టీఆర్ఎస్ పాలనల కమిట్‌‌మెంట్ కనవడ్తలె

దశాబ్దాలుగా సాగిన ఉద్యమం, ఎందరో విద్యార్థుల బలిదానాలు, యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై చేసిన పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఏ ఒక్క వ్యక్తి వల్లనో, పార్టీ వల్లనో ఇది సాధ్యం కాలేదు. ఏదేమైనా ఉద్యమ పార్టీగా పేరుపొందిన టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టంకట్టి ఉద్యమ ఆశయాలు నెరవేరుస్తుందని ఆశగా చూశారు. కానీ ఉద్యమ లక్ష్యాల సాధనలో గానీ.. ఎన్నికల హామీలులో గానీ కమిట్‌‌మెంట్ కనిపించకపోవడం బాధాకరం.  ఈ ఆరున్నరేండ్ల పాలనలో అధికార పార్టీ నాయకులు వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని  ప్రతిపక్షాలు,మేధావులు విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు వాటిపై నోరు మెదపడం లేదు. అంటే మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా ఆ విమర్శల్లో నిజం ఉన్నదనా? అందుకే ప్రభుత్వం స్పందించడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, జవాబుదారీతనం లేని పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఆరోపణలు వచ్చినప్పుడు వాటిలో నిజానిజాలు తేల్చే ప్రజలకు మేలు చేసే విషయంలో తమ కమిట్‌‌మెంట్‌‌ను నిరూపించుకోవాలన్న ఆలోచన నాయకుల్లో ఉంటేనే ఆ పార్టీలు పదికాలాల పాటు ప్రజల మన్ననలు పొందుతాయని తెలుసుకోవాలి. చెప్పింది ఒక్కటీ సక్కగ చేయలె సీఎం కేసీఆర్ అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదు. తెలంగాణ వచ్చాక తొలి సీఎం దళిత వ్యక్తినే చేస్తామని ప్రకటించి, తల తీసుకుంటానే కానీ మాట తప్పనని చెప్పారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బహిరంగంగా చెప్పిన ఆ మాట ఎందుకు తప్పారన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ, దళితులకు భూపంపిణీ, కేజీ టూ పీజీ విద్య, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఏమైపోయాయో, వాటి అమలులో ఫెయిల్ అవడానికి కారణలేంటన్న దానిపై క్లారిటీ ఇవ్వాలి. తొలిసారి అధికారంలోకి వచ్చాక అరకొర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ నుంచి మొదలుపెడితే… ఫలితాలు ఇచ్చే వరకూ లీగల్ సమస్యలు వచ్చి కోర్టుమెట్లు ఎక్కడానికి కారణాలు ఏంటి?  మొన్న  జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా కేవలం ఆ నియోజకవర్గానికి మాత్రమే రైతుబంధు ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటి? హైదరాబాద్ ను విశ్వ నగరంగా మారుస్తామని ఎన్నో వేదికలపై ప్రకటించిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఏనాడూ ప్రణాళికలు రూపొందించలేదు. అక్టోబర్ లో కురిసిన వర్షాల కారణంగా సిటీలో రోడ్లు నదుల్ని తలపించాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరద బాధితులకు రూ.10 వేలు ప్రకటించడం, అందులోనూ అధికార పార్టీ నేతలు కమీషన్లు తీసుకోవడం, చాలా మందికి అసలు పరిహారమే అందకపోవడం వంటి వాటిపై విమర్శలు వచ్చాయి. అవినీతి, కబ్జాలపైనా నోరుమెదపని నేతలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల పేరుతో అధికార పార్టీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. టీఆర్ఎస్ లో కార్పొరేటర్, ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రుల వరకు అనేక మంది భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపైనా రోజూ వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా ఆ నేతలెవరూ తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పే ప్రయత్నం చేయలేదు. విచారణకు ఆదేశించి తమ నిజాయితీని నిరూపించుకునేందుకూ సిద్ధపడలేదు. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలె ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం, పాలనా వైఫల్యాలను ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తుండడంతో ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాల్లోనే వరాల జల్లులు ఉంటాయి తప్ప మిగతా సమయంలో తమను పట్టించుకోరని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ సమయంలో మాయ మాటలు చెప్పి ఆ తర్వాత ఆ హామీలేవీ పట్టించుకోకుండా.. ప్రజాధనం దోపిడీ చేసే పనిలో బిజీగా ఉంటున్నారని భావిస్తున్నారు. ఈ రకమైన పరిస్థితికి పాలకులే కారణం. తమపై వచ్చే విమర్శలు, ఆరోపణలకు సమాధానం చెప్పి, అవసరమైతే విచారణలను ఎదుర్కొని నిజానిజాలను నిరూపించిన నాడే ఆ నాయకులపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పైగా ప్రస్తుతం వార్తా పత్రికలు, చానెళ్లు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి సమాచారం వేగంగా చేరుతోంది. టెక్నాలజీ పెరిగడంతో యువత కూడా అన్నింటినీ గమనిస్తోంది. నాయకులు అవినీతి లేకుండా జవాబుదారీతనంతో పని చేయాలని వారు కోరుకుంటున్నారు. ఎలక్షన్లొస్తే వరాలు.. తర్వాత సైలెంట్ ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడ ప్రజలపై వరాలు కురిపించి, మోసం చేయాలన్న ఎత్తుగడలో టీఆర్ఎస్ పార్టీ సాగుతోంది. ఆ హామీల విషయంలో జవాబుదారీతనం లేకుంటే ప్రజలు తమ ఓటుతో సమాధానం చెబుతారు. కానీ సీఎం కేసీఆర్ తీరులో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లుగా లేదు. ఇటీవల నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో హాలియాలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేయడం ఆ కోవలోనే చూడాలి. ఇక సిద్దిపేట, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో సిద్దిపేట బహిరంగ సభలో వరాల జల్లు, ఖమ్మంలో ఐటీ పార్కు, వరంగల్ లో విమానాశ్రయం, ఐటీ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడడంతో నిరుద్యోగులను మాయ చేసేందుకు 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ కొత్త డ్రామా షురూ చేశారు. – డా. పోలం సైదులు ముదిరాజ్, సామాజిక విశ్లేషకుడు