
- 65వ నేషనల్ హైవేపై 4 కిలోమీటర్ల పొడవున
- అక్రమ నిర్మాణాలు రామచంద్రపురం జీహెచ్ఎంసీ డివిజన్లో ఫ్లోర్ కో రేటు ఫిక్స్
- హైవే చుట్టూ అక్రమాలపై గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదులు
- పట్టించుకోని అధికారులు
సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: రెసిడెన్షియల్ పర్మిషన్లతో అక్రమంగా కమర్షియల్బిల్డింగులు వెలుస్తున్నాయి. 65వ నేషనల్ హైవేపై 4 కిలోమీటర్ల పొడవునా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జీహెచ్ఎంసీ డివిజన్‌పరిధిలో నేషనల్ హైవేకు ఇరువైపులా రెసిడెన్షియల్ పేరుతో పర్మిషన్లు తీసుకుని కమర్షియల్ బిల్డింగులు కడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఫ్లోర్ ఫ్లోర్ కు ఒక్కోరేటు
రామచంద్రాపురం జీహెచ్ఎంసీ డివిజన్లో 65వ నేషనల్హైవేకు ఇరువైపులా నిర్మిస్తున్న ఏ ఒక్క నిర్మాణం నిబంధనల ప్రకారం లేదు. రెండంతస్తులకు రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని ఐదు, ఆరు అంతస్తుల కమర్షియల్బిల్డింగులను నిర్మిస్తున్నారు. హైవే పొడవునా కమర్షియల్నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదులు వెళ్లినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదు. ప్రజల నుంచి వెళ్లిన ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు తేలితే వాటికి నోటీసులు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా కిందిస్థాయి సిబ్బందిని ఆయా నిర్మాణాల వద్ద కాపలా పెట్టి బిల్డింగ్ అంతస్తులను బట్టి రేటు ఫిక్స్ చేసి బిల్డర్ల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరికొన్ని చోట్ల టీజీఐఐసీకి (తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్) చెందిన స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్స్పేస్లు నిర్మించి బిల్డర్లు సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించి సర్కారుకు అందాల్సిన కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారు. అశోక్‌నగర్‌లో నర్సరీ ఎదురుగా ఓ బీఆర్‌ఎస్‌నేత ఎలాంటి పరిమితులు లేకుండా నిర్మించిన ఐదు అంతస్తుల భవనంపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే సితార హోటల్ పక్కన మూడు కమర్షియల్ భవనాలు కేవలం రెసిడెన్షియల్ పర్మిషన్లతోనే నిర్మిస్తున్నారన్న విషయం తెలుసుకున్న అధికారులు సదరు బిల్డర్ వద్ద అందినకాడికి దండుకొని ఫిర్యాదులపై స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
సబార్డినెంట్లతో సెటిల్మెంట్లు
ఆర్సీపురం జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి తన అసిస్టెంట్ ద్వారా సదరు అక్రమ నిర్మాణాల వద్ద సెటిల్మెంట్లు చేస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన ఆయన ఇటీవలే మళ్లీ రామచంద్రాపురం జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చి తన అసిస్టెంట్లతో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పాత పరిచయాలు ఉండడంతో స్థానికంగా ఉండే ఓ ప్రజాప్రతినిధితో కలిసి నేషనల్ హైవే వద్ద నిర్మిస్తున్న అక్రమ బిల్డింగులపై దృష్టిపెట్టి అందిన కాడికి దోచుకుంటూ అక్రమ బిల్డింగులను సక్రమంగా ఉన్నాయని సర్టిఫై చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. తనకున్న పలుకుబడితో మ్యానేజ్ చేస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ బిల్డింగ్ 65వ నేషనల్హైవే పక్కన ఆర్సీపురం కరెంట్ ఆఫీస్ఎదురుగా అక్రమంగా నిర్మిస్తున్నారు. విడివిడిగా మూడు రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని భారీ కమర్షియల్నిర్మాణాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. సదరు నిర్మాణ దారుడు జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ అధికారులకు లక్షల డబ్బు ముట్టజెప్పి ఓ బీఆర్ఎస్ నేతను సైతం తన అక్రమాలకు తోడుగా పెట్టుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అదే బీఆర్ఎస్లీడర్సాయంతో నిర్మాణానికి అడ్డుగా ఉన్న 20 ఏళ్ల నాటి చెట్లను తొలగించేలా చేశాడు. అయితే ఈ స్థలం ప్రభుత్వ సర్వే నంబర్లో ఉందని, తప్పడు పత్రాలతో ఆ స్థలాన్ని ఆక్రమించి భారీ నిర్మాణం చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.