సిద్దిపేట, వెలుగు:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 మున్సిపాల్టీలకు చెందిన కమిషనర్లు గురువారం సిద్దిపేట మున్సిపాల్టీలో పర్యటించారు. ఆదిభట్ల, ఆమన్ గల్, బడంగ్ పేట్, ఇబ్రహీంపట్నం, జాలపల్లి, కొత్తూరు, మీర్ పేట, పెద్ద అంబర్ పేట మున్సిపల్ కమిషనర్లతో పాటు అధికారులు మున్సిపాల్టీలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట 43 వార్డులో ఇంటింటి చెత్త సేకరణ పరిశీలించడమే కాకుండా తడి పొడి చెత్త వేరు ఇవ్వడంపై ప్రజలతో మాట్లాడారు. బుస్పాపూర్ లో ఏర్పాటు చేసిన సీఎన్జీ బయో గ్యాస్ ప్లాంట్ ను పరిశీలించి మిథేన్ నుంచి సీఎన్జీ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు.
బయో మైనింగ్ ద్వారా జీవ ఎరువు తయారీ, పాత బట్టలను దహనం చేసే ఇన్సినటేటర్, మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ఎఫ్ఎస్టీపీ లను పరిశీలించారు. హౌసింగ్ బోర్డ్ వద్ద ఉన్న పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని సందర్శించి వచ్చిన పొడి చెత్త ను కంప్రెషర్ మిషన్ ద్వారా ముద్దగా తయారుచేసి విక్రయానికి తరలించడం వంటి విషయాలను గమనించారు.
తడి, పొడి చెత్తను వేరు చేయడం, చెత్తతో సంపదను సృష్టించడం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించడం, వ్యర్థ సామగ్రితో వివిధ కళాకృత్తులకు రూపకల్పన, సేంద్రియ ఎరువులతో పూల మొక్కలు, కూరగాయలను సాగుచేయడం వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్చ బడి సందర్శనకు వచ్చిన అధికారులకు జ్ఞాపికగా కొబ్బరి పీచుతో తయారైన అగర్బత్తి, స్టీల్ వాటర్ బాటల్,సేంద్రియ ఎరువులను అందించారు. అనంతరం కోమటి చెరువు సందర్శించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ మంజుల, కమిషనర్ అశ్రిత్ కుమార్, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.