GHMCలో మహిళా ఉద్యోగుల భద్రత కోసం స్పెషల్ కమిటీ  

GHMCలో మహిళా ఉద్యోగుల భద్రత కోసం స్పెషల్ కమిటీ  

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోని మహిళా ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అడిషనల్ కమిషనర్లు స్నేహా శబరీష్, నళిని పద్మావతి, పంకజను సభ్యులుగా నియమించారు. వీరు ముగ్గురు మహిళా ఉద్యోగుల సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషి చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియాలోని మహిళా ఉద్యోగులపై వేధింపులు పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తలపై స్పందించిన కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మరో రెండు కమిటీలు..

గ్రేటర్ పరిధిలో గ్రీనరీని మరింత పెంచేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కమిషనర్ ఆమ్రపాలి నియమించారు. అడిషనల్ కమిషనర్ సునంద, ఎల్బీనగర్ జోనల్​కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నకు బాధ్యతలు అప్పగించారు. బిల్లులు పెండింగ్ ఉండడంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంలేదు.

దీంతో కొన్నిచోట్ల హార్టికల్చర్ పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్లను ఎంప్యానల్ చేసి పనులు జరిగేలా కమిటీ సభ్యులు చూడనున్నారు. ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, ఉపేందర్ రెడ్డితో కూడిన మరో కమిటీని నియమించారు.  వీరు తమ తమ జోన్ల పరిధిలో అభివృద్ధి, బ్యూటిఫికేషన్​పనులకు అనుకూలమైన పరిస్థితులను గుర్తించి వచ్చే గురువారం లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.