అధికార లాంఛనాలతో జాగిలానికి తుది వీడ్కోలు పలికిన కమిషనర్ పోలీస్ విభాగం

కరీంనగర్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ స్నిఫర్(బాంబ్ స్క్వాడ్) జాగిలం మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని డాగ్ స్క్వాడ్ ఆవరణలో సీపీ సత్యనారాయణ సహా పోలీసు ఉన్నతాధికారుల నివాళులర్పించారు.  అనంతరం మానేరు తీరంలోని  లేక్ పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో అధికారిక లాంచనాలతో జాగిలానికి అంత్యక్రియలు నిర్వహించారు. గాలిలోకి కాల్పులు జరిపి, జాగిలానికి అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్ లు కూడా పాల్గొన్నారు. 

ఆరేళ్ల క్రితం పప్పీ పేరుతో ఈ జాగిలాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నామని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఆ తర్వాత దీని పేరు టైసన్ గా మార్చామని, ప్రధానమంత్రి మోడీ, సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల బందోబస్తులో ఈ జాగిలం సేవలందించిందని చెప్పుకొచ్చారు. మేడారం జాతర,  హైదరాబాద్ బోనాలు సహా వివిధ  సమయాల్లోనూ ఈ జాగిలం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. జాగిలం మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు.