పద్మ అవార్డులు తారుమారు..క్లెయిందారులిద్దరికీ హైకోర్టు సమన్లు

పద్మ అవార్డులు తారుమారు..క్లెయిందారులిద్దరికీ హైకోర్టు సమన్లు
  • గ్రహీత పేరుతో ఇద్దరు ఉండడంతో ఒడిశాలో గందరగోళం
  • క్లెయిందారులిద్దరికీ సమన్లు జారీ చేసిన ఒడిశా హైకోర్టు

భువనేశ్వర్: సాహిత్య రంగంలో వచ్చిన పద్మశ్రీ అవార్డు తనదేనంటూ 'అంతర్యామి మిశ్రా' అనే పేరు గల ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం ఒడిశా హైకోర్టును షాక్ కు గురిచేసింది. కేంద్రం 2023లో పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 

లిస్టులో పేరు ఉండటంతో వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన అంతర్యామి మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. అయితే, అది తనకు వచ్చిన అవార్డు అని పేర్కొంటూ ఒడిశాకు చెందిన డాక్టర్ అంతర్యామి మిశ్రా హైకోర్టును ఆశ్రయించాడు. 

తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును తన పేరు గల ఓ జర్నలిస్ట్ అందుకున్నాడని తన ఫిటిషన్ లో వివరించాడు. ఒడియాతోపాటు ఇతర భారతీయ భాషలలో తాను 29 పుస్తకాలు రచించినట్లు తెలిపాడు. అందుకే పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాలోని 56వ స్థానంలో తన పేరు చేర్చినట్లు చెప్పాడు. 

జర్నలిస్ట్ అయిన అంతర్యామి మిశ్రా ఎటువంటి పుస్తకం రాయలేదని పేర్కొన్నాడు. ఈ పిటిషన్ ను జస్టిస్ ఎస్.కె పాణిగ్రాహి మంగళవారం విచారించారు. ప్రభుత్వం ధ్రువీకరణ ప్రక్రియను  కచ్చితత్వంతో నిర్వహించినప్పటికీ, ఒకేలాంటి పేర్ల కారణంగా గందరగోళం ఏర్పడిందని కోర్టు వ్యాఖ్యానించింది.  

ఈ గందరగోళం పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ విశ్వసనీయతపైనే ఆందోళనలను లేవనెత్తుతుందని తెలిపింది. క్లెయిందారులిద్దరూ తమ వాదనలను నిరూపిం చడానికి అన్ని ప్రచురణలను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న ఇద్దరూ విచారణకు భౌతికంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.