1975 అక్టోబర్ లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆంధ్ర ప్రాంతం వారికి ప్రయోజనకరమైన అంశాలను అమలు చేసి, తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైన అంశాలను అమలు చేయలేదు. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతీయులకు కింది స్థాయి ఉద్యోగాల్లో కూడా అన్యాయం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సక్రమంగా అమలుచేయాలని తెలంగాణ ఎన్జీవో ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వినతిపత్రం సమర్పించారు. దీంతో ఐఏఎస్ అధికారి జయభారత్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో 1984లో ఎన్.టి.రామారావు ఒక త్రిసభ్య కమిటీని నియమించారు.
జయభారత్‌రెడ్డి కమిటీ - 1984
ఈ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అంటారు. ఐఏఎస్ అధికారి జయభారత్‌రెడ్డి అధ్యక్షతన ఐఏఎస్ అధికారులు కమల్‌నాథన్, ఉమాపతిలను సభ్యులుగా నియమించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు తీరును పరిశీలించడం, ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి జరిగాయో లేదో నిర్ధారించేందుకు కమిటీని నియమించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన తేదీ 1975 అక్టోబర్ 18 నుంచి 1984 వరకు జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటిని ఈ కమిటీ పరిశీలించి 36 పేజీల నివేదికను రూపొందించింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం అత్యధికంగా స్థానికేతరులు ఉద్యోగాలు పొందిన జిల్లాలు హైదరాబాద్ (22,722), ఖమ్మం (10,353), ఆదిలాబాద్ (5099), కరీంనగర్ (4638), నిజామాబాద్ (4286). మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యల్పంగా స్థానికేతర ఉద్యోగులు ఉండగా, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో స్థానికేతర ఉద్యోగులు ఉన్నారు. టీఎన్జీవో సంఘం నాయకుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్స్ కమిటీ నివేదికను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలు సూచించాల్సిందిగా సుందరేశన్ కమిటీని నియమించింది.
సుందరీశన్ కమిటీ -1985
ఎన్‌టి రామారావు ప్రభుత్వం నియమించిన జయభారత్ రెడ్డి కమిటీ సిఫారసులను పరిశీలించేందుకు సుందరీశన్ కమిటీని 1985లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 1985 డిసెంబర్లో సమర్పించింది.
జీవో 610 (1985)
జయభారత్‌రెడ్డి, సుందరీశన్ కమిటీల సిఫారసుల ఆధారంగా 1985 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 610 జీవోను విడుదల చేసింది. ఈ జీవో 1986 మార్చి 31 నాటికి అమలు కావాలని పేర్కొంది. కానీ వాస్తవంలో 610 జీవో ఇప్పటివరకు అమలు కాలేదు. 1975–85 వరకు 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఉపాధిలో జరిగిన అక్రమాలు నిలువరించడం 610 జీవో ప్రధాన ఉద్దేశం. 1985 డిసెంబర్ 30న జారీ చేయబడిన 1986 మార్చి 31 నాటికి ఈ జీవో అమలు పూర్తి కాలేదు. స్థానికేతరులు సంపాదించిన ఉద్యోగాల నుంచి వారిని తొలగించి, సూపర్ న్యూమర్ పోస్టులు సృష్టించి వారి ప్రాంతానికి పంపించాలి. వీరి స్థానంలో తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇదే 610 జీవో ప్రధానోద్దేశం అని ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రకటించారు.
610 జీవో కంటే ముందు రాయలసీమ వాసులకే స్థానిక ఉద్యోగాలంటూ ప్రభుత్వం వెలువరించిన జీవో 564ను ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. 610 జీవో అమలుకు నోచుకోకుంటే తిరిగి తెలంగాణ ఉద్యమం 2001 నాటికి ఉద్యమ రూపం దాల్చింది. 610 జీవో జారీ చేసిన 25 సంవత్సరాల తర్వాత కూడా ఆ జీవో అమలు కాకపోవడంతో తెలంగాణ ఉద్యమ తీవ్రత పెరిగింది.
