బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో పీటీసీ ఏర్పాటుకు కృషి : శ్రీనివాసులు

బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో పీటీసీ ఏర్పాటుకు కృషి : శ్రీనివాసులు

బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్/మందమర్రి, వెలుగు: బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ) ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్, తాళ్లగురిజాలతో పాటు ఇక్కడి ఏసీపీ, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఏఆర్ ఏసీపీ కార్యాలయాలను సీపీ తనిఖీ చేశారు.

అనంతరం రూరల్ సర్కిల్ ఇన్​స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లిలో రోజురోజుకూ జనాభా పెరుగుతున్న దృష్ట్యా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​తో పాటు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది నియామకాలు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

సీపీ వెంట బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్, ఏఆర్ ఏసీపీ సురేందర్, రిజర్వ్ ఇన్​స్పెక్టర్ సంపత్, రూరల్ ఇన్​స్పెక్టర్ మహమ్మద్ అఫ్జలోద్దిన్, వన్ టౌన్ ఇన్​స్పెక్టర్ దేవయ్య, ఎస్ఐలు ఉన్నారు. మందమర్రి, కాసిపేట పోలీస్​ స్టేషన్​ను సైతం సీపీ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్​రెడ్డి తదితరులున్నారు.