
- దర్శనానికి గంటల తరబడి బారులు
కోల్బెల్ట్/ మంచిర్యాల/ తిర్యాణి, వెలుగు: సమ్మక్క–సారక్క జాతరలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. రామకృష్ణాపూర్ పట్టణ శివారు ఆర్కే1ఏ గని సమీప పాలవాగు ఒడ్డున, శ్రీరాంపూర్లోని ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్న జాతరలు కిటకిటలాడాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.
రామకృష్ణాపూర్ లో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజుల దర్శనం ఒకేసారి జరగడంతో గురువారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు జాతర ప్రాంతానికి చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వనదేవతలను దర్శించుకునేందుకు బారులు తీరారు. రెండు గంటల అనంతరం అమ్మవార్ల దర్శనభాగ్యం కలిగింది. మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులు, ఏరియా ఆసుపత్రి,రాజకీయ పార్టీల లీడర్లు జాతరలో సేవలందించారు.
మొక్కులు సమర్పించుకున్న ప్రముఖులు
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మందమర్రి ఏరియా జీఎం ఎ.మనోహర్-సవిత, సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్, మందమర్రి ఏరియా సింగరేణి ఎస్ఓటుజీఎం రాజశేఖర్రెడ్డి, పర్సనల్ మేనేజర్శ్యాంసుందర్, ఆర్కేపీ ఓసీపీ గోవిందరావు, ఆర్కేపీ మేనేజర్ వెంకటేశ్వర్లు, కార్మిక, రాజకీయ సంఘాల లీడర్లు, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరాంపూర్ఏరియా సీసీసీ నస్పూర్ముక్కిడి పోచమ్మ ఆలయ ఆవరణలో నిర్వహించిన జాతరలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
మంచిర్యాలలో గోదావరి నది తీరంలో జాతర జోరుగా సాగింది. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎత్తు బంగారం సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎత్తు బంగారాన్ని మంచిర్యాల కాంగ్రెస్ లీడర్లు సమర్పించారు. తిర్యాణిలో సమ్మక్క, సారలమ్మ వనదేవతలకు భక్తులు మహాలక్ష్మి బోనాలు సమర్పించారు. నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.