- ఇంకో నాలుగు రోజులు వానలు
- ఇయ్యాల, రేపు వడగండ్లు పడే చాన్స్
- 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం, సోమవారం 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వడగండ్ల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
వర్షం పడే సమయంలో రైతులు పొలం పనులకు వెళ్లకపోవడమే మంచిదని, వెళ్లాల్సి వస్తే చెట్ల కింద ఉండకూడదని సూచించింది. మరోవైపు శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 7.4, మల్కాజ్‌గిరిలో 6.8, ముషీరాబాద్‌లో 6.5, అంబర్‌పేటలో 6.3, షేక్‌పేటలో 6.3, నాంపల్లిలో 6.2, కాకతీయహిల్స్‌లో 6.2, సికింద్రాబాద్‌లో 6.2, ఉప్పల్‌లో 5.9, బేగంపేటలో 5.3, జూబ్లీహిల్స్‌లో 5.2, ఖైరతాబాద్‌లో 5.1, బన్సీలాల్‌పేటలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండలో 6.1 సెంటీమీటర్ల వాన కురిసింది. గద్వాల జిల్లా ఇటిక్యాలలో 5.9, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 4.8, నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సిద్దిపేట, మహబూబ్‌నగర్, హనుమకొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు కూడా భారీగా పడిపోయాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని లక్మాపూర్‌లో 38.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.