హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే: రంగనాథ్

హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే: రంగనాథ్
  • డబ్బులడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి
  • ఏసీబీ ఆఫీసర్లకూ కంప్లయింట్ చేయొచ్చు
  • సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లకు బెదిరింపులా?
  • హైడ్రాను నీరుగార్చేందుకు యత్నిస్తే కఠిన చర్యలు
  • కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్
  • అమీన్ పూర్ లో వసూళ్లకు పాల్పడుతున్న విప్లవ్ అరెస్ట్

హైదరాబాద్: హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరిస్తే జైలుకు పంపుతామని కమిషనర్ రంగనాథ్. సామాజిక కార్యకర్తలుగా చెలామణి అవుతున్న కొందరు బిల్డర్లను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రా లో తమకు ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. హైడ్రాను నీరుగార్చే ప్రయత్నాలపై కొరడా ఝుళిపిస్తామని చెప్పారు. బిల్డర్లను తప్పుదోవ పట్టించే  ప్రయత్నం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. హైడ్రా పేరుతో కానీ, తన పేరుతో గాని ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏసీబీ అధికారులకూ కంప్లయింట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

‘రంగనాథ్ నాకు బాగా తెలుసు’

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో  ఓ నిర్మాణ సంస్థ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. తాను సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని ప్రచారం చేసుకుంటూ బండ్ల విప్లవ్ సిన్హా అనే వ్యక్తి సదరు బిల్డర్ ను బెదిరించారు. నిర్మాణ పనులు చూసేందుకు వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నాడు. తనకు రూ. 20 లక్షలు ఇవ్వాలని లేకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని, పత్రికల్లో రాయిస్తానని పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి పిలిపించాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో తనకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపించాడు. అమీన్ పూర్ ఏరియాలో ఎలాంటి విషయమైనా రంగనాథ్ తననే అడుగుతారని, తనకు డబ్బు ఇవ్వకుంటే మీ నిర్మాణాలను కూల్చేయిస్తానని, పత్రికల్లో తప్పుగా రాయిస్తానని బెదిరించాడు. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా పై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో విప్లవ్ ను పోలీసులు అరెస్టు చేశారు.  

కూల్చివేతలకు బ్రేక్.. రంగనాథ్ బిజీ

గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు ఉన్నాయి. దాంతో సిటీలో కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాత్రం బిజీగా ఉన్నారు. వర్షం ఉన్న సమయంలో వాటర్ లాగిన్ పాయింట్స్, లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాలు నీట మునిగేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీల్లో పర్యటిస్తున్నారు. నీరు ఉన్నప్పుడే ఆ ప్రాంతాలను సందర్శించి మార్క్ చేసుకుంటున్నారు. తర్వాత నోటీసులు అందజేసే అవకాశం ఉంది.