ప్రజల ప్రాణాల కంటే పలుగురాళ్లే ముఖ్యమా?..ధర్నాకు దిగిన మైలారం గ్రామస్తులు

ప్రజల ప్రాణాల కంటే పలుగురాళ్లే ముఖ్యమా?..ధర్నాకు దిగిన మైలారం గ్రామస్తులు
  • మైలారం గుట్ట మైనింగ్‌‌‌‌కు వ్యతిరేకంగా దీక్షకు సిద్ధమైన కమిటీ సభ్యులు
  • పలువురిని అరెస్ట్‌‌‌‌ చేయడంతో ధర్నాకు దిగిన గ్రామస్తులు

అచ్చంపేట, వెలుగు : ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పలుగురాళ్లే ఎక్కువ అయ్యాయా ? అని నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా బల్మూర్‌‌‌‌ మండలం మైలారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలోని గుట్టపై జరుగుతున్న మైనింగ్‌‌‌‌ను నిలిపివేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ మైనింగ్‌‌‌‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిరవధిక దీక్షకు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున గ్రామానికి వచ్చి మాజీసర్పంచ్‌‌‌‌ వెంకటేశ్వర్లు, సుమిత్ర, కౌసల్య, చిన్న లింగయ్య, పెద్ద లింగయ్య, గుడేలి లక్ష్మయ్యను ముందస్తుగా అరెస్ట్‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌కు తరలించారు. 

అనంతరం మరికొందరిని అరెస్ట్‌‌‌‌ చేసేందుకు వస్తుండగా గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ప్రాణాలు పోయినా మైనింగ్‌‌‌‌ పనులు సాగనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మైనింగ్‌‌‌‌ను అడ్డుకుంటామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు మైనింగ్‌‌‌‌ వ్యాపారులకు కొమ్ము కాయడం సిగ్గు చేటన్నారు. మైనింగ్‌‌‌‌కు వ్యతిరేకంగా ఎన్నికలను బహిష్కరిస్తే.. అచ్చంపేట ఆర్డీవో, ఇతర అధికారులు హామీ ఇచ్చి ఓట్లు వేయించారని

తర్వాత కొన్ని రోజులకే మైనింగ్‌‌‌‌ అనుమతులు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. గుట్టపై మైనింగ్‌‌‌‌ పనుల కారణంగా నెమళ్లు, కోతులు పొలాల్లోకి వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్‌‌‌‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్న వారిని బలవంతంగా అరెస్ట్‌‌‌‌ చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ టైంలో కొందరు గ్రామస్తులు పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్ట్‌‌‌‌ చేసిన ఆరుగురిని పోలీసులు విడుదల చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

2018లో అనుమతులు.. 2024లో తవ్వకాలు

మైలారం (నాగర్‌‌‌‌కర్నూల్), వెలుగు : నల్లమలలోని టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో మైలారం గ్రామంలో 400 ఇండ్లు ఉండగా, 1500 జనాభా నివసిస్తున్నారు. గ్రామాన్ని ఆనుకొని 115 ఎకరాల్లో గుట్ట ఉంది. మైలారం, బల్మూరు, కొండనాగుల గ్రామాలకు చెందిన రైతులు, పశువుల కాపర్లు తమ జీవాలను ఈ గుట్టపై మేపుకుంటారు. గుట్ట కిందున్న చెరువు నుంచి మూడు ఊర్లకు చెందిన 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ గుట్టపై సర్వే నంబర్‌‌‌‌ 120/1లో 24.28 హెక్టార్లలో 20 ఏండ్ల పాటు క్వార్ట్జ్‌‌‌‌ తవ్వుకునేందుకు 2018లో మైనింగ్‌‌‌‌ శాఖ పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది.

బోగస్‌‌‌‌ తీర్మానంతో పర్మిషన్‌‌‌‌

మైలారం గుట్టపై మైనింగ్‌‌‌‌కు అభ్యంతరం లేదని 2021 మార్చి 27న అప్పటి సర్పంచ్‌‌‌‌ ఓ తీర్మానం కాపీని జిల్లా ఆఫీసర్లకు అందజేశారు. దీంతో మైనింగ్‌‌‌‌ వల్ల పర్యావరణానికి, చెరువుకు ఎలాంటి నష్టం లేదంటూ ఆఫీసర్లు గంటల వ్యవధిలోనే రిపోర్ట్‌‌‌‌ తయారు చేసి ప్రభుత్వానికి అందజేసి పర్మిషన్లు ఇప్పించారు. అయితే గ్రామసభలో మైనింగ్‌‌‌‌పై చర్చ జరగలేదని, ఎలాంటి తీర్మానం చేయకున్నా బోగస్‌‌‌‌ పత్రాలు తయారు చేశారంటూ గ్రామస్తులు బల్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 మరోవైపు మైనింగ్‌‌‌‌ పర్మిషన్‌‌‌‌ తీసుకున్న వ్యక్తులు పనులు మొదలు పెట్టారు. దీంతో ఈ నెల 5న హైదరాబాద్‌‌‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలువురు నేతలు రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశం నిర్వహించి మైలారం గ్రామస్తులకు అండగా ఉండాలని నిర్ణయించారు. మైనింగ్‌‌‌‌కు వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్షలు చేపడుతామని గ్రామస్తులు ప్రకటించడంతో పోలీసులు పలువురిని అరెస్ట్‌‌‌‌ చేయగా ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ధర్నాకు దిగారు.