హైదరాబాద్, వెలుగు: వరద ముంపు నివారణకు చేపట్టిన నాలా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్ బీ నగర్ జోన్ పరిధి సరూర్ నగర్ సర్కిల్ లోని తపోవన్ కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీల్లో కమిషనర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. సరూర్ నగర్ చెరువు అప్ స్ట్రీమ్, ఇన్ లెట్లను చూశారు. నాలా, బ్రిడ్జి వద్ద ఇరువైపులా పూడిక తీయాలని ఆదేశించారు.
సరూర్ నగర్ చెరువు అభివృద్ధి పనులపై లేక్స్ అధికారులతో చర్చించి, త్వరగా కంప్లీట్ చేయాలని సూచించారు. చెరువు సమీపంలోని కాలనీ గ్రీన్ పార్క్,తపోవన్ కాలనీ ఎఫ్ టీఎల్ సమస్య, సరూర్ నగర్ సరస్సు మురుగునీటి ప్రవేశం హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న ఎస్ టీసీ పూర్తి చేయాలని, ఎస్ఎన్డీపీ కింద నిర్మించిన శంకేశ్వర్ మసీదు వద్ద స్మార్ట్ వాటర్ డ్రైన్ అవుట్ లెట్ సమస్య తీర్చాలని కార్పొరేటర్ కమిషనర్ ను కోరారు. ఆయన వెంట లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ (లేక్స్) శివ కుమార్ నాయుడు, ఎస్ సీ (లేక్స్) ఆనంద్, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఎల్ బీ నగర్ ఎస్ సీ అశోక్ రెడ్డి ఉన్నారు.