మంత్రి (శుభ‌లేఖ సుధాక‌ర్‌) స్థాపిస్తాడు. అలా ఒకసారి  హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ అటాక్ అవుతుంది. ఈ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి కెమికల్ పేలుడు పదార్థాలు లభించవు. ఆ బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో ఎటువంటి ఆధారాలు కూడా కనిపించకపోయేసరికి..ఇది ఉగ్రవాదుల పని అని నిర్దారణకు వస్తారు. ఇక వారి ప్లాన్‌ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్‌ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి (శుభ‌లేఖ సుధాక‌ర్‌).

ఈ సీక్రెట్ రుద్రనేత్ర అనే ఏజెన్సీకి ఆర్మీ జాబ్‌కు రిజైన్ చేసిన మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) హెడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. అతని టీమ్‌లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్‌)కి బాంబ్‌ బ్లాస్ట్‌ కేసుని అప్పగిస్తాడు. చారి విచారణలో శ్రీనివాస్ (బ్రహ్మాజీ) అనే వ్య‌క్తి అనుమానితుడిగా తేలుతాడు. శ్రీనివాస్ ఇంట్లో దొరికిన‌ ఓ కెమిక‌ల్ క్యాప్సుల్ వేసుకున్న వారు..సూసైడ్ బాంబర్‌గా మారుతున్నార‌నే  విషయాన్నీ తన ఇన్వేస్టిగేష‌న్‌లో తెలుసుకుంటాడు చారి. 

హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ మిషన్ వెనుక ఎవరున్నారు? అందుకు ఈ మిషన్‌ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్‌లో ఏజెంట్‌ ఈషా (సంయుక్త విశ్వనాథన్‌) రోల్ ఏంటీ? అసలు ఎటువంటి క్లూస్ లేకుండా ఆత్మాహుతి దాడుల జరగడం వెనుక ఎవరున్నారు? అసలు ఈ బ్లాస్టులు చేయడం వల్ల వారు సాధించే లక్ష్యమేంటి? మహి, రావణ్‌లా ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏంటనేది తెలుసుకోవాలంటే చారి 111 చూడాల్సిందే.  

విశ్లేషణ: 

గూఢ‌చారి కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలకు లాజిక్స్, ట్విస్ట్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్ అవసరం. థ్రిల్లింగ్ స్పై మూవీని కామెడీతో మిక్స్ చేసి చూపించాలంటే తెరకెక్కించిన మేకర్స్ కు క‌త్తిమీద సాములాంటిదనే చెప్పుకోవాలి.ఇపుడు అదే ధైర్యం చేసి చారి 111 మూవీతో వెన్నెల కిషోర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

ఇక చారి 111 లాంటి స్పై యాక్షన్ ఫిల్మ్ లో..వెన్నెల కిశోర్‌ హీరో అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక టీజర్, ట్రైలర్ లో..ఈ మూవీలో ఏదో మ్యాజిక్ ఉందనే విషయాన్ని డైరెక్టర్ ముందుగానే చూపించడంతో సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఎదురుచూశారు. అయితే..చారి కథనానికి వస్తే..కాస్తా కామెడీ ఎక్కువయ్యిందనే చెప్పుకోవాలి.ఇలాంటి గూఢచారి సబ్జెక్టు తో తెరకెక్కిన సినిమాలో ఉండాల్సిన అంతలా కామెడీ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఆ కామెడీ కాస్తా ఎక్కువ అవ్వడం వల్ల లాజిక్‌ మిస్ అయింది.

ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకుంటాయి. అయిన కెమిక‌ల్‌, బ‌యోలాజిక‌ల్ వెప‌న్స్ తో దేశంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించాల‌ని ప్ర‌య‌త్నించే వాళ్ళని చారి అనే ఏజెంట్ ఎలా పట్టుకోగలిగాడు. అందుకు తన ఇన్వెస్టిగేషన్ లో ఎంత దూరం వెళ్ళాడనేది చారి 111 మూవీ క‌థ‌. అయితే ఈ సినిమాలో సీరియ‌స్ ఆప‌రేష‌న్‌ను కూడా చారి తనదైన కామెడీని చూపించేసాడు. కానీ, ఇక్కడ సీక్రెట్‌ ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది? పై అధికారులు మిషన్ ను చేధించే క్రమంలో ఎలా వ్యవహరిస్తారు. ఓ సీఎంతో అధికారి ఎలా మాట్లాడుతాడు? అనే విషయాల్లో రియాల్టీకి పూర్తి విరుద్ధంగా చారి కథనం సాగుతుంది. 

ఫస్టాఫ్‌ అంతా సోసోగా సాగినప్పటికీ..కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వెన్నెల‌కిషోర్ పాత్ర‌కు ఇచ్చిన ఇంట్ర‌డ‌క్ష‌న్‌లు, కేసును డీల్ చేసే క్ర‌మంలో కంగారు ప‌డుతూ అత‌డు చేసే హడావిడి చాలా చోట్ల‌ ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇక హీరోయిన్‌ చేసే యాక్షన్‌ సీన్‌ ఫస్టాఫ్‌కి హైలెట్‌ గా ఉంటాయి. ఇంటర్వెల్‌ వచ్చే సీన్స్ సెకండాఫ్ పై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే సాగుతుంది. ఓ వైపు వెన్నెల కిషోర్ తనదైన కామెడీని పండిస్తూనే..లో లోపల సూసైడ్ బాంబ‌ర్స్ మిస్ట‌రీని ఛేదించే ట్విస్ట్‌ల‌తో ఆసక్తిగా న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. ఇక క్లైమాక్స్‌ అనుకున్నంత స్థాయిలో లేదనే ఫీలింగ్ ఇస్తుంది. 

నటీనటులు:

రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో చారి అనే ఏజెంట్‌ పాత్రలో వెన్నెల కిషోర్ నటించి ఆకట్టుకున్నాడు. ఆయన అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించిన తీరు..వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ఆడియన్స్ కు ఎంటర్ టైన్ ఇస్తుంది. వెన్నెల‌కిషోర్ వ‌న్‌మెన్ షో అనేలా చేశాడు. ‘వయలెన్స్..వయలెన్స్..వయలెన్స్..ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా’ అంటూ ‘కెజియఫ్’ మూవీలో రాకీ భాయ్ స్టైల్లో డైలాగ్ చెప్పిన తీరుకు థియేటర్స్లో విజిల్స్ పడతాయి. ఈషా పాత్రలో సంయుక్త విశ్వనాథన్‌ తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ తోను, యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేసింది. మేజర్ ప్రసాద్ రావు గా మురళీ శర్మ ఆకట్టుకున్నాడు. 

సాంకేతిక వర్గం:

హీరో సుమంత్‌తో మళ్లీ మొదలయ్యింది అనే మూవీ  డైరెక్ట్ చేసిన టీజీ కీర్తి కుమార్ చారి 111 కోసం మంచి కథనం రాసుకున్నాడు.  సైమన్ కే కింగ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.