ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుపాను బీభత్సం సృష్టించగా.. ఉత్తరాది రాష్ట్రాలను మండుటెండలు వణికిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. మే 29 రాత్రి కల్లా నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడించింది. అంచనా వేసిన సమయానికంటే ముందే నైరుతి వస్తుండటంతో ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేరళను నైరుతి తాకిన నాలుగైదు రోజుల్లోనే ఏపీ, తెలంగాణకు కూడా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. నైరుతి రాకతో అగ్నిగోళంలా మండుతున్న రాష్ట్రాలు చల్లబడనున్నాయి. నైరుతి రుతుపవన కాలంలో వర్షాలు దంచికొట్టనున్నాయని పేర్కొన్నారు. గతేడాది రుతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయని, ఇప్పుడు మాత్రం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. కాగా.. ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వారంరోజులుగా అక్కడక్కడా అడపాదడపా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పుడు అంచనా వేసిన సమయానికి రుతుపవనాలు తీరాన్ని తాకి వర్షాలు పడితే.. వ్యవసాయ పనులను కూడా ప్రారంభించవచ్చని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
Also read :43శాతం పెరిగిన FDI కంపెనీల డివిడెండ్.. రూ.2.2లక్షల కోట్లకు చేరింది