
కాలేజీల్లో గవర్నింగ్ బాడీలేవీ..?
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థలను పర్యవేక్షించాల్సిన పాలకమండళ్లు కనిపించడం లేదు. చాలా కాలేజీల్లో కొన్నేళ్లుగా కమిటీలు లేకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జేఎన్టీయూ పరిధిలో ఏకంగా పదేండ్ల నుంచి వర్సిటీ నామినీలను పెట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మేనేజ్మెంట్లు ఇష్టారాజ్యంగా ఉంటున్నాయి.
ప్రైవేటు కాలేజీలు పట్టించుకోవట్లే
రాష్ర్టంలో 2 వేలకుపైగా ఉన్నత విద్యాసంస్థలున్నాయి. ఎక్కువగా జేఎన్టీయూ పరిధిలో ప్రొఫెషనల్ కాలేజీలున్నాయి. ప్రతి కాలేజీ ఫంక్షనింగ్కు తప్పనిసరిగా గవర్నింగ్బాడీ ఉండాలని వర్సిటీ రూల్స్‌లోనే ఉంటుంది. సిబ్బంది ఎంపికతో సహా బడ్జెట్ వరకూ అన్నింటినీ గవర్నింగ్ బాడీ మానిటర్ చేయాల్సి ఉంటుంది. కోర్సులను మూసేయాలన్నా, కొత్తగా పెట్టాలన్నా, కాలేజీ మార్చాలన్నా కమిటీ నిర్ణయం తీసుకోవాలి. అలాంటి గవర్నింగ్ బాడీలను ప్రైవేటు కాలేజీలు పట్టించుకోవట్లేదు. అవి ఉన్నాయో లేదో చెక్ చేసి, లేకుంటే ఏర్పాటు చేయాల్సిన వర్సిటీలూ చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కమిటీలు లేకపోవడంతో సిబ్బంది జీతభత్యాలు టైంకు ఇవ్వకపోగా, ఆడిటింగ్నూ సరిగ్గా చేయట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీలో కొత్త ప్రొఫెసర్లు ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో వర్సిటీలకు టైంకు తెలియట్లేదు. మేనేజ్మెంట్లు కాలేజీ ఆదాయ, వ్యయాలను తమకు తగ్గట్టు మార్చుకుంటున్నాయి.
నామినీ పేర్లను ప్రకటించని జేఎన్టీయూ
జేఎన్టీయూ పరిధిలోని ప్రతి కాలేజీలో 12 మందితో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. దాంట్లో చైర్మన్గా సాంకేతిక నిపుణుడు లేదా విద్యావేత్త ఉంటారు. నలుగురు సభ్యులను ట్రస్టీ లేదా సొసైటీ నామినేట్ చేస్తుంది. మరో ఇద్దరు ఆయా రంగాల్లో నిపుణులుంటారు. ఇద్దరు విద్యావేత్తలు, వర్సిటీ నామిని ఒకరు, ఒక గవర్నమెంట్ నామినీతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్ మెంబర్ సెక్రటరీగా ఉంటారు. కమిటీ మీటింగ్ ఏటా రెండుసార్లు జరగాలి. సమావేశంలో వర్సిటీ నామినీతో పాటు 40% కోరం ఉండాలి. నామినీలను జేఎన్టీయూ కొన్నేండ్లుగా నియమించట్లేదన్న విమర్శలున్నాయి. అన్ని వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
సిబ్బందికి టైంకు జీతాలియ్యట్లె
పదేండ్లుగా గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయలేదు. దీంతో కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు, ఇంక్రిమెంట్లు సరిగా అందడం లేదు. కొన్ని కాలేజీల్లో మేనేజ్‌మెంట్లు టైంకు జీతాలు ఇవ్వడం లేదు. ఇతర సౌకర్యాలూ కల్పించట్లేదు. గవర్నింగ్ బాడీ
ఉంటే ఈ సమస్యలు చర్చకు వచ్చేవి. వెంటనే గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయాలె.
– బాలకృష్ణా రెడ్డి, టీటీఐఈఏ ప్రెసిడెంట్
వివరాలు సేకరిస్తున్నం
వర్సిటీ నిబంధనల ప్రకారం గుర్తింపున్న అన్ని కాలేజీల్లో గవర్నింగ్ బాడీ కమిటీలుండాలి. కొన్ని కాలేజీల్లో ఉన్నాయి. కొన్నింటిలో లేవు. ఎక్కడడెక్కడ లేవు అనే వివరాలను ప్రస్తుతం సేకరిస్తున్నం. త్వరలోనే కాలేజీల్లో గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేస్తాం.
– గోవర్థన్, జేఎన్టీయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్