- ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్
- అన్ని కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలతో అనుసంధానం
- ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నుంచి అమల్లోకి..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణను పూర్తిగా నిఘా నీడలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయగా, వాటిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నది. దీనికోసం బోర్డు ఆఫీసులోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో 2500కు పైగా ఇంటర్మీడియెట్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో వచ్చేనెల ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. అయితే, కొంతకాలంగా ప్రాక్టికల్స్ నిర్వహణపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఇష్టానుసారంగా మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్ నిర్వహించే అన్ని కాలేజీల్లోని ల్యాబ్‌లలో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే సర్కారు, ప్రైవేటు కాలేజీలకు ఈ దిశగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చివరి దశలో ఉంది. అయితే, ఆ కాలేజీలను డైరెక్ట్ గా ఇంటర్ బోర్డులో ఉండి పరిశీలించే అవకాశం లేకుండా పోయింది.
దీంతో వాటన్నింటికీ కనెక్టివిటీ ఉండేలా ఇంటర్ బోర్డు నుంచే పరీక్షించేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కొత్తగా వచ్చిన బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య నిర్ణయించారు. దీనికి అనుగుణంగా సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఎంపిక కోసం ఇంటర్ బోర్డు టెండర్లను ఆహ్వానించింది. ఈవారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నది. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కోసం ఇంటర్ బోర్డులోనే ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కాలేజీల్లోని సీసీకెమెరాలనూ దీనికి అనుసంధానం చేయనున్నారు. వచ్చేనెలలో ప్రారంభం కానున్న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో దీనిని అమలు చేయబోతున్నారు.