- క్వింటాల్‌కు 2కిలోలల వరకు కోత
- దడ్వాయిలు లేకుండానే జరుగుతున్న కొనుగోళ్లు
- కరువైన మార్కెట్ అధికారుల పర్యవేక్షణ
భైంసా మండలానికి చెందిన ఓ రైతు తాను పండించిన 20 క్వింటాళ్ల సోయా పంటను అమ్మేందుకు గురువారం భైంసా మార్కెట్‌కు తీసుకొచ్చాడు. అయితే కొనుగోలుదారు, కమీషన్ఏజెంట్లు కుమ్మక్కై తరుగు పేరిట క్వింటాల్‌కు రూ.2 కిలోల వరకు కటింగ్చేశారు. మొత్తం 40 కిలోలు తరుగు తీయడంతో సదరు రైతు రూ.1780 నష్టపోయాడు. మార్కెట్అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, దడ్వాయిలు లేకుండా ప్రైవేట్ వ్యక్తులు తూకాలు చేయడం, పీవోసీ మెషీన్పనిచేయకపోవడం కారణంగా రైతులకు అన్యాయం జరుగుతోంది. నిత్యం భైంసాకు వచ్చే వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
భైంసా, వెలుగు: ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న పంట అమ్ముకునేందుకు భైంసా వ్యవసాయ మార్కెట్‌కు వస్తే అంతా మాయ జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కమీషన్ఏజెంట్లు, కొనుగోలుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తరుగు పేరిట రైతులను ముంచుతున్నారు. నిర్మల్ జిల్లాలోనే భైంసాలో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఇది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకైక ఈ నామ్ఇక్కడే ఉంది. దీంతో ముథోల్ నియోజకవర్గం నుండే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తమ పంట దిగుబడులను ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముతుంటారు. ప్రతి రోజు సుమారు 6 వేల క్వింటాళ్ల వరకు సోయాతోపాటు మక్కలు, నువ్వులు, పెసర తదితర పంట దిగుబడులు విక్రయానికి వస్తుంటాయి. మార్కెట్లో 65 మంది వరకు కమీషన్ ఏజెంట్లు, 20 మంది వరకు కొనుగోలుదారులున్నారు.
కోడ్లు పెట్టుకొని దోపిడీ
అయితే మార్కెట్లో కమీషన్ఏజెంట్లు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారు. క్వింటాల్ సరుకుకు కిలో నుంచి 2కిలోల వరకు కోత విధిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే తీసుకొచ్చిన పంట బాగాలే దని, ధర తక్కువగా ఉందని మాయమాటలు చెప్పి అమాయక రైతులను నిండా ముంచి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులు కోడ్లు పెట్టుకొని మరీ దోపిడీకి పాల్పడుతున్నారు. కే అంటే కట్టి (క్వింటాల్‌కు కిలో తరుగు), డి అంటే డబుల్కట్టి (క్వింటాల్‌కు రెండు కిలోల తరుగు) ఇలా కోడ్లు పెట్టుకొని తరుగు తీస్తున్నారు.
మార్కెటింగ్ ఆఫీసర్ల నిర్లక్ష్యం
వ్యవసాయ మార్కెట్ యార్డులో అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్‌లోనే ఉంటున్నారు తప్ప.. తూకాలు జరిగే టైమ్‌లో అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈనామ్ మార్కెట్లో దడ్వాయిలు పీవోసీ మెషీన్ ద్వారా తూకాలు చేయాల్సి ఉండగా.. ఇక్కడ అదేమీ కనిపించడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌యార్డుకు పెద్ద మొత్తంలో దిగుబడులు వస్తుండడంతో కమీషన్ ఏజెంట్లే తూకాలు చేస్తూ.. దడ్వాయిలకు వచ్చే ఎంతో కొంత చార్జీలు సైతం తీసుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు మోసం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రైతులు మోసపోకుండా చూస్తాం
భైంసా మార్కెట్లో ప్రస్తుతం పెద్ద మొత్తంలో పంట దిగుబడులు విక్రయానికి వస్తున్నాయి. తరుగు విషయం మా దృష్టికి రాలేదు. తరుగు తీస్తూ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు రైతులను మోసం చేస్తే సహించేది లేదు. పకడ్బందీగా పర్యవేక్షణ చేపడుతాం.- పూర్యానాయక్, ఏఎంసీ సెక్రటరీ, భైంసా