కౌంటింగ్​ నాడు మద్యం అమ్మకాలు నిషేధం : కమిషనర్​ కల్మేశ్వర్​​

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు జిల్లాలో మద్యం, కల్లు అమ్మకాలను నిషేధించినట్లు పోలీస్​ కమిషనర్ ​కల్మేశ్వర్ సింగన్​వార్​ తెలిపారు. ఆదివారం పొద్దున 6 గంటల నుంచి సోమవారం పొద్దున 6 గంటల వరకు ఎక్కడా మద్యం అమ్మరాదన్నారు. వైన్స్, బార్, కల్లు దుకాణాలు మూసి ఉంచాలన్నారు.ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్​జరిగే పాలిటెక్నిక్​ కాలేజీకి కిలోమీటర్​ దూరంలో ప్రజలు గుమిగూడొద్దన్నారు.

144 సెక్షన్​అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో రిజల్ట్​ రోజు అల్లర్లు జరగకుండా పోలీస్ ​పికెటింగ్ ​ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిటర్నింగ్​ ఆఫీసర్​ జారీ చేసిన పాస్​తోనే కౌంటింగ్​ సెంటర్లలోకి వెళ్లాలని, సెల్​ఫోన్లు, అగ్గిపెట్టెలు, లైటర్లను లోనికి అనుమతించమన్నారు. పటాకులు కాల్చడంపై కూడా నిషేధం అమలులో ఉంటుందని, ఆదివారం ఎక్కడా విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీలులేదన్నారు. పోలీసుల రాతపూర్వక పర్మిషన్​ ఉంటేనే సోమవారం ర్యాలీలు తీయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.