
- టాక్స్ వాసూళ్ల కోసం మున్సిపల్ అధికారుల చర్యలు
- గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‍లో స్ట్రిట్గా పన్నుల వసూలు
- 520కి పైగా కమర్షియల్ బకాయిదారుల ఆస్తుల జప్తు
- 69 మంది ఆఫీసర్లు, సిబ్బందికి కమిషనర్ షోకాజ్ నోటీసులు
- ఇప్పటివరకు వసూలు చేసిన టాక్స్రూ.58 కోట్లు.., పెండింగ్ రూ.74 కోట్లు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో ఉన్నతాధికారులు పన్నుల వసూలులో పరుగులు పెట్టిస్తున్నారు. టాక్స్కట్టని దుకాణాలకు తాళాలు వేస్తూ.. ఇచ్చిన టార్గెట్ వసూలు చేయని ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులిస్తూ పన్నుల వసూలును కఠినతరం చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ చివరి అవకాశంగా మరో రెండువారాలే ఉండటం, వసూలు చేయాల్సిన పన్ను ఎక్కువగా ఉండటంతో సిబ్బంది చర్యలను ముమ్మరం చేశారు. కమిషనర్ స్థాయి ఉన్నతాధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
14 రోజుల గడువు.. రూ.74 కోట్ల టార్గెట్..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు రూ.118 కోట్ల 8 లక్షల 9 వేల ఆస్తి, నల్లా పన్నులు వసూలు చేయాల్సి ఉంది. కాగా, మార్చి 31 వరకు గడువు ఉండగా, అధికారులు 12వ తేదీ నాటికి కేవలం సగానికన్నా తక్కువగా రూ.58 కోట్ల 32 లక్షల 97 వేలు మాత్రమే వసూలు చేశారు. సెలవు రోజులు తీసేస్తే.. రాబోయే 14 రోజుల్లో రూ.59 కోట్ల 75 లక్షల 12 వేలు వసూలు చేయాల్సి ఉంది. ఇవీగాక మరో రూ.15 కోట్ల ఏరియర్స్కలిపి మొత్తం రూ.74 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. కాగా, 2023_24 ఏడాదికిగానూ బల్దియా టార్గెట్‍రూ.97 కోట్ల 66 లక్షలు ఉండగా, రూ.63 కోట్ల 96 లక్షలు అంటే 60 శాతం టాక్స్ వసూలు చేశారు.
తాళాలు వేస్తున్రు.. ఫర్నిచర్ పట్టుకెళ్తున్రు
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‍లో 2024_25 ఏడాదికిగానూ గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు పన్నుల వసూళ్లు 49.40 శాతం కాగా, రెండు వారాల్లో 50 శాతం వసూలు చేయాల్సి ఉండటంతో బల్దియా ఆఫీసర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాశీబుగ్గ, కాజీపేట సర్కిళ్ల పరిధిలోని మొత్తం 66 డివిజన్లను డిప్యూటీ కమిషనర్ల నుంచి వార్డ్ ఆఫీసర్ల వరకు విభజించారు. ఈ క్రమంలో వీరంతా ఏరియాల్లో తిరుగుతూ మొదట రెడ్ నోటీసులు జారీ చేసి, ఆపై మొండి బకాయిలు, టాక్స్ ఆధారంగా ఆస్తుల జప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 520కి పైగా బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, ఇనిస్టిట్యూషన్లు తదితర కమర్షియల్ బకాయిదారుల దుకాణాలకు తాళాలు వేశారు.
కొన్నిచోట్ల ఫర్నిచర్, ఇతర ఖరీదైన వస్తువులను జప్తుచేశారు. పన్ను చెల్లించేవరకు షాపులు తీయకుండా అధికారుల సంతకాలతో సీజ్ చేశారు. నివాసయోగ్య కాలనీల్లో ఇప్పటివరకు నోటీసులు ఇస్తూ వచ్చిన సిబ్బంది ఆపై నల్లా కనెక్షన్ కట్ చేశారు. ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి టాక్స్ కట్టని ఇండ్లకు కరెంట్ సైతం కట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే, పన్నుల వసూళ్లలో ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపని అధికారులకు సైతం గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇద్దరు డిప్యూటీ కమిషనర్లతో పాటు ఒక ఆర్వో, ఇద్దరు ఆర్‍ఐలు, 64 మంది వార్డ్ ఆఫీసర్లతో కలిపి మొత్తంగా 69 మంది ఆఫీసర్లు, సిబ్బందికి ఉన్నాతాధికారులు నోటీసులు అందించారు.
నల్లా కట్‍పై విమర్శ..
మున్సిపల్ కమిషనర్‍గా అశ్విని తానాజీ వాకాడే పన్నుల వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలో అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్నరాణి, రాజేశ్వర్, డిస్ట్రిక్ట్ టాక్స్ ఆఫీసర్ రామకృష్ణలతో కూడిన బృందం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో బార్లు, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఇనిస్టిట్యూట్లు వేలాదిగా ఉన్నాయి. దీనికితోడు వివిధ పార్టీలకు చెందిన లీడర్లు సైతం పెద్ద బకాయిదారుల్లో ఉన్నారు.
ఈ క్రమంలో గతంలో మొండి బకాయిదారుల పేర్లతో పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగులు తయారుచేసి పెట్టేవారు. సమాజంలో పెద్ద పేరుండి అవమానంగా ఫీల్ అయ్యేవారు వెంటనే వాటిని చెల్లించేవారు. ఈసారి ఈ తరహా ప్రయత్నం చేయలేదు. ఇదే సమయంలో పేదోళ్లు నివసించే కాలనీల్లో మాత్రం చిన్నపాటి పన్నులకే నోటీసుల పేరుతో హడవుడి చేయడం నల్లా కట్ చేస్తున్నారని, పెద్దోళ్లకు మరింత గడువు ఇస్తూ మర్యాద చూపుతున్నారనే విమర్శలు
వస్తున్నాయి.