
ఇంటర్ ఫలితాల్లో తప్పులకు గ్లోబరీనా సంస్థతో పాటు ఇంటర్ బోర్డుదీ బాధ్యతేనని ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తేల్చినట్లు తెలిసింది. గతంలో వచ్చిన తప్పులపై చర్యలు తీసుకోకపోవడంతో, ఫలితాల్లో ఇంత పెద్దమూల్యం చెల్చించాల్సి వచ్చిందని కమిటీ గుర్తించింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన టెక్నికల్ సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు, ప్రొఫెసర్ నిశాంక్ , ప్రొఫెసర్ వాసన్ తో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను సిద్ధం చేసింది. గురువారం రాత్రి వరకూ పూర్తిస్థాయి రిపోర్ట్ రెడీ కాగా, ఆ సమయానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం అందజేయాలని కమిటీ నిర్ణయం తీసుకున్నది.
కమిటీ సభ్యులు ఇంటర్ బోర్డుతో పాటు గ్లో బరీనా సంస్థల్లోకి వెళ్లి వివరాలను సేకరించారు. పలుప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. గ్లోబరీనా సంస్థకున్న అర్హతలపై లోతుగా అధ్యయనం చేశారు.టెండర్ దశ నుంచి ఫలితాల వరకూ జరిగిన ప్రక్రియపైనా వివరాలు సేకరించారు. అయితే బోర్డు, గ్లోబరీనా సంస్థ ఇచ్చిన వివరణపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్రాస్ చెక్ చేయకుండానే ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేయడంతో తప్పులొచ్చినట్టు కమిటీ గుర్తించినట్లు తెలిసింది.గ్లోబరీనాకు అధికారికంగా బోర్డు నుంచి ఎలాంటి అగ్రిమెంట్ లేదనే విషయాన్ని కమిటీ తేల్చి నట్లుసమాచారం. అడ్వాన్డ్ స్ సప్లిమెంటరీ పరీక్షలు,ఫలితాలు, రీవెరిఫికేషన్ , రీ కౌంటింగ్ సందర్భంగాఎలా వ్యవహరించాలనే దానిపై ప్రభుత్వానికి కమిటీపలు సూచనలు చేస్తూ నివేదికను రెడీ చేసింది.