భవిత సెంటర్ల నిధుల్లో కమీషన్ల దందా! రూల్స్కు విరుద్ధగా ప్రైవేట్​ ఏజెన్సీకి ఆర్డర్లు

భవిత సెంటర్ల నిధుల్లో కమీషన్ల దందా! రూల్స్కు విరుద్ధగా ప్రైవేట్​ ఏజెన్సీకి ఆర్డర్లు
  • ఎంఈవోలు, డీఈవో కార్యాలయ ఉద్యోగులు ఒక్కటైనట్లు ఆరోపణలు
  • ఉమ్మ డి జిల్లాలో 18 భవిత సెంటర్లు

వనపర్తి, వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా విద్యాశాఖపై వరుస ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ ప్రైవేట్ స్కూల్ కు గుర్తింపు ఇచ్చేందుకు డీఈవో ఆఫీస్​లో కమీషన్​ డిమాండ్ చేసిన విషయం మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని భవిత సెంటర్లలో సామగ్రి కొనుగోలులో రూల్స్ పాటించకుండా ఎంఈవోలు బిల్లులు చెల్లించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి ఫర్నీచర్​ కొనుగోలు చేయాలని డీఈవో ప్రోసిడింగ్స్​ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అంగవైకల్యం ఉన్న చిన్నారుల కోసం కొనుగోలు చేసే సామగ్రి పైనా కమీషన్​కు కక్కుర్తి పడ్డారని చర్చ జరుగుతోంది. 

రూల్స్ పాటించని అధికారులు..

సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్  డైరెక్టర్ గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 156 భవిత సెంటర్లలో చిన్నారులకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం ఒక్కో సెంటర్ కు రూ.2 లక్షల చొప్పున మంజూరు చేశారు. మండల స్థాయి లో కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ఆమోదంతో సామగ్రి కొనుగోలుకు ఈ నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. కమిటీలో ఎంఈవో, ఒక స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, భవిత సెంటర్ హెచ్ఎం సభ్యులుగా ఉండాలని సూచించారు. వనపర్తి జిల్లాలో వనపర్తి, కొత్తకోట, ఖిల్లాగణపురం మండలాల్లో భవిత సెంటర్లు ఉన్నాయి. 

ఎంఈవోలు, డీఈవో కార్యాలయ ఉద్యోగులు ఒక్కటై, కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఫర్నిచర్​కోసం వివిధ షాపుల నుంచి ముందు కొటేషన్లు తీసుకొని, ఎవరైతే నాణ్యతగా, తక్కువ ధరలో సామగ్రి ఇస్తారో వారి వద్దే కొనుగోలు చేయాలి. కానీ, ఏకపక్షంగా 3 సెంటర్లకు సంబంధించి రూ.6 లక్షలు చెల్లించారు. ముందుగానే 30 శాతం కమీషన్​మాట్లాడుకొని, నాసిరకం సామగ్రి ఆర్డర్​ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ఫర్నీచర్​ రేపోమాపో వచ్చే అవకాశం ఉంది. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు డీఈవో ఒక్కరే కావడంతో అక్కడ కూడా ఇలాగే చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర విచారణ జరిపి, అవినీతికి పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ యూనియన్ల నాయకులు డిమాండ్​చేస్తున్నారు. 

భవిత సెంటర్లున్న ప్రాంతాలు..

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో మొత్తం 18 భవిత సెంటర్లు ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంపీపీఎస్​చింతల్​పేట, గట్టు, మానవపాడు, మహబూబ్​నగర్​లో ఎంపీపీఎస్​బాలనగర్, దేవరకద్ర,  జడ్చర్ల ఇందిరానగర్, ఎంపీయూపీఎస్​ క్రిస్టియన్​పల్లి, నాగర్​కర్నూల్​జిల్లాలో ఎంపీపీఎస్​ అచ్చంపేట, ​కల్వకుర్తి, కొల్లాపూర్​వరిద్యాల్,​ నాగర్​కర్నూల్, ఎంపీపీఎస్​ తెల్కపల్లి, నారాయణపేటలో జీయూపీఎస్​మద్దూర్, మక్తల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలో ఎంపీపీఎస్​ గణపురం, కొత్తకోట, వనపర్తిలలో భవిత సెంటర్లు ఉన్నాయి. 

అప్రూవల్​తర్వాతే ఇచ్చాం

డీపీసీ నుంచి అప్రూవల్​తీసుకున్న తర్వాతే  ప్రొసీడింగ్స్​ఇచ్చాం. ఎంఈవోలు డబ్బులు చెల్లించి, సామగ్రి తీసుకోవాలి. అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం తగదు. ఫర్నిచర్​కొనుగోలుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
- అబ్డుల్​ ఘని, డీఈవో, వనపర్తి