ఫుడ్ క్వాలిటీపై కలెక్టర్ చైర్​పర్సన్‌గా కమిటీలు.. ఆరేండ్లలో వేల మందికి గ్యాస్ట్రిక్​ సమస్యలు

ఫుడ్ క్వాలిటీపై కలెక్టర్ చైర్​పర్సన్‌గా కమిటీలు.. ఆరేండ్లలో వేల మందికి గ్యాస్ట్రిక్​ సమస్యలు

మిడ్​డే మీల్స్ లో క్వాలిటీ పెంచేందుకు జిల్లా స్థాయిలోనే కమిటీ లు వేయనున్నారు. జిల్లా కలెక్టర్ చైర్​పర్సన్​గా డీఈవో, వివిధ సంక్షేమ శాఖలకు చెందిన డీడీలు, సివిల్ సప్లై అధికారులు, ఐసీడీఎస్ ఆఫీసర్​, డీఎంఅండ్ హెచ్  వో తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్కూల్, గురుకులాల లెవల్​లో ఉండే స్టూడెంట్, టీచర్ల కమిటీలతో నిత్యం సమావేశమవుతారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ 2011లో  అప్పటి  ప్రభుత్వం మిడ్​డే మీల్స్  స్కీమ్​ అమలు కోసం రాష్ట్ర , మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమించింది. ఈ కమిటీల విధివిధానాలపై అప్పట్లో రిలీజ్ చేసిన జీవో 21లో స్పష్టంగా పేర్కొన్నది. 

 13 ఏండ్ల కింద ఇచ్చిన జీవో కావడంతో.. ప్రస్తుతం మారిన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త అంశాలను చేర్చి.. త్వరలోనే స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీలను  వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.  గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులనూ మిడ్​డే మీల్స్​ స్కీమ్​ అమలులో భాగస్వాములను చేసేలా కొత్త గైడ్​లైన్స్ తయారుచేయాలని నిర్ణయించింది. అదే సమయంలో స్కూళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఇక నుంచి రెగ్యులర్​ గా ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. వీరిలో ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువగా ఉందని తేలితే, వారికి మిడ్​ డే మీల్స్ తో పాటు ఇతర సప్లిమెంటరీ క్వాలిటీ ఫుడ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారిని ఇతర విద్యార్థుల మాదిరిగా నార్మల్ చేసేంత వరకూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

గత ఆరేండ్లలో వేల మందికి గ్యాస్ట్రిక్​ సమస్యలు

 గత ఆరేండ్ల కాలంలో గురుకులాలు, స్కూళ్లు, హాస్టళ్లలో వేల మంది ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. అధికారికంగా 2,618 మంది విద్యార్థులు తీవ్ర గ్యాస్ట్రో సమస్యలతో ఆసుపత్రుల పాలయ్యారు. 2017లో 244 మంది, 2018లో 135 మంది, 2019లో 571 మంది, 2020లో 102 మంది, 2021లో 373 మంది, 2022లో 615 మంది, 2023లో 578 మంది విద్యార్థులు గ్యాస్ట్రిక్​ సమస్యలతో ఆసుపత్రి పాలైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నా అనధికారికంగా ఈ లెక్క అంతకు అనేక రెట్లు ఉంటుంది. 2020లో కరోనా ఉండడంతో గురుకులాలు, హాస్టళ్లు బంద్ ఉన్నాయి. దీంతో ఆ ఒక్క ఏడాది కేసులు తగ్గినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. 

ALSO READ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

బియ్యం,  పప్పులు, ఇతర సామగ్రి ముందే స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లకు సప్లై చేయడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండి  ఎలుకలు, పురుగులు పడ్తున్నాయని, దీంతో ఆయా పదార్థాలు కలుషితమవుతున్నాయని, ఇక రెండు, మూడు రోజులుకు సరిపడా కూరగాయలు ఒకేసారి తేవడం వల్ల కుళ్లిపోతున్నాయని ఆఫీసర్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి బదులు వారానికోసారి బియ్యం, ఉప్పు, పప్పులాంటి సరుకులు, ఏరోజుకారోజు కూరగాయలు సప్లై చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు ఓ అధికారి ‘వెలుగు’కు వివరించారు.

టూ లెవల్​ చెకింగ్ 

వరుస ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు బళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందించే  భోజనం చెక్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు,  వంట పూర్తయ్యాక మరోసారి మొత్తంగా 2 సార్లు చెక్ చేయనున్నారు. ఇందుకోసం స్కూల్ లెవెల్ లో స్టూడెంట్లతో ప్రత్యేకంగా మానిటరింగ్​ టీమ్స్​ వేయనున్నారు. ఫుడ్ ప్రిపేర్ చేసే ముందే బియ్యం, నీళ్లు, కూరగాయలు, పప్పులు, ఇతర సామగ్రిని ఆ కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. సరిగా లేకుంటే వాటిని వెంటనే మార్పిస్తారు. ఫుడ్ ప్రిపేర్ అయ్యాక కూడా మరోసారి చెక్ చేస్తారు. టీచర్లు సైతం సామగ్రితోపాటు ఫుడ్​నూ పరిశీలిస్తారు. ఈ కమిటీలు ఓకే అని ఫొటోలు ఆన్​లైన్​లో అప్​లోడ్​చేశాకే పిల్లలకు భోజనం అందించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ద్వారా భోజనం అందుకుంటున్న ప్రతి సంస్థలోనూ టూ లెవల్​చెకింగ్​ అమలు చేయాలని నిర్ణయించారు.