జగన్ కు చేసింది చెప్పుకోవడం చేతకావడం లేదు.. కడపలో ఆకాశరామన్న ఫ్లెక్సీ ప్రకంపనలు

జగన్ కు చేసింది చెప్పుకోవడం చేతకావడం లేదు.. కడపలో ఆకాశరామన్న ఫ్లెక్సీ ప్రకంపనలు

చేసింది చెప్పుకోలేక ఓడిపోయాము.. 2024 ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ నాయకుల నోటి నుండి వచ్చిన మాట. పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందించినప్పటికీ ప్రజలు తమను ఎందుకు గెలిపించలేదో అర్థం కావట్లేదంటూ స్వయానా వైసీపీ అధినేత జగన్ చాలా సార్లు మీడియా ముఖంగా అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో వెలసిన ఆకాశరామన్న ఫ్లెక్సీ కడపలో కలకలం రేపుతోంది.. జగన్ కి చేసింది చెప్పుకోవడం చేతకావడం లేదంటూ కడప యాసలో ఉన్న ఈ ఫ్లెక్సీపై ఓ టేబుల్ రహో సహా గత చంద్రబాబు ప్రభుత్వంలో 2018-2019 లో వైయస్ జగన్ హయాంలో చివరి ఆర్థిక సంవత్సరంగా ఉన్నటువంటి 2023-2024 లో రాష్ట్రంలో నమోదైన వార్షిక ఆదాయం గురించి డేటాతో సహా ఉండటం ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

చంద్రబాబు హయాంలో 2018-19 మధ్యలో  రాష్ట్ర జాతీయోత్పత్తి 7.9 లక్షల కోట్లు ఉండగా.. జగన్ హయాంలో 2023 నుండి 2024 వరకు 12.91 లక్షల కోట్లకు పెరిగిందంటూ ఫ్లెక్సీలో ఉంది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ.. ఫ్లెక్సీ చివరిలో వైసీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏదో ఫ్రెండ్షిప్ కోసమే చెబుతున్నాను అంటూ ముగించడం ఇక్కడ ట్విస్టు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది. 

2024 ఎన్నికలకు ముందు నుండి.. జగన్ హయాంలో అభివృద్ధి గాలికి వదిలేశారని.. సంపద సృష్టి జరగలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించగా..  వైసిపి హయాంలో ఏపీలో అధికంగానే సంపద సృష్టించింది అంటూ సమాధానం ఇచ్చింది కేంద్రం. ఇదే అంశంపై ఇప్పుడు కడపలో ఫ్లెక్సీ ప్రత్యక్షమవ్వటం ఏపీలో కలకలం రేపుతోంది. ఎక్కడా పార్టీ ప్రస్తావన లేకుండా కామన్ మ్యాన్ పేరిట గణాంకాలతో సహా ఫ్లెక్సీ ప్రత్యక్షమవడం అధికార కూటమి నేతలను డిఫెన్స్ లో పడేసిందనే చెప్పాలి.