టికెట్ రేట్ల పెంపుతో ఎవరికి నష్టం.?

  • ప్రేక్షకుడికి గుదిబండలా మారిన టికెట్ల ధర పెంపు
  • ఫ్యామిలీతో సినిమాకు వెళ్లలేని సామాన్యుడు
  • టికెట్ రేట్లు ఇంకా పెంచితే  డేంజరే వివేక్ కూచిబొట్ల
  • కంటెంట్ బాగుంటే.. కచ్చితంగా వస్తారు సినీ నిర్మాత
  • కండిషన్లు పెడితేనే దార్లోకి వస్తారంటున్న పలువురు నిర్మాతలు
  • ఓటీటీల రాకతో వీక్షకుడికి కాస్త ఉపశమనం

సినిమా రంగాన్ని పరిశీలిస్తే.. కరోనాకు ముందు... కరోనాకు తరువాత మధ్య తేడాలను సులభంగా గుర్తించవచ్చు. అన్ని రంగాలకంటే మూవీ ఇండస్ట్రీలో భారీ మార్పులు జరిగాయి. ఒక్కసారిగా కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో ఎంటర్ టైన్మెంట్ ప్రక్రియను చివరి ప్రయారిటీలో పెట్టుకున్నాడు ప్రేక్షకుడు. దానివల్ల సినీ పరిశ్రమలో పనిచేస్తున్న లైట్ బాయ్ నుండి  హీరో వరకు ఇబ్బంది పడ్డారు. ఆ నష్టం నుండి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. కానీ ఈ గ్యాప్ లో ప్రేక్షకుడి థాట్ ప్రాసెస్ మారిపోయింది. తనకు అందుబాటులో ,తక్కువ ధరకే ఎంటర్ టైన్మెంట్ వచ్చేసింది. ఓటీటీ, సోషల్ మీడియా రూపంలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటున్నాయి.  దీంతో థియేటర్ వ్యవస్థ పడరాని అగచాట్లు పడుతోంది.

దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు  టికెట్ రేట్లను భారీగా పెంచడంతో ఆ భారం మరింత ఎక్కువైంది. దీంతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్లో సినిమా చూడాలన్న కోరిక, కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల పెద్ద సినిమాలు ఎంతో కొంత లాభం గడించినా, చిన్న సినిమాలు మాత్రం ఇంకా కూరుకుపోయే దారుణ స్థితి. హాలిడే వస్తే హాయిగా ఫ్యామిలీతో సినిమాకు వెళ్లే పరిస్థితులు పోయి, కేవలం పెద్ద హీరో సినిమాకే.. అది కూడా కొన్ని సినిమాలకే పరిమితం కావడం చూస్తూనే ఉన్నాం. దీంతో థియేటర్లో కూర్చొని సినిమాను ఆస్వాదించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అంతే కాదు.. ఈ రోజు వందలు వందలు పెట్టి సినిమా చూసేకంటే.. నాలుగు రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా సరిపెట్టుకుంటున్నారు సగటు ప్రేక్షకుడు.  ఇదే అంశంపై ప్రముఖ సినీ నిర్మాత వివేక్ కూచిబొట్ల స్పందించారు.


 
టికెట్ రేట్లు పెంచితే డేంజరే...

‘‘టికెట్ రేట్లు పెరగడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిన మాట వాస్తవమే. ట్రెండు చూస్తుంటే అలాగే ఉంది. నిత్యావసరవస్తువులు రేట్లు కూడా పెరిగాయి కానీ వాటికి ప్రత్యామ్నాయం లేదు. పెట్రోల్ కొట్టించుకోకపోతే ముందుకు వెళ్లలేం. కానీ సినిమా థియేటర్లలో చూడకపోతే నాలుగు వారాళ్లో ఓటీటీలో కి వస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాలుగురు మల్టీప్లెక్స్ కి వెళితే నాలుగైదు వేలు ఖర్చవుతుంది.అదే ఐదు వేలు పెడితే 5 ఓటీటీలో సబ్ స్క్రిప్షన్ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం పెద్ద సినిమాలకే జనాలు వస్తున్నారు టికెట్ రేట్లు పెంచితే డేంజరే. ’’ అని వివేక్ అన్నారు.

మంచి ట్రైలర్, ప్రమోషన్స్ అవసరం... 

ఎక్కువగా పెద్ద సినిమాలు ఉన్నప్పుడు జనాలు థియేటర్ కు వస్తున్నారు. కానీ ఇందులో కూడా ఓ పాయింట్ ఉంది. జనాలను అట్రాక్ చేసేందుకు మంచి ట్రైలర్, ప్రమోషన్స్ అవసరం. అవి నచ్చితే టికెట్ రేట్ ఎక్కువ పెట్టి అయినా ప్రేక్షకుడు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్ గా డి.జె టిల్లు యే ఉదాహరణ. కొన్ని పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు ఎక్కువున్నా రాలేదు. ఇప్పుడు ఎఫ్ 3 రేట్లు పెంచం అని దిల్ రాజు గారు అంటున్నారు కాబట్టి అలాంటి కామెడీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. నెలకో సినిమా చూడాలని ఫిక్స్ అవుతున్నారు. ఒకప్పుడు వీక్లీ కంపల్సరీ సినిమా చూసేవాళ్లు. జనాలు థియేటర్లకు మళ్లీ రావాలంటే.. కొంచం టైమ్ పడుతుంది. మళ్లీ పూర్వవైభవం రావాలని అశిస్తున్నాను.’’ థియేటర్ జనాలు రాకపోవడం వెనుక ఓటీటీ యే కారణం అని చాలా మంది అభిప్రాయం. కానీ కంటెంట్ బాగుండి, గ్రాండ్ గా సినిమాను ప్రజెంట్ చేస్తే ఓటీటీ, టికెట్ రేట్ ఇష్యూ ఉన్నా వస్తారు వివేక్ తెలిపారు.

మళ్లీ థియేటర్లకు రప్పించొచ్చు..

‘‘టెక్నాలజీ, బిగ్గర్ ఎక్స్ పీరియన్స్ ఉంటే జనాలను మళ్లీ థియేటర్లకు రప్పించవచ్చు. టికెట్ రేట్లు, ఓటీటీ పెద్ద విషయం కాదు. సినిమా రిలీజైన 30 డేస్ కు ఓటీటీకి ఇస్తున్నారు. 60 రోజులకు టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఓటీటీ కి 30 రోజులకన్నా పొడగించి ఇస్తే పైరసీలో చూస్తాడు ప్రేక్షకుడు. కాబట్టి దాన్ని ఆపలేం’’ అని వివేక్ కూచిబొట్ల తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 ఇక ‘‘టికెట్ రేట్లు పెరగడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్నది 100 శాతం నిజమని.. పెద్ద సినిమాలకు కూడా సరిగా రావటం లేదని...  ట్రిపుల్ ఆర్ కు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా ఏ పెద్ద సినిమాకు జనం తండోపతండాలుగా రాలేదని పలువురు నిర్మాతలు అంటున్నారు. పెద్ద సినిమాలైన ‘‘ఆచార్య’’, ‘‘సర్కారు వారి పాట’’ రిజల్ట్స్ ఎలా ఉన్నా గానీ.. రావాల్సినంత కలెక్షన్లు రాలేదని.. ఆ సినిమాలు అంతగా ఆడకపోవడానికి టికెట్ రేట్స్ ఎక్కువుండటం వల్లేనని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాళ్లే చెప్పాలి.. 

టికెట్ రేట్లు పెంచడం వెనుక నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల హస్తం ఎక్కువగా ఉంది. వాళ్లు పెట్టిన డబ్బులు వెనక్కి తొందరగా రావాలని వాళ్లు అలా చేస్తున్నారు అంటున్నారు మరో  సినీ నిర్మాత. ‘‘ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాఫియాగా ఏర్పడి, వాళ్ల స్వలాభం కోసం ఈ టికెట్ రేట్లను పెంచుకున్నారు. తద్వారా ప్రేక్షకుడు నష్టపోతున్నారు. ఉదాహరణకు నైజాంలో దిల్ రాజు, ఏషియన్ సునీల్ మేజర్ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల థియేటర్లను కాపాడుకోవడానికి, వారంలోనే వాళ్ల పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి దండుకుంటున్నారు. మేజర్ గా తెలుగు రాష్ట్రాల్లో టికెటింగ్ సిస్టమ్ మారాలి. డిల్లీ, కేరళ, బెంగళూరులో ఉన్నట్టు ‘‘వీక్ డేస్ కు ఒకలాగ, వీకెండ్ కు ఒకలాగా కింద సీట్లు, బాల్కనీ సపరేట్ గా పెట్టాలి. అలాంటప్పుడే పేద, మధ్య తరగతి ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తారు. థియేటర్లు పెరిగాయి కాబట్టి ఇలా రేట్లు డివైడ్ చేసి పెట్టాలి. అప్పుడే జనాలను థియేటర్లకు రప్పించవచ్చు. నైజాం లో దిల్ రాజు, సునీల్ ఇద్దరే డిస్ట్రిబ్యూటర్లే కాబట్టి వాళ్లే నిర్మాతలకు ఖరాఖండిగా చెప్పాలి. ఈ రేట్ కే కొంటాం అని ఫిక్స్ చేయాలి. వాళ్లిద్దరినీ దాటి ఎవరూ కొనరు. కానీ అలా కాకుండా వాళ్లు ఎక్కువ రేట్లకు కొని జనాలపై భారం మోపుతున్నారని పలువురు వాపోతున్నారు.

కండిషన్లు పెడితేనే దార్లోకి వస్తరు..

‘‘సినిమా రిలీజైన 5 వారాలకు ఓటీటీకి ఇస్తామని అంటున్నారు నిర్మాతలు. కానీ ఒకవేళ సినిమా కు డివైడ్ టాక్ వస్తే 3 వారాలకే ఇచ్చేస్తారు. అది కూడా వాళ్ల ఇష్టానుసారంగానే మారుతోంది. నిర్మాతలు అంతా కలిసి చిన్న సినిమా 6 వారాల తర్వాత, పెద్ద సినిమా 8 వారాల తర్వాత ఇవ్వాలని తీర్మానం మాట్లాడుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ లు కూడా అలా చేస్తేనే కొంటాం అని కండిషన్ గనక పెడితే తప్పకుండా అందరూ దారిలోకి వస్తారు. కానీ అలా చేయరు. ఎక్కువ డబ్బులు వచ్చేసరికి రెండు మూడు వారాలకే ఇచ్చేస్తున్నారు. మొదట్లో ఓటీటీ వాళ్లు ఎప్పుడూ కూడా రెండు మూడు వారాలకు రిలీజ్ చేయలేదు. ఇదంతా పెద్ద నిర్మాతలు అలవాటు చేసిందే..’’ అంటూ కొందరు నిర్మాతలు తమ భావాన్ని తెలిపారు.

తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టుంది సినిమా పెద్దల తీరు. ఇప్పటివరకు కష్టపడి నిర్మించుకున్న థియేటర్ బిజినెస్ ను ఎవరి స్వలాభం కోసం వాళ్లు ఇలా చంపుకుంటున్నారనే మాట వాస్తవం. ఇప్పటికిప్పుడు అందరూ మేల్కొని కొన్ని కండిషన్లు పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయకపోతే తప్ప థియేటర్ వ్యవస్థ గాడిన పడదని సినీ వర్గాల టాక్.