బేగంపేట నుంచి కమర్షియల్ ఫ్లైట్లు రయ్ రయ్.. త్వరలోనే ప్రారంభించే చాన్స్..!

బేగంపేట నుంచి కమర్షియల్ ఫ్లైట్లు రయ్ రయ్.. త్వరలోనే ప్రారంభించే చాన్స్..!
  • = ఇక కమర్షియల్ ఫ్లైట్ల సేవలు!
     
  • = త్వరలోనే ప్రారంభించే చాన్స్
  • = 2008 నుంచి హోల్డ్ లో సేవలు
  • = 17 ఏండ్ల తర్వాత విమానాల పరుగులు
  • = భారీగాపెరిగిన సిటీ ట్రాఫిక్.. స్టార్టయితే కష్టాలే
  • = తాడ్ బండ్– ప్యారడైజ్ టన్నెల్ నిర్మాణంపైనా నీలినీడలు!

హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయం నుంచి ఫ్లయిట్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఇక్కడి నుంచి కమర్షియల్ ఫ్లయిట్ల సేవలను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 1930లో నిజాం హయాంలో నిర్మించిన బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వైమానిక దళ స్టేషన్‎గా సేవలందిస్తోంది. 2008లో మార్చి 23న శంషాబాద్‎లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత ఇక్కడి నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 1930 నుంచి 2008 వరకు దాదాపు 8 దశాబ్దాల పాటు సేవలందించింది బేగంపేట ఎయిర్ పోర్టు. ప్రస్తుతం ఇక్కడి నుంచి వీవీఐపీలు ప్రయాణించే విమానాలు, ప్రైవేటు ఫ్లైట్ల ల్యాండింగ్‎కు, టేకాఫ్‎కు ఇక్కడ అనుమతి ఉంది. 

ALSO READ | రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదు: కోదండరాం

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి కమర్షియల్ ఫ్లైట్ల సేవలు ప్రారంభిస్తామని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న ప్రకటించారు. బేగంపేట విమానాశ్రయం డొమాస్టిక్ ఫ్లయిట్ సేవలకు వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‎తో పాటు డొమెస్టిక్ ఫ్లయిట్ల కోసం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాల్సి వస్తోంది. డొమాస్టిక్ ఫ్లయిట్ల సేవలను బేగంపేటకు పరిమితం చేయడం ద్వారా సౌకర్యవంతంగా ఉండంటంతోపాటు, శంషాబాద్ ఎయిర్ పోర్టుపైనా బర్డెన్ తగ్గించవచ్చిన కేంద్ర విమానయానశాఖ భావిస్తున్నట్టు సమాచారం. 

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేదెలా..?

ఈ 17 ఏండ్ల కాలంలో హైదరాబాద్‎లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా బేగంపేట హెవీ ట్రాఫిక్ జోన్లలో ఒకటిగా ఉంది. అక్కడి నుంచి కమర్షియల్ ఫ్లయిట్ల సేవలు ప్రారంభమైతే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యే వాళ్లు ఈ రూట్ ద్వారానే వస్తుంటారు. దీనికి తోడు సిటీ జనాభా కూడా భారీగా పెరిగింది. జనసాంద్రత విషయానికి వస్తే ఢిల్లీనే మించి పోయింది. ఈ రూట్‎లో నడిచే మెట్రో రైళ్లు సైతం కిక్కిరిసిపోతుంటాయి. విమానయాన సేవలు మొదలైతే ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

టన్నెల్ రోడ్డు ప్రతిపాదనలకు బ్రేక్..?

సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి, తాడ్ బండ్, బాలం రాయి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు హెచ్ఎండీఏ ఇటీవలే కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తాడ్ బండ్ చౌరస్తా నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు ద్వారా బాలం రాయి వరకు టన్నెల్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్టు రన్ వేను ఆనుకొని 600 మీటర్ల వెడల్పుతో 1.1 కి.మీ సొరంగం నిర్మించాలని భావించారు. విమానాశ్రయం ప్రహరీ పొడవునా తాడ్ బండ్ రోడ్డు వరకు 1.5 కి.మీ విశాలమైన రహదారిని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

 అంతకు ముందు ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు స్కైవే  నిర్మించాలని భావించగా ఎయిర్ పోర్టు అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో టన్నెల్ నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఏఏఐకి హెచ్ఎండీఏ అధికారులు లేఖలు రాశారు. ప్రస్తుతం ఏఏఐ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. ఒక వేళ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి కార్యకలాపాలు మొదలైతే టన్నెల్‎కు అనుమతి వస్తుందా..? లేదా..? అన్నది హాట్ టాపిక్‎గా మారింది.