త్వరలో ఢిల్లీ హెల్త్ మినిస్టర్ అరెస్ట్

పంజాబ్ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఈడీ అధికారులు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేస్తారన్నారు. దీనికి సంబంధించి తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. సత్యేంద్ర జైన్ పై ఇప్పటికే కేంద్రం రెండు సార్లు దాడులు చేయించిందన్నారు కేజ్రీ. అయితే ఆ దాడులతో ఎలాంటి ఫలితం రాలేదన్నారు. ఇప్పుడు అందుకే జైన్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుందని వారికి స్వాగతమని తెలిపారు ఢిల్లీ సీఎం. పంజాబ్ సీఎం చరణ్ జీత్ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా కేజ్రీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈడీ తమపై దాడులు చేస్తే.. సీఎం చన్నీలా తాము ఏడుస్తూ కూర్చోమన్నారు. ఈడీ దాడులకు భయపడి... చన్నీ నిరాశకు లోనయ్యాడన్నారు. ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడ్డాడన్నారు. ఈడీ దాడులు చేస్తే తాము భయపడేదే లేదన్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఎవరికీ భయపడమన్నారు కేజ్రీవాల్. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేంద్ర ఏజెన్సీలు కూడా యాక్టివ్‌గా మారుతున్నాయని ఎద్దేవా చేశారు కేజ్రీవాల్. బీజేపీ అన్ని ఏజెన్సీలను పంపగలదన్నారు.ఒక్క సత్యేంద్ర జైన్ మాత్రమే కాదు, వారు తనపై, మనీష్ సిసోడియా, భగవంత్ మాన్‌లక వద్దకు కూడా దాడులు చేసేందుకు అధికారుల్ని పంపిస్తుందని విమర్శించారు. ఎవరిని తమపైకి పంపినా వారిని చిరునవ్వుతో స్వాగతిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

 

మరోవైపు పంజాబ్ ఎన్నికల వేళ ఈడీ సీఎంకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ నివాసంలో ఈడీ సోదాలు చేసి రూ.10 కోట్ల నగదు, 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ నేతలపై ఈడీ దాడులు జరుపుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నారని సీఎం చన్నీ ఆరోపించారు.  పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.