హైదరాబాద్ సిటీ, వెలుగు: కొందరు కావాలనే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అనుమతులు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా తమ వ్యాపారం చేసుకోవచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ‘‘పర్మిషన్లు ఉన్న వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. చెరువులకు సమీపంలో అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయం. కొందరు కావాలనే హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న నిర్మాణాల వద్దకు తాము రాబోమని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంది” అని చెప్పారు. హైడ్రాపై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, అన్ని డాక్యుమెంట్లు సరిచూసుకుని ప్రాపర్టీలు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.
వెరిఫై చేసుకున్నాకే కొనుగోలు..
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ప్రాపర్టీ కొనేముందు దాని గురించి జనం ముందుగా వెరిఫై చేసుకుంటున్నారు. కొనబోయే ప్రాపర్టీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లేదా ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఏమైనా ఉందా? అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. దీనికోసం సంబంధిత డాక్యుమెంట్లను పట్టుకొని హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆయా లోకల్ మున్సిపల్ఆఫీసులకు వెళ్తున్నారు. అన్ని వెరిఫై చేసుకున్నాకే ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఏ కార్యాలయానికి వెళ్లినా ఇలాంటి వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు మరికొందరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. కాగా సిటీ, శివారు ప్రాంతాల్లో ఏదైనా చిన్న ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా కనీసం కోటిన్నరకు పైగానే పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఇంత పెట్టి ప్రాపర్టీ కొనుగోలు చేసిన తర్వాత అది అక్రమ నిర్మాణమని తేలితే కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రాపర్టీ కొనుగోలు చేసేముందే అన్ని చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.