ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానున్నదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనులను పోలీస్ కమిషనర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్, నిబంధనలకు సంబంధించిన చిత్రాలు, ఆట స్థలంతో పాటు ద్విచక్ర వాహనం ఎలా నడపాలో వివరించేందుకు సిమిలేటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు అవగాహనతో పాటు మెరుగైన సేవలందించి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సాధుల సారంగపాణి, సీఐ అశోక్, ట్రాఫిక్ ఏఎస్సై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.