ఆర్టీసీ, మెట్రో జర్నీకి ఒకటే కార్డు.. టీమాస్ పేరుతో..

ఆర్టీసీ, మెట్రో జర్నీకి ఒకటే కార్డు.. టీమాస్ పేరుతో..
  • ​కామన్​ మొబిలిటీ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు 
  • టీమాస్ కార్డుతో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ప్లాన్
  • ఆయా డిపార్ట్​మెంట్ల అధికారులతో నడుస్తున్న చర్చలు
  • సక్సెస్ అయితే క్యాబ్, పార్కింగ్​చెల్లింపులు కూడా ఇందులోనే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ ​సిటీ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలో త్వరలో మరో కీలక అడుగు పడనుంది. ప్రయాణికులను ఈజీగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం స్మార్ట్ అండ్ ఈజీ సిస్టంను అందుబాటులోకి తీసుకురాబోతుంది. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు కామన్ మొబిలిటీ కార్డు(సీఎంసీ)ను తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటికే ఆయా డిపార్ట్​మెంట్ల అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు ఉమ్టా(యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్​పోర్టు అథారిటీ) అధికారి ఒకరు తెలిపారు. కొన్నేండ్లుగా కామన్ మొబిలిటీ కార్డును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నపటికీ.. శాఖల మధ్య సమన్వయ లోపంతో అమలుకు నోచుకోలేదు. తాజాగా కామన్ మొబిలిటీ కార్డును తీసుకొచ్చేందకు మెట్రో,  ఆర్టీసీ అధికారులు అంగీకరించినట్లు తెలుస్తున్నది. సక్సెస్​అయితే క్యాబ్, పార్కింగ్ చెల్లింపులు, ఇతర చెల్లింపులను కూడా సీఎంసీ పరిధిలోకి వస్తారని సమాచారం. 

టీమాస్ పేరుతో..
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని 2,800 ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. మెట్రో జర్నీ కోసం స్మార్ట్ కార్డులు వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో మెట్రోకు, ఆర్టీసీకి కలిపి ఒకటే కామన్ కార్డు తీసుకురానున్నారు.

ఆ తర్వాత ఆర్టీసీ కౌంటర్లు, మెట్రో స్టేషన్లలో టీమాస్ కార్డులను అందించనున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవల ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ టాప్ అప్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసును తెలంగాణ మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్(టీ మాస్) పేరుతో అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. 

లాస్ట్ మైల్ కనెక్టివిటీనే లక్ష్యం
రోజూ గ్రేటర్ ఆర్టీసీ బస్సుల్లో 25 లక్షల మంది, మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరందరిని ఒక వ్యవస్థ కిందికి తీసుకొచ్చి, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సౌకర్యం అందించాలని ప్రభుత్వం చూస్తోంది. త్వరలో నిర్మించబోయే మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ ఏ, బీ, నార్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గాల్లోని మెట్రో స్టేషన్ల కిందే బస్టాపుల కోసం స్థలాన్ని సేకరించారు. 

ప్రయాణికులు మెట్రో దిగి నేరుగా ఆర్టీసీ బస్సు ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు చేపట్టనున్నారు. త్వరలో క్యాబ్ సర్వీసులకు కూడా టీమాస్ సర్వీసులోకి తీసుకొస్తే సిటీలో ఏ మూల నుంచైనా.. ఒకటే కార్డు ద్వారా చెల్లింపులు చేసే వెలుసుబాటు ఉంటుంది. దీంతో ఆర్టీసీకీ, మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.