గిర్గ్లాని కమిషన్ - 2001, జూన్ 25
గిర్ గ్లానితో ఏకసభ్య కమిషన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ 610 జీవో అమలు తీరు అధ్యయనం కోసం నియమించింది. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీని కోరింది. ప్రభుత్వం, ప్రభుత్వశాఖల సహకారం లేకపోయనానిర్ణీత సమయంలో ఈ కమిటీ తన తొలి నివేదికను 2001 అక్టోబర్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ తన తుది నివేదికను 2004 సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి అందజేసింది. తెలంగాణవాదులు ఆందోళనలు చేసిన తర్వాత మాత్రమే గిర్గ్లానీ నివేదికను బహిర్గతం చేశారు.
ప్రధాన అంశాలు
1976 అక్టోబర్ 18 నుంచి 5, 6 జోన్లలో జోనల్, జిల్లా నియామకాలు నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులను 1986 మార్చి 31 నాటికి సూపర్ న్యూమరరి పోస్టులు సృష్టించి వెనక్కి పంపించాలి.
జూరాల, శ్రీశైలం ఎడమ కాలువ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు నాన్ గెజిటెడ్ కేడర్లలో నియమించిన స్థానికేతులందరిని వారికి సంబంధించిన జోన్లకు బదిలీ చేయాలి.
రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఇతర రాష్ట స్థాయి కార్యాలయాల్లో ఉండే ఉద్యోగుల నియామకంలో అన్ని లోకల్ కేడర్లకు (అన్ని ప్రాంతాల వారికి) సమన్యాయం జరగాలి.
బోగస్ సర్టిఫికేట్ల ద్వారా తెలంగాణ ప్రాంతపు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల్లో పేరు నమోదు చేసి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన స్థానికేతరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి.
అక్రమ నియామకాలు, ప్రమోషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం అభ్యర్థులు చేసుకున్న అప్పీళ్లన్నింటిని 1986, మార్చి 31 నాటికి పరిష్కరించాలి.
వివిధ లోకల్ ఏరియాలు, కేడర్ల మధ్య సిబ్బంది బదిలీలను విచ్చలవిడిగా చేయరాదు.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులోకి వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలు, ప్రయోషన్లు అన్నింటిని పున: పరిశీలించాలి. ఈ పనిని రాష్ట్ర సచివాలయ విభాగాలు 1986, జూన్ 30లోగా పూర్తి చేయాలి.
నివేదిక ముఖ్యాంశాలు
- ఓపెన్ కేటగిరిలో ఉన్న పోస్టులను నాన్‌లోకల్ కోటాగా వక్రీకరించారు.
- కొన్ని పోస్టుల పేస్కేళ్లను పెంచి లోకల్ క్యాండిడేట్లకు ఉన్న కోటాను తగ్గించడం.
- ముందుగా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఖాళీలకు బదులు రిజర్వ్ కేటగిరీకి సంబంధించి ఖాళీలతో నింపడం వల్ల స్థానికులకు నష్టం, స్థానికేతరులకు లాభం జరగడం.
- అక్రమ నియామకులపై అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను ఖాతరు చేయకపోవడం.
- స్వయం ప్రతిపత్తిగల సంస్థల్లో (కార్పొరేషన్లు, బోర్డులు) పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మాత్రమే ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేసి మిగిలిన సంస్థల్లో అది అమలు చేయకపోవడం.
- సెక్రటేరియట్ వంటి రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేసినప్పుడు అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగకపోవడం.
- స్థానికులకు సంబంధించిన బ్యాక్లాగ్పోస్టులను ఓపెన్ కేటగిరీకి మార్పు చేసి స్థానికేతరులను అందించడం.
- న్యాయశాఖలో బహిరంగంగా జరిగిన ఉల్లంఘనలు, అన్యాయపు నియామకాలు జరిగిన వివాదం.
- బోగస్ సర్టిఫికెట్ల ద్వారా అక్రమంగా ఉద్యోగాలు పొందిన స్థానికేతరుల సంఖ్యను నిర్ధారించడంలో శ్రద్ధ చూపించకపోవడం.
- ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ జోనల్ బదిలీల్లో జరిగిన అక్రమాలు, అనుసరించిన ఏకపక్ష ధోరణులు.