సిటీలో భారీ వర్షం..హైదరాబాద్ ప్రజలకు ఆమ్రపాలి కీలక సూచన

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‏లో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మాన్‎సూన్ ఎమర్జెన్సీ బృందాలను అలర్ట్ చేసి.. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద నీరు నిలిచిందని ఎవరూ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదన్నారు. వరద నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వాహనాలు నడపవద్దన్నారు.

ALSO READ | కుండపోత వర్షానికి.. చైతన్యపురి, కొత్తపేట వీధుల్లో వరద

 వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఇంటి వద్ద ఉండాలన్న ఆమ్రపాలి.. అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా అత్యవసరమైతే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ సంప్రదించాలని సూచన చేశారు. కాగా, సోమవారం రాత్రి నగరవ్యాప్తంగా వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, చైత్యనపురి, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నక, హబ్సిగూడ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

 ఆఫీసులు, విద్యాసంస్థలు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురువడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్టాఫ్ అప్రమత్తమై సహయక చర్యలు చేపట్టారు.