- 5 వర్సిటీల్లో పైలట్ ప్రాజెక్టు
- యూజీసీ చైర్మన్ జగదీశ్ వెల్లడి
న్యూఢిల్లీ: మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలోనే సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) స్కోర్ ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజీసీ)యోచిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చే కసరత్తు కోసం వివిధ యూనివర్సిటీల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలుచేసేందుకు 5 ప్రముఖ యూనివర్సిటీలను కూడా సెలెక్ట్ చేసినట్లు వివరించారు. "ఇందులోని సాధక బాధకాలను కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంది. ఇది అమలులోకి వస్తే విద్యార్థులు విడివిడిగా పలు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకునే బదులు ఒకే పోర్టల్ ద్వారా సింగిల్ విండో ప్రవేశాలు పొందవచ్చు" అని జగదీశ్ కుమార్ పేర్కొన్నారు.