- రేపటి నుంచి మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు
- మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్
- ఆందోళనకు గురవుతున్న గిరిజనులు
మహబూబాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీ నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. పల్లెల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టడుతున్నారు. ఇటీవల సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల నిర్భందం పెరుగడం, ఎన్కౌంటర్లలో మావోయిస్టులు చనిపోవడంతో సేఫ్టీ జోన్ తెలంగాణకు వస్తేనే రక్షణ దొరుకుతుందని అజ్ఞాత దళాలు ఇక్కడి బాటపట్టారని తెలిసింది. దీంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు గోదావరి నది సరిహద్దు జిల్లాలైన ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏజెన్సీ పల్లెల్లో విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తున్నారు.
ఎన్‌కౌంటర్‌తో మరింత అప్రమత్తత..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల మహబూబాబాద్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంత సమీపంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు అడవిలో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్ట్ యాక్షన్ టీం మెంబర్ నల్లమూరి అశోక్ అలియాస్ విజేందర్ (34)మృతి చెందాడు. దీంతో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని కొత్తగూడ పోలీస్ స్టేషన్ సెంటర్‌గా స్పెషల్ పార్టీ పోలీసులు ప్రతీరోజు కూంబింగ్ చేపడుతున్నారు. గ్రామాల్లో నూతన వ్యక్తులకు షెల్టర్ ఇవ్వొద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్నేళ్లుగా పీస్ ఫుల్‌గా ఉన్న ఏజెన్సీ ఏరియాలో పోలీసుల కూంబింగ్ పెరిగడంతో గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు.
వారోత్సవాల కట్టిడి కోసం తనిఖీలు..
నేటి నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు జరుపకుండా ఏజెన్సీ పల్లెలపై పోలీస్ నిఘాను పెంచారు. జిల్లాలోని గంగారం మండలం మడగూడకు చెందిన యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ రెండేళ్ల కింద మృతి చెందడంతో ఆయన స్మారకార్థం ఎటువంటి ప్రోగ్రామ్‌లు చేపట్టకుండా ముందస్తు కట్టడి
చేస్తున్నారు.
గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు..
మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్కేకన్ ఆదేశాలతో ఏజెన్సీ ఏరియాలో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతోపాటు మావోయిస్టులకు గిరిజనులు ఆశ్రయం కల్పించకుండా అవగాహన కల్పిస్తున్నారు. యువతకు క్రికెట్ కిట్లు పంచడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో తమ నెట్ వర్క్‌ను పెంచుకుంటున్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు. మావోయిస్టు మాటలను నమ్మి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మద్దతు పలుకడంతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు.