జీతాల్లేక ‘సారథుల’ తిప్పలు.. గట్టిగా అడిగితే వేధింపులు

పర్మినెంట్​ ఊసే లేదు.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన
 ‘‘ఉద్యమ సమయంలో ఎందరో వచ్చిన్రు. పోయిన్రు..  కానీ కడదాక నాతోపాటు ఉన్నది కళాకారులే. అందుకే మీ కష్టసుఖాల్లో నేనుంటా.  మీకిచ్చిన ఉద్యోగాలు చిన్నవే.  మీ కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పిస్తం. వాహన సౌకర్యం కల్పిస్తం. మీకు అండగా నేనుంటా..’’ - కొత్తగా ఉద్యోగాల్లో చేరిన టైంలో సాంస్కృతిక సారథి కళాకారుల మీటింగ్​లో సీఎం కేసీఆర్​ భరోసా.

జనగామ, వెలుగు :  సర్కారుకు, ప్రజలకు మధ్య ప్రచార వారధులైన సాంస్కృతిక సారథి కళాకారులకు జీతాలు రావడం లేదు.  మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్నాయి.  పాటే ఆధారంగా బతుకుబండి లాగుతున్న కళాకారులను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. బయట పాటలు పాడొద్దు.. ప్రభుత్వ పథకాల ప్రచారమే చెయ్యాలనే రూల్స్​తో బయటి ఆదాయ వనరులు లేక, ఇటు జీతం రాక తిప్పలు పడ్తున్నారు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక పోతున్నారు. జీతాలియ్యాలని వేడుకుంటున్నా పట్టించుకున్న వారు లేక నరకం అనుభవిస్తున్నారు. పట్టించుకోవాల్సిన సారథి చైర్మన్​ నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. 

పూటగడవక తిప్పలు..
రాష్ట్రం మొత్తంగా 584 మంది కళాకారులు పనిచేస్తున్నారు.  గతంలో నెలలో  వెనకా ముందు అన్నట్లు ఇవ్వగా  మొన్నటి మే నెల నుంచి నేటి వరకు మూడు నెలలుగా మొత్తానికే ఇవ్వడం లేదు. పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది పేదలే ఉన్నట్లు కళాకారులు చెప్తున్నారు. భర్త లేని మహిళలు, ఒంటరి మహిళలు, జీతమొస్తే గాని పూట గడవని వారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. వారంతా తమ వాట్సాప్​ గ్రూపుల్లో ఆవేదన వెళ్లగక్కుతున్నా కనీసం పట్టించుకున్న వారు లేరని వాపోతున్నారు.  సర్కారు కొలువు కావడంతో వదులుకోలేక.. జీతం రాక కుటుంబ పోషణ కష్టంగా మారిందంటున్నారు. 

చెప్పిందొకటి.. చేసిందొకటి 
కొలువులో చేరినప్పుడు పర్మనెంట్​ ఉద్యోగాలని, సర్కారు ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన సర్కారు ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. జాయినింగ్​ అప్పుడు చెప్పిన రూ 24,514 మాత్రమే వేతనంగా అందుతోంది.  ఎనిమిదేండ్లుగా ఇదే పరిస్థితి. టీఏ, డీఏ తదితర ఏ అలవెన్స్​లు లేవు. కనీసం ఈ జీతమైనా టైంకు ఇస్తారా అంటే అదీ లేదు. వచ్చే జీతంలో సగం డబ్బులు బస్​ చార్జీలకు, తదితర ఖర్చులకు సరిపోతుందని అంటున్నారు. 

అడిగితే టార్చర్​
జీతాలు రావడం లేదని గట్టిగా అడిగితే ట్రాన్స్​ఫర్​ హెచ్చరికల పేరిట టార్చర్​ చేస్తున్నట్లు కళాకారులు వాపోతున్నారు. చేసిన పనికి జీతం అడిగితే కూడా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కళాకారులను ఒక చోట నుంచి మరో చోటకు ట్రాన్స్​ఫర్​చేశారు. జీతం రాని పరిస్థితుల్లో దూరప్రాంతాల్లోకి వెళ్లి ఎలా డ్యూటీలు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. సొంత జిల్లా పరిధిలోనే పనిచేసేలా చర్యలు చేపట్టాలని విన్నవించినా పట్టించుకున్న వారు లేరంటున్నారు. నిరుడు హైదరాబాద్​ రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథి చైర్మన్​ రసమయి బాలకిషన్​ కళాకారుల సమ్మేళనం నిర్వహించి 30 శాతం పీఆర్సీ, హెల్త్​ కార్డులు, ఇన్సూరెన్సు​ సౌకర్యం వర్తింప జేస్తానని మాటిచ్చినా నేటికీ దిక్కూ మొక్కూ లేదని వాపోతున్నారు. కనీసం ఇచ్చే జీతమైనా సకాలంలో ఇవ్వాలని కళాకారులు కోరుతున్నారు.