మహిళా వర్సిటీలో సర్టిఫికెట్ల లొల్లి..త్రీమెన్ కమిటీ వేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్  

మహిళా వర్సిటీలో సర్టిఫికెట్ల లొల్లి..త్రీమెన్ కమిటీ వేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్  
  • ఈ నెల 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లపై లొల్లి కొనసాగుతున్నది. అక్కడ చదివిన వారికి దేని పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వాలనే దానిపై అయోమయం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆ వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్ విజ్ఞప్తి మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు త్రీమెన్ కమిటీ వేశారు. ఇందులో ఎంజీయూ మాజీ వీసీ గోపాల్ రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ నగేశ్, రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ పొద్దర్ ఉన్నారు. ఈ నెల 25లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కౌన్సిల్ సూచించింది.  కాగా, 2022లో కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా అప్​గ్రేడ్ చేస్తూ అప్పటి సర్కార్ జీవో  జారీ చేసింది. అయితే, ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టలేకపోయింది.

కాంగ్రెస్ సర్కార్ ఇటీవల వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మారుస్తూ, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టింది. బిల్లు పాస్ కాగా గవర్నర్ ఆమోదానికి వెళ్లింది. ఇక నుంచి చదివే వారికి మహిళా వర్సిటీ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. కానీ 2022–23, 2023–24లో చదివిన వారికి సర్టిఫికెట్లను కోఠి ఉమెన్స్ పేరుతోనా? లేక తెలంగాణ మహిళా వర్సిటీ పేరుతోనా? లేకుంటే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ పేరుతో ఇవ్వాలా? అనే దానిపై అయోమయం నెలకొన్నది. ప్రస్తుతం చదువు పూర్తయిన వారికి సాఫ్ట్ కాపీలే  అందించారు. ఈ నేపథ్యంలో హార్డ్ కాపీలు కావాలని ఇటీవల విద్యార్థులు ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలో త్రీమెన్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వారికి సర్టిఫికెట్లు అందించనున్నారు.