- మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల
యాదగిరిగుట్ట, వెలుగు: ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించే ‘గంధమల్ల రిజర్వాయర్’ నిర్మాణాన్ని మూడు నెలల్లో ప్రారంభిస్తామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి మూడో నెలలో రిజర్వాయర్ పనులు షురూ చేస్తామని చెప్పారు. గురువారం యాదగిరిగుట్ట మండలం జంగంపల్లిలో బస్వాపూర్ రిజర్వాయర్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ పాయింట్ ను ప్రారంభించి, యాదగిరిగుట్ట మండలానికి గోదావరి జలాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రూ.800 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ ను నిర్మించి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిండా నీళ్లు ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ స్వార్థ రాజకీయాల కారణంగా ఆలేరు నియోజకవర్గానికి ఒక్క చుక్క నీరు అందలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తమతో కొట్లాడి ఆలేరుకు గోదావరి జలాలను రప్పించాడని కొనియాడారు.
ఆలేరు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం మిషన్ భగీరథకు ప్రభుత్వం రూ.210 కోట్లు రిలీజ్ చేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్న ప్రతిపక్షాల మాటలు నిజమేనని, ఇచ్చిన హామీలతో పాటు ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.