గోదావరిఖని, వెలుగు: స్వచ్ఛ ఆటో డ్రైవర్లు చెత్త సేకరణ విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణ శ్రీ ఆదేశించారు. మంగళవారం రామగుండం బల్దియా పరిధిలోని డివిజన్లలో శానిటేషన్ నిర్వహణ తీరును, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. 36వ డివిజన్‌లో కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటో రెండు ట్రిప్పులకు బదులుగా ఒక ట్రిప్పు మాత్రమే పనిచేస్తుండడాన్ని గమనించి హెచ్చరించారు. జీపీఎస్ ద్వారా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ల పని తీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పారు.
సిటీని పరిశుభ్రంగా ఉంచడానికి శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు.. సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలన్నారు. 42, 46వ డివిజన్లలో మురుగు నీటి కాలువలను పరిశీలించారు. అనంతరం సిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సునీల్ రాథోడ్, కుమార స్వామి పాల్గొన్నారు